Abn logo
May 24 2020 @ 02:34AM

పరిశ్రమా? ఫలించని శ్రమా?

సినిమా వినోదం తెస్తుంది. కాలక్షేపం ఇస్తుంది. కొన్ని వేలమంది చెమటతో కాసులూ సంపాదించి పెడు తుంది. కానీ, ఈ కళాత్మక వ్యాపారంలోని సృజనాత్మక శ్రమనూ, ఖజానాకు కోట్ల కొద్దీ పన్ను కట్టే ఈ రంగాన్నీ పరిశ్రమగా ప్రభుత్వాలు గుర్తిస్తు న్నాయా? రంగుల ప్రపంచంలోని తెర వెనుక కష్టాలు తీరాలంటే ఈ రంగానికి ఏం కావాలి? ఏం చేయాలి?


కరోనాతో ‘‘సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోయిన మాట నిజం. కేంద్రం తరఫున ఎలా ఆదుకోవాలో చూస్తాం.’’ 

సాక్షాత్తూ కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలివి. తెలుగు సినీపెద్దలతో సంభా షిస్తూ, ఆయన అన్న మాటల్లో నిజం ఉంది. ఒక్క తెలుగు సీమలోనే రోజుకు 50 వేల మంది, దేశం మొత్తం మీద 4 లక్షలపైగా ఆధారపడ్డ మన సినిమా ఒక పరిశ్రమగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికి 107 వసంతాలు నిండిన భారతీయ చిత్రనిర్మాణాన్ని 22 ఏళ్ళ క్రితం 1998 లోనే పరిశ్రమగా గుర్తించారు. వాజ్‌పేయి హయాంలో సుష్మా స్వరాజ్‌ సమాచార మంత్రిగా ఉన్నప్పుడు ఆ మేరకు ప్రకటనా వచ్చింది. ‘‘మొదట్లో బ్యాంకు రుణాలకు అది ఉప యోగపడ్డా, రానురానూ ఆ హోదా వట్టి పేరుకే మిగిలింది. పరిశ్రమలకు లభించే రాయితీలేవీ సినీరంగానికి ఇప్పటికీ లేవు’’ అని నిర్మాత ‘జెమినీ’ కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 


10 కోట్ల అప్పుకు 20 కోట్ల హామీ!

చాలాకాలంగా సమస్యలున్నా సినీరంగం బండి నెట్టేస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు కరోనా వచ్చి, అందరూ కలసి కూర్చొని చర్చించుకొనే సావకాశం ఇచ్చింది. సినిమాను పరిశ్రమగా గుర్తించిన తొలిరోజుల్లో ప్రభుత్వరంగ  బ్యాంక్‌ ‘ఐ.డి.బి.ఐ’ సినిమా నెగటివ్‌ రైట్లను అట్టిపెట్టుకొని, చిత్ర నిర్మాణానికి అప్పిచ్చేది. నిర్మాతలు సజావుగా రుణాలు తీర్చేస్తూవచ్చినా, తరువాత కాలంలో అది ఆగింది. బయటి బ్యాంకులు నెగటివ్‌ రైట్లతో పాటు 200 శాతం మేర కొల్లేట రల్‌ హామీ కావాలన్నాయి. దాంతో, నిర్మాతకు రూ.10 కోట్లు అప్పు కావాలంటే, 20 కోట్ల విలువైన స్థలమో, పొలమో కొల్లేటరల్‌ హామీగా చూపాల్సిన పరిస్థితి. వెరసి బ్యాంకు లైతే 12 -14 శాతమే వడ్డీ అయినా, నిర్మాతలు గత్యంతరం లేక 24 - 36 శాతం ‘సినిమా వడ్డీ’పై అప్పిచ్చేవాళ్ళ మీదే ఆధారపడుతున్నారు. ‘‘కొల్లేటరల్‌ లేకుండా నెగటివ్‌ రైట్లు మాత్రమే ఉంచుకొని, చిత్రనిర్మాణానికి అప్పులిచ్చే ఏర్పాటు చేయాలి. వివిధ పరిశ్రమల లాగా సినీపరిశ్రమకూ ఒక తరహా ఫైనాన్స్‌ సిస్టమ్‌ పెడితే బాగుంటుంది’’ అని నిర్మాత - స్టూడియో అధినేత డి. సురేశ్‌ బాబు అభిప్రాయపడ్డారు.


బిల్లు కట్టాలి! బీమా లేదు!!

విద్యుచ్ఛక్తిలోనూ సినిమాకు పరిశ్రమ ట్యారిఫ్‌ వర్తించ ట్లేదు. ‘క్యాప్టివ్‌ పవర్‌’ విధానంలో తమకు తామే విద్యుత్‌ ఉత్పత్తి చేసుకొని, వాడుకుంటామని సినీ పెద్దలు ముందు కొచ్చినా దానికీ ప్రభుత్వాలు పచ్చజెండా ఊపట్లేదు. ‘‘స్టూడి యోలే కాదు... చివరకు సీజన్‌ లేనప్పుడు హాలు నడపక పోయినా, తీసుకున్న హెచ్‌.టి లైనుకు కరెంట్‌ బిల్లు కట్టా ల్సిన అవస్థలో ఎగ్జిబిటర్లున్నారు’’ అని గుంటూరు పల్లవీ కాంప్లెక్స్‌ పి.వి. రామిరెడ్డి వాపోయారు. బీమా సంగతికొస్తే, కోట్ల విలువైన సినిమాకు నెగటివ్‌ పోతే, హార్డ్‌ డిస్క్‌ పోతే రూ.12 వేలు ఇస్తామనే పాత పద్ధతులే ఇప్పటికీ ఉన్నాయి. ‘‘అమెరికా, బ్రిటన్‌లలోలా షూటింగులు, రిలీజుల్లో ఏవైనా అవాంతరాలు వస్తే ఆదుకొనేలా సినీరంగానికే ప్రత్యేకమైన బీమా పాలసీ మన దేశంలో లేదు. అది అవసరం’’ అని నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. 

అలాగే, జపాన్‌, మారిషస్‌ మొదలు బ్రిటన్‌, ఐస్‌ల్యాండ్‌, ఫిజీ దాకా ఎక్కడ సినిమా తీసినా, అక్కడ చేసిన నిర్మాణ వ్యయంలో 50 శాతం నుంచి 80 శాతం దాకా ఆ దేశాలు రిబేట్లు ఇస్తున్నాయి. ‘‘కరోనా వల్ల షూటింగ్‌కు ఫారిన్‌ వెళ్ళే పరిస్థితే లేదు. టూరిజమ్‌కు తోడ్పడే అలాంటి రిబేట్లు మన దేశంలో సినిమాకిస్తే, ఇటు మన సినిమా, అటు టూరిజమ్‌ రెండూ అభివృద్ధి చెందుతాయి’’ అని వివేక్‌ సూచించారు.


హాలీవుడ్‌కూ, మనకూ ఒకటే ట్యాక్సా!

హింస, శృంగారం, అసభ్యపదాలు సెన్సారింగ్‌ లేని సీరియళ్ళలో, ఓ.టి.టిలలో యథేచ్ఛగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సెన్సార్‌ ఉన్న సినిమా మాత్రం ఆ సాహసం చేయలేక, హాలులో గుడ్లప్పగించి చూడక తప్పనిస్థితి. మరోపక్క సినిమా వెంటే నెట్‌లో వచ్చేస్తున్న పైరసీ భూతం ఉంది. కేసు పెట్టినా, ఇప్పుడున్న చట్టం ప్రకారం పైరసీదారులు అతి తక్కువ మొత్తం కట్టి, ‘స్టేషన్‌ బెయిల్‌’తో బయటకు వచ్చేయవచ్చు. ‘‘ఓ పాకిస్తానీ, ఆస్ట్రేలియా కేంద్రంగా తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో వేస్తున్న ఘటనను సాక్షాత్తూ కేంద్ర మంత్రే ప్రస్తావించారు. అందుకే, యాంటీ పైరసీ చట్టాన్నీ పటిష్ఠం చేయకపోతే పరిశ్రమ బతకదు’’ అని ఫిల్మ్‌ఛాంబర్‌ కార్యదర్శి, నిర్మాత దామోదర ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. మూడేళ్ళుగా వినోదపన్ను స్థానంలో వసూలు చేస్తున్న జీఎస్టీలో లోపాలున్నాయి. హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలతో సమానంగా చిన్నస్థాయి ప్రాంతీయ సినిమాకూ అంతే 18 శాతం పన్నువేస్తున్నారు. ‘‘ఇది ఇంగ్లీష్‌, హిందీ సినిమాలకే లాభం. అలాకాక, ఫ్రాన్స్‌లోలా స్థానిక భాష, సంస్కృతీ వైవిధ్యాలను ప్రోత్సహించేలా ప్రాంతీయ సినిమాలకు తగ్గ జీఎస్టీ వసూలుచేయాలి’’ అని సురేశ్‌బాబు పేర్కొన్నారు. 


పేరుకే ఇది పరిశ్రమ!

కరోనాతో 20లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామన్న కేంద్రం, సినీరంగానికి ఇరవై పైసలైనా విదిలించలేదు. ‘‘వేలమంది ఉపాధి కోల్పోతున్న సినీపరిశ్రమకూ ప్యాకేజీ ఇస్తే బాగుం టుంది’’ అని నిర్మాత త్రిపురనేని చిట్టి సూచిస్తున్నారు. ఆటో మొబైల్‌ పరిశ్రమ లాంటివి కునారిల్లితే వాటికి పన్ను రాయితీలిచ్చినట్లే, సినీసీమనూ ఆదుకోవాలనినిర్మాత అనిల్‌ సుంకర లాంటి వారు కోరుతున్నారు. అయితే, ఎన్ని హోదాలు, రాయితీలు ఇచ్చినా సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు సి. కల్యాణ్‌ అన్నట్టు ‘‘ముందుగా పెద్ద యెత్తున హాలుకొచ్చి, సినిమా చూసేలా జనంలో భయం పోగొట్టాలి. ప్రభుత్వం కరోనాకు టీకా తెస్తేనే ఆ ధైర్యం వస్తుంది. పరిశ్రమ తాజా కష్టాలకు మొదటి మందు అదే! అది వేశాక, ప్రభుత్వసాయంతో పరిశ్రమకు మిగతా చికిత్స సత్వరం చేయాలి.’’ లేదంటే, కరోనా తరువాత కూడా మన సినిమా... ఎప్పటికీ పేరుకే పరిశ్రమ... తీసేవాళ్ళకు శ్రమగా మిగిలిపోతుంది.


-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్యడెస్క్)

ఇది కూడా చదవండిImage Caption

సినిమా కష్టాలు

Advertisement
Advertisement
Advertisement