శోభన్‌బాబు ప్లేసులో వెంకటేశ్‌

ABN , First Publish Date - 2020-05-24T05:30:00+05:30 IST

సుమంత్‌ ఆర్ట్స్‌ అధినేత ఎమ్మెస్‌ రాజు నిర్మించిన తొలి చిత్రం ‘శత్రువు’. ఆయన తండ్రి రాయపరాజు కూడా నిర్మాతే. చిరంజీవితో రెండు సినిమాలు తీశారాయన. తండ్రి వారసత్వాన్ని అందుకొని నిర్మాతగా 1991లో ‘శత్రువు’ చిత్రాన్ని తొలిసారిగా...

శోభన్‌బాబు ప్లేసులో వెంకటేశ్‌

సుమంత్‌ ఆర్ట్స్‌ అధినేత ఎమ్మెస్‌ రాజు నిర్మించిన తొలి చిత్రం ‘శత్రువు’. ఆయన తండ్రి రాయపరాజు కూడా నిర్మాతే. చిరంజీవితో రెండు సినిమాలు తీశారాయన. తండ్రి వారసత్వాన్ని అందుకొని నిర్మాతగా 1991లో ‘శత్రువు’ చిత్రాన్ని తొలిసారిగా నిర్మించారు. అయితే ఈ సినిమాలో మొదట అనుకొన్న హీరో వెంకటేశ్‌ కాదు.. శోభన్‌బాబు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ కావడంతో  ఆయన దగ్గరకు వెళ్లి సినిమా చెయ్యమని కోరారు ఎమ్మెస్‌ రాజు. అయితే చిత్రనిర్మాణం అంటే రిస్క్‌తో కూడుకొన్న వ్యవహారం కనుక సినిమా జోలికి పోవద్దని ఎమ్మెస్‌ రాజుకు సలహా ఇచ్చారు శోభన్‌బాబు.  అంతే కాదు తనతో తీసే సినిమా ప్లాప్‌ అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న స్నేహం చెడిపోతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుక సినిమా చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పారు శోభన్‌బాబు. 


హీరో ఎవరా! అని వెతుకుతున్న తరుణంలో వెంకటేశ్‌  ఎమ్మెస్‌ రాజు దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ సమయంలో నాగార్జున వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వెంకటేశ్‌ వద్దనీ, నాగార్జునని హీరోగా పెట్టుకోమని శ్రేయోభిలాషులు ఎమ్మెస్‌ రాజుకు సలహా ఇచ్చారు. అరునా ఆయన వినలేదు. సరాసరి రామానాయుడు దగ్గరకు వెళ్లి వెంకటేశ్‌ డేట్స్‌ కావాలని అడిగారు. తనే కాదు అందరూ బాగుండాలనే మనస్తత్వం రామానాయుడిది. అందుకే ‘వెంకటేశ్‌ ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. హిట్స్‌  వచ్చిన తర్వాత నా దగ్గరకు రా.. డేట్స్‌ ఇస్తా’ అని చెప్పారు. అయినా సరే ఇప్పుడే వెంకటేశ్‌ డేట్స్‌ కావాల్సిందేనని పట్టుపట్టడంతో అతని గట్స్‌కు మెచ్చుకొని డేట్స్‌ ఇచ్చారు రామానాయుడు. అలా ‘శత్రువు’ మొదలైంది. విజయశాంతి కథానాయిక. కోడి రామకృష్ణ దర్శకుడు. 


‘శత్రువు’ నిర్మాణ సమయంలోనే విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే వెంకటేశ్‌ నటించిన ‘ధ్రువనక్షత్రం’, ‘బొబ్బిలిరాజా’ చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇవన్నీ ‘శత్రువు’కు కలిసొచ్చాయి. అలాగే విలన్‌గా నటించిన కోట శ్రీనివాసరావుకు ఎంతో  గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ‘ఈ ఫోన్‌ ఎవరు కనిపెట్టార్రా బాబో’ అనే ఆయన మేనరిజమ్‌ ప్రేక్షకుల్ని అలరించింది. చెన్నైలో జరిగిన ‘శత్రువు’ శతదినోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

-వినాయకరావు 


Updated Date - 2020-05-24T05:30:00+05:30 IST