వియత్నాంలో తెలుగు అడుగుజాడలు

ABN , First Publish Date - 2021-01-10T06:50:43+05:30 IST

యత్నాం వీరగాథలు మనందరికీ తెలిసినవే. అమెరికాపై విజయం సాధించిన వీరభూమిగా చరిత్రలో నిలిచింది. ‘ఇండో చైనా’గా ప్రసిద్ధి చెందిన వియత్నాం తొలి రాజ్యం చంపాకు తెలుగు...

వియత్నాంలో తెలుగు అడుగుజాడలు

నాగార్జున కొండలో ఉన్న పాలరాతి బుద్ధ ప్రతిమ

హోచిమిన్ సిటీ ‘వియత్నాం హిస్టరీ మ్యూజియం’లోని ‘దంగ్ దౌంగ్’ బుద్ధ విగ్రహం


యత్నాం వీరగాథలు మనందరికీ తెలిసినవే. అమెరికాపై విజయం సాధించిన వీరభూమిగా చరిత్రలో నిలిచింది. ‘ఇండో చైనా’గా ప్రసిద్ధి చెందిన వియత్నాం తొలి రాజ్యం చంపాకు తెలుగు నేలతో సంబంధాలు ఉన్నాయి. అక్కడి తొలి శిల్పం అమరావతి రీతులతో ఏర్పడిందే. లిపికి మూలం మన నేలే. అక్కడి సాంస్కృతిక అవశేషాల్లో నేటికీ తెలుగుదనం ఉట్టిపడుతోంది.


మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంకల లాగే వియత్నాంలో ప్రాచీన రాజ్యాలకు తెలుగు నేలతో ఏదైనా సంబంధం లభిస్తుందేమోననే ఆశతో ఆ దేశ చరిత్ర అధ్యయనం చేయడం ప్రారంభించాను. చరిత్ర పునర్నిర్మాణంలో కీలకమైంది శాసనం, శిల్పం. మధ్య, దక్షిణ వియత్నాంలో పద్దెనిమిది వందల ఏళ్ల పాటు విలసిల్లిన రాజ్యం చంపా. చిన్న చిన్న రాజ్యాల సమూహం. అమరావతి, పండ్రంగం, వీరాపుర, సింహపుర, విజయ... వీరి రాజధానులు. ఈ రాజ్య ప్రజలను చామ్‌లని పిలుస్తారు. ఆగ్నేయాసియాలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన హిందూ రాజ్యాలలో చంపా ఒకటి. చంపా శిల్పాలు, నాట్య కళలు విశేష ఖ్యాతిని గడించాయి. సంస్కృతం రాజభాషగా ఉండేదట. జపాన్ రాజవంశీయులు కూడా తమ ఆలయాలలో పూజల కోసం చంపా రాజ్య సంస్కృత మంత్రరీతులను సంగ్రహించారట. ఇండోచైనాలో లభించిన అత్యంత పురాతనమైన శాసనం ‘వో కాన్’. క్రీస్తుశకం అయిదో శతాబ్దికి చెందినదిగా పేర్కొంటారు. ఇందులోని భాష, లిపి క్రీస్తు శకం 3వ శతాబ్దికి చెందిన నాగార్జునకొండను పరిపాలించిన ఇక్ష్వాకుల శైలిలో ఉందని ‘ది చామ్ ఆఫ్ వియత్నాం- హిస్టరీ, సొసైటీ అండ్ ఆర్ట్’ గ్రంథంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం. చంపా రాజ్యానికి సంబంధించి అత్యంత పురాతన, ప్రసిద్ధి చెందిన ఆలయం శివ భద్రేశ్వర. క్రీస్తుశకం 5వ శతాబ్దికి చెందినది. ‘క్రీ.శ. 3వ శతాబ్దిలో విజయపురి (నాగార్జునకొండ)లో ఉన్నన్ని దేవాలయాలు దేశంలో మరెక్కడా లేవు. వీటిలో అతి ప్రాచీనమైనది మహాదేవ పుష్పభద్రస్వామి దేవాలయం అని’ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాగార్జునకొండ వాల్యూమ్ 2లో స్పష్టంగా పేర్కొంది. అయితే నేడు ఆ ఆలయం పేరుకు మాత్రమే మిగిలి, కాలగతిలో కలిసిపోయింది. ఈ పుష్పభద్రస్వామి ఆలయానికి వియత్నాంలోని భద్రేశ్వర ఆలయానికి పేర్లలో సారూప్యత కన్పిస్తోంది. అంతేకాదు రెండిటిని ఇటుకలతోనే నిర్మించడం విశేషం. సంతాన సౌభాగ్యాలనిచ్చే హారతి దేవాలయం కూడా విజయపురిలో లభ్యమైంది. అక్కడా శిథిలాల్లో హారతి విగ్రహం బయటపడింది. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు భద్రవర్మ. అతడి పేరు మీదనే భద్రేశ్వర ఆలయంగా పేరువచ్చింది. భద్రవర్మ రాజధాని సింహపురం. విజయపురి- శ్రీపర్వత లోయ హిందూ, బౌద్ధాలకు ఆలంబనగా నిలచింది. చంపాలో కూడా తరవాతి కాలంలో బౌద్ధం పరిఢవిల్లింది. వీర జయశ్రీ హరివర్మ దేవ అనే రాజు సింహాసనం అధిష్టిస్తూ ‘‘రాజాధిరాజ శ్రీ చంపాపుర పరమేశ్వర’’గా ప్రకటించుకున్నాడు. మన శాలంకాయన రాజులు కూడా తమని తాము పరమేశ్వర స్వరూపాలుగా ప్రకటించుకోవడం విశేషం. అక్కడ దంగ్ దౌంగ్ అనే ప్రాంతం ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా ఉండేది. తొమ్మిదో శతాబ్దికి చెందిన ఇంద్రవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. చక్రవర్తిగా సింహాసనం అధిష్టించక ముందు ఆయన పేరు శ్రీ లక్ష్మీంద్ర భూమీశ్వర గ్రామస్వామి అని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇతడి రాజధాని నగరం ఇంద్రపురం. ఇక్కడ లభించిన బుద్ధుడి కాంస్య విగ్రహం అమరావతి శైలిలో ఉండడం విశేషం. అంతేకాదు చంపా తొలి శిల్పం అంటే క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి ముందున్నదంతా అమరావతి శైలిలో ఉందని అక్కడి చరిత్రకారులు స్పష్టపరిచారు. 


వీటన్నిటి ఆధారంగా నేటి వియత్నాంలో తెలుగు జాతి అడుగుజాడల్ని సృష్టించడానికి వెళ్లాను. ముందుగా హోచిమిన్ సిటీలోని ‘వియత్నాం హిస్టరీ మ్యూజియం’ను సందర్శించాను. అందులోకి అడగుపెట్టగానే ‘దంగ్ దౌంగ్’ బుద్ధ విగ్రహం స్వాగతం పలికింది. సుమారు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న ఆ విగ్రహాన్ని చూడగానే విస్మయం చెందాను. నేటి మన నాగార్జునకొండలో ఉన్న పాలరాతి బుద్ధ శిల్పానికి నూరు శాతం ప్రతిరూపం అది. అయితే నాగార్జునకొండలో శిల్పానికి కుడి చేయి శిథిలమైంది. చంపా రాజ్యానికి సంబంధించి అత్యంత ముఖ్యమైందిగా ఈ బుద్ధవిగ్రహాన్ని పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం 6 మిలియన్ డాలర్లకు బీమా చేయించిందట.


అక్కడి నుంచి మధ్య వియత్నాంలోని దనాంగ్‌కు వెళ్లాను. ఆ నగరంలోని ‘చామ్ మ్యూజియం’లో శివ లింగాలు, పార్వతి, లక్ష్మి, గణేష్, వేణుగోపాలస్వామి, బుద్ధుడు, అప్సరసలు తదితర శిల్పాలున్నాయి. చంపా రాజ్య అవశేషంగా ‘మిసన్ సిటీ’ని పేర్కొంటారు. అప్పటి చంపా రాజుల సాంస్కృతిక కేంద్రం అది. క్వాంగ్ నామ్ ప్రోవిన్స్‌లో ఉంది. ఈ క్వాంగ్ నామ్‌కు పాత పేరు అమరావతి. పర్వతాల మధ్య లోయ ప్రాంతం మిసన్ సిటీ. పక్కనే బాన్ నది ప్రవహిస్తోంది. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్ సైట్. పెద్ద మ్యాప్‌లో అక్కడ ఉన్న ఆర్కియాలాజికల్ సైట్స్ గురించి వివరాలు ఉన్నాయి. వీటి కాలాన్ని బట్టి ఎ నుంచి ఇ వరకూ సమూహాలుగా చేసి విభజించారు. ఒకప్పుడు 70 దాకా పురాతన ఆలయాలు ఉండేవట. వియత్నాం యుద్ధంలో అమెరికా వేసిన కార్పెట్ బాంబింగ్‌లో ఇక్కడి చాలా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం 30 పురాతత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిని క్రీస్తుశకం 4వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది వరకూ నిర్మించారట. చాలా ఆలయాలు ఆకారానికే అన్నట్టుగా ఉన్నాయి. లోపలి శిల్పాలను వెలికి తీసి దేశంలోని వివిధ మ్యూజియాలలో భద్రపరచారట. కాల్చిన ఎర్రని ఇటుకలను ఈ నిర్మాణాలలో వాడారు. రాళ్లతో నిర్మించినవి తక్కువే. మెట్లు, ద్వారాలు, వసారా, మండపం, గర్భగుడి, గోపురం ఇలా మన గుడులలాగానే నిర్మాణం ఉంది. కొన్ని ఆలయాల గోడలపై అప్సరసల రూపాలను చెక్కారు. ఆ ఆనవాళ్లు అలాగే ఉన్నాయి. వీటన్నిటిలో ప్రధానమైన ఆలయం ఎ1. ఇక్కడే ఒకప్పటి భద్రేశ్వర ఆలయం ఉండేది. ఏడో శతాబ్దిలో అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసమైన ఆ ఆలయాన్ని శంభువర్మ అనే రాజు పునర్నిర్మించాడట. అందుకే దానికి శంభుభద్రేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఆకాశాన్నంటుతున్నట్టుగా గోపురం ఉంటుంది. ఆ గోపుర పైభాగాన్ని చూడగానే కళ్ళు విస్మయంతో మరింతగా విప్పారాయి. ఆ గోపురం గుంటూరు జిల్లాలోని చేజర్ల కపోతేశ్వేర ఆలయ గోపురంలాగానే ఉంది. భారతదేశంలోని ప్రాచీన ఆలయాలలో కపోతేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇక్కడ గజ పృష్ఠాకారంలో ఉన్న గోపురం భారత ఆలయ శిఖర నిర్మాణంలో విశిష్టమైందిగా చరిత్రకారులు పేర్కొంటారు. బృహత్పలాయనులు, ఆనందగోత్రికులు, శాలంకాయనులు కందరపురాన్ని (నేటి చేజర్ల) పరిపాలించారు. వీళ్లందరి పేర్ల చివర వర్మ ఉండడం విశేషం. వియత్నాంలోని భద్రవర్మకి వీళ్లకీ ఏదైనా సంబంధం ఉందా? భద్రేశ్వర గుడి ఎదురుగా శివలింగం కూడా ఉంది. బి5 గోపురం కూడా ఇదే మాదిరిగా ఉంది. మరో నగరం నాత్రాంగ్‌ లోని ‘పో నగర్’ ఆలయ పైకప్పు కూడా గజ పృష్ఠాకారంలో ఉంది. ఇంకో రకంగా వర్ణించాలంటే ఓ ఓడను బోర్లిస్తే వచ్చే రూపంలో ఈ గోపురాలు ఉన్నాయి. ప్రాచీన తెలుగులో పోత అంటే ఒకలాంటి పడవ అనే అర్థమూ ఉంది. కపోతేశ్వరం ఇలా కూడా ఏర్పడి ఉండవచ్చు. ఈ రెండు చోట్లా ఓడల రూపంలో గోపురాల్ని నిర్మించడంలో మర్మం ఏమిటి? కాంబోడియా, వియత్నాం సరిహద్దులో ప్రీ వేంగ్ నగరం ఉంది. నేటి కాంబోడియాలో మూడో అతిపెద్ద నగరం ఇది. అలనాటి మన వేంగితో దీనికి ఏదైనా సంబంధం ఉందా? కాంబోడియా భాషలో ప్రీ వేంగ్ అంటే పెద్ద అడవి అని అర్థం అట. ఆ శిథిలాల మధ్య మనసంతా మూగపోయింది. వీటిని పరిరక్షించడానికి వియత్నాం ప్రభుత్వం గట్టిప్రయత్నాలే చేస్తోంది. ఆలయాల రూపురేఖలను కాపాడటానికి మరమ్మత్తులు చేస్తోంది. ఎండావానల నుంచి రక్షించడానికి కొన్నిటికి షెడ్లు వేశారు. ఆనాటి నిర్మాణాలకు సంబంధించి ఒక్క ఇటుకను కూడా వదిలేయకుండా మూటకట్టి అన్నిటినీ ఓ చోట పేర్చడం అబ్బురమనిపించింది.


స్థానిక వియత్నామీలతో సంభాషిస్తుంటే అలనాటి చామ్‌లు ఈనాటికీ క్వాంగ్‌నామ్ ప్రావిన్సులో ఉన్నారని తెలిసింది. వారిలో హిందువులు, ముస్లింలు అనే విభజన ఉంది. భారతదేశం వెలుపల నివసిస్తున్న అత్యంత ప్రాచీన హిందూ తెగలు రెండే ఉన్నాయి. ఒక తెగ ఇండోనేషియాలోని బాలిలో నివసిస్తుంటే మరో తెగ వియత్నాంలోని బాలమన్ చామ్‌లు. వీరి జనాభా అరవై వేల లోపు. బ్రాహ్మణ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. సంగీతం, నృత్యాలకు వీరు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. బాని చామ్‌లు ముస్లిం పద్ధతులు అవలంబించేవారు. వీరి సంఖ్య కాంబోడియాలో ఎక్కువగా ఉంది. అనాదిగా చంపా రాజ్యంతో చైనీయులకు, ఖ్మేర్‌లకు యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. క్రీస్తు శకం ఏడో శతాబ్దిలో చంపా మీదికి దండెత్తివచ్చిన చైనా సైన్యాధ్యక్షుడు పెద్ద ఎత్తున విధ్వంసం చేయడమే కాకుండా 1350 బౌద్ధ గ్రంథాలను తీసుకువెళ్లాడు. ఆఖరుకి పంతొమ్మిదో శతాబ్దిలో వియత్నాం రాజులు చంపాను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో చాలా మంది ఛామ్‌లు మలక్కా, ఫిలిప్పీన్ ద్వీపాలకు పారిపోయారట. గత శతాబ్దంలో కాంబోడియాలో జరిగిన నరమేధంలో లక్షలకు పైగా చామ్‌లు ఊచకోతకు గురయ్యారు. వియత్నాం ఏకీకృతం తరవాత చామ్‌లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో యాభై దాకా ఉన్న స్థానిక తెగల్లో చామ్‌లు ఒకరిగా మిగిలిపోయారు. నేటికీ చేతివేళ్లతో భోంచేస్తారని వీరి గురించి ప్రత్యేకంగా చెప్పడం విశేషం. ‘మేం వియత్నామీలం కాదు, చైనీయులం కాదు మాది ప్రత్యేక జాతి’ అని చామ్‌లు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి నేటికీ ప్రయత్నిస్తున్నారు. 


చంపాలోని రాజులు, నగరాల పేర్లు, ఆలయ వాస్తు, నిర్మాణ రీతులు, లిపి, వాస్తు... ఆనాటి తెలుగు నేలతో ఉన్న అనుబంధానికి గట్టి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రాథమిక పరిశోధనల్లోనే ఇన్ని విషయాలు బయటపడుతుంటే, ఇక చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, భాషాశాస్త్రవేత్తలు పూనుకుంటే ఆగ్నేయాసియా దేశాలలో తెలుగు జాతి ఘనకీర్తిని సమూలంగా వెలికితీయగలరు. వేల ఏళ్లనాడు మన ముత్తాతలు, జేజెమ్మల ఆశలకు ఊపిరిలూదిన ఆ నేలల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడికీ ఉంది. ఆ దిశగా యూనివర్సిటీలు, సంస్థలు కృషి చేయాలి.

డి.పి. అనురాధ

Updated Date - 2021-01-10T06:50:43+05:30 IST