Abn logo
Sep 26 2021 @ 00:44AM

మన జ్యోతి త్రి రజత ఖ్యాతి

  • మూడు పతకాలు కొల్లగొట్టిన తెలుగు ఆర్చర్‌
  • వ్యక్తిగత, మిక్స్‌డ్‌, టీం విభాగాల్లో రెండోస్థానం
  • వరల్డ్‌ చాంపియన్‌షిప్స్  

తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టింది..ఏకంగా మూడు పతకాలతో మెరిసింది..కాంపౌండ్‌ ఆర్చరీ వ్యక్తిగత, మిక్స్‌డ్‌, టీం విభాగాలలో మూడు రజతాలు సాధించింది..వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరి స్వర్ణంపై ఆశలు రేపిన సురేఖ, కొలంబియా ఆర్చర్‌తో హోరాహోరీగా సాగిన తుది పోరులో ఓటమితో త్రుటిలో టైటిల్‌ చేజార్చుకుంది..ఇక ఒకే చాంపియన్‌షి్‌ప్సలో మూడు పతకాలు కొల్లగొట్టిన జ్యోతి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మొత్తం ఆరు మెడల్స్‌తో కెరీర్‌ను సుసంపన్నం చేసుకుంది..


యాంక్టన్‌ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో శనివారం భారత్‌ మొత్తం మూడు రజత పతకాలు సొంతం చేసుకుంది. ఈ మూడింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ భాగస్వామి కావడం విశేషం. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌, మహిళల టీం, వ్యక్తిగత విభాగాలలో ఈ మూడు పతకాలు లభించాయి.



సురేఖ వ్యక్తిగత సమరం: క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన జ్యోతి సురేఖ ఫైనల్లో కూడా అదేస్థాయిలో సత్తా చాటుతుందని..తద్వారా ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌కు తొలి పసిడి పతకం అందించి చరిత్ర సృష్టించగలదని అంచనా వేశారు. అయితే కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో జరిగిన అంతిమ సమరంలో 144-146 స్కోరుతో జ్యోతి పరాజయం చవిచూసింది. అంతకుముందు..క్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ సురేఖ 150-144 స్కోరుతో మ్లినారిక్‌ (క్రొయేషియా)ను చిత్తుచేసింది. ఆండ్రియా బెకెరా (మెక్సికో)తో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో 148-146 స్కోరుతో జ్యోతి జయకేతనం ఎగురవేసింది. 


మిక్స్‌డ్‌లో..: మిక్స్‌డ్‌ కేటగిరిలో జ్యోతి సురేఖ-అభిషేక్‌ వర్మ స్టార్‌ ద్వయం కొలంబియా జోడీ డానియల్‌ మునోజ్‌-సారా లోపెజ్‌ చేతిలో 154-150 తేడాతో ఓడి రెండోస్థానంతో సరిపెట్టుకుంది. 

మహిళల్లోనూ రెండోస్థానం..: మహిళల టీం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్‌, ప్రియా గుర్జార్‌తో కూడిన ఏడోసీడ్‌ భారత జట్టు ఐదు పాయింట్ల (224- 229) తేడాతో కొలంబియా త్రయం చేతిలో ఓటమితో రజత పతకంతో సంతృప్తి చెందింది.   దీంతో భారత్‌కు మరోసారి స్వర్ణ పతకం అందని ద్రాక్షే అయింది. 


మొత్తం ఆరు.. 

ఇక ఈ ప్రపంచ పోటీలలో సాధించిన మూడు రజతాలతో కలిపి వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో సురేఖ మొత్తం పతకాల సంఖ్య ఆరుకు చేరింది.. ఇంతకుముందు ఆమె ఓ రజతం (టీమ్‌, 2017), రెండు కాంస్యాలు (టీమ్‌, వ్యక్తిగత, 2019) పతకాలు నెగ్గింది.