సామాజిక సమస్యగా తెలుగు భాష!

ABN , First Publish Date - 2021-09-14T05:38:06+05:30 IST

రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ, ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయభాషగా సంస్కృతం ఎంపిక చేసుకోడానికి అవకాశం కల్పించి భాషా సంక్షోభానికి తెర లేపింది....

సామాజిక సమస్యగా తెలుగు భాష!

రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ, ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయభాషగా సంస్కృతం ఎంపిక చేసుకోడానికి అవకాశం కల్పించి భాషా సంక్షోభానికి తెర లేపింది. ఆ సమస్యను గుర్తించిన భాషావేత్తలు, రాజకీయ నాయకులు, తెలుగు భాషా చైతన్య సమితి వంటి సామాజిక సంఘాలు ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొంతవరకు విజయం సాధించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలలో మాధ్యమభాషగా ఆంగ్లం ప్రవేశపెట్టడం, తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా తెలుగును ఒక సామాజిక సమస్యగా గుర్తించి తెలుగు భాషా వినియోగం, దాని కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 


విద్యారంగం, ప్రభుత్వ వ్యవహారాలు, ప్రసార మాధ్యమాలలో తెలుగు భాషా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. తెలుగువారి అస్తిత్వ వికాసాలు తెలుగుభాషతో ముడిపడి ఉన్నాయని, ఇప్పుడు దీని ఉనికికి ఇంగ్లీషు మూలంగా నష్టం వాటిల్లుతోందని అభిప్రాయ పడుతున్నారు. దీనిని ఒక సామాజిక సమస్యగా గుర్తించి సమాజంలో భాషా చైతన్యం కలిగించడమే సిసలైన పరిష్కారం. నిజానికి ఈ సమస్యను సరైన సమయంలో మేధావులు, రాజకీయపెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా కొంతమంది భాషను ఒక సామాజిక సమస్యగా చూడటం లేదు. కేవలం తెలుగును ఒక ప్రత్యేక అంశంగా చదువుకునే వారి సమస్యగా, తెలుగు అధ్యాపకుల సమస్యగా మాత్రమే చూస్తున్నారు. తెలుగు భాషను ప్రాంతానికి పరిమితం చేసి చూస్తున్నారే గాని, సామాజిక కోణంలో, ఉపాధి కోణంలో చూడటం లేదు. తెలుగు వాడుక పెరగాలంటే అది విద్యా మాధ్యమంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. దీనిని నెరవేర్చవలసిన కర్తవ్యం రాజకీయ పార్టీలది, ప్రభుత్వానిది. కానీ వాటి రాజకీయ అవసరాల కారణంగా భాషలు గుర్తించదగిన స్థానాన్ని పొందలేకపోతున్నాయి. ప్రస్తుత కేంద్రప్రభుత్వ విధానాలు భారతీయ భాషల మాధ్యమాలకు ప్రోత్సాహకరంగా ఉన్నందున తెలుగు మాధ్యమం కోసం ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తేవాలని, ఉద్యమం రావాలనే మాటలు కొందరి నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మన సమాజం ఆర్థికంగా బలమైంది కాకపోవడం చేత సృజనకు, సంస్కృతికి ఆధారమైన మాతృభాషకు ఉన్న విలువ కంటె, ఆర్థికంగా ఆదుకోగలిగే భాషకే ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే ప్రస్థుత పరిస్థితులలో తెలుగు కోసం కానీ తెలుగు మాధ్యమం కోసం కానీ ప్రజల వైపు నుంచి ఒత్తిడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విద్యారంగంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్న భాషే, అంటే మాధ్యమ భాషే అన్ని వ్యవస్థీకృత రంగాలలోనూ మాధ్యమ భాషగా చెలామణీ అవుతుంది. దానికే సమాజంలో ప్రతిష్ఠ కలుగుతుంది. ఇప్పుడు ఈ లక్షణం ఎక్కువగా ఇంగ్లీషుకు ఉండడం వల్ల అన్ని వ్యవస్థలలోను ఇంగ్లీషుకు వాడుక పెరుగుతోంది. ఈ లక్షణం తక్కువగా ఉండడంతో తెలుగుకు వాడుక తగ్గుతోంది. మన దేశంలో ఉపాధి దృష్ట్యా ఇంగ్లీషు మాధ్యమం అనివార్యమయింది. మన భాషా వ్యవహారాల్లోనూ ఇంగ్లీషు ప్రవేశం తప్పనిసరిగా ఉంటుంది. దీనిని నిరోధించడం సాధ్యం కాకపోయినా భాషావేత్తల సూచనలతో కొన్ని పరిమితులను విధించుకోవలసిన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కొల్లేటి రవిబాబు

Updated Date - 2021-09-14T05:38:06+05:30 IST