20 ఏళ్లు సాయం కోసం నిరీక్షించి.. గల్ఫ్‌ జైల్లోనే ప్రాణాలొదిన తెలుగు ఖైదీ!

ABN , First Publish Date - 2021-10-28T13:17:24+05:30 IST

ఎడారి దేశంలోని జైలులో తెలంగాణకు చెందిన ఒక దళిత నిర్భాగ్యుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కేవలం రూ.మూడు లక్షల సాయం కోసం 20 ఏళ్ళకుపైగా ఎదురుచూస్తూ ఎట్టకేలకు అతను దయనీయ స్ధితిలో కన్నుమూశాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దరూరి బుచ్చన్న అనే దళిత ప్రవాసీ విషాద గాథ ఇది.

20 ఏళ్లు సాయం కోసం నిరీక్షించి.. గల్ఫ్‌ జైల్లోనే ప్రాణాలొదిన తెలుగు ఖైదీ!

షార్జాలో చనిపోయిన తెలంగాణ దళిత ఖైదీ

సాయం కోసం 20 ఏళ్ళుగా నిరీక్షణ

పక్షవాతం, క్షయతో కన్నుమూత

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఎడారి దేశంలోని జైలులో తెలంగాణకు చెందిన ఒక దళిత నిర్భాగ్యుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కేవలం రూ.మూడు లక్షల సాయం కోసం 20 ఏళ్ళకుపైగా ఎదురుచూస్తూ ఎట్టకేలకు అతను దయనీయ స్ధితిలో కన్నుమూశాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దరూరి బుచ్చన్న అనే దళిత ప్రవాసీ విషాద గాథ ఇది. 


షార్జాలో తన గదిలో ఉంటున్న తోటి తెలుగువాడయిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని బుచ్చన్న హత్య చేసినట్లు కేసు నమోదయ్యింది. ఈ కేసులో అతను గత 20 ఏళ్ళుగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం హతుడి వారసులు క్షమిస్తున్నట్లుగా ఆంగీకరిస్తే దోషిని జైలు నుండి విడుదల చేస్తారు. సాధారణంగా హతుడి కుటుంబీకులు కొంత నగదు తీసుకుని దోషి విడుదలకు సమ్మతి తెలుపుతారు. తమకు మూడు లక్షలిస్తే జైలు నుంచి దోషి విడుదలకు సమ్మతి తెలిపేందుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మృతుడి కుటుంబం సంసిద్ధత వ్యక్తం చేసింది, ఆ తర్వాత దిగివచ్చి, ఎంతో కొంత ఇచ్చినా పర్వా లేదని కూడా తెలిపింది. ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఖైదీ కథనం ప్రచురించిన తర్వాత బుచ్చన్న కుటుంబం స్ధానిక నేతలు మొదలుకొని హైద్రాబాద్‌లో దళిత మేధావులు, ప్రముఖులు అనేకుల వద్దకు వెళ్ళి ప్రాధేయపడింది.


కానీ ఎవరూ ఏమీ చేసింది లేదు. బుచ్చన్నను చూసేందుకు వృద్ధురాలైన అతని తల్లి అల్లాడిపోయింది. తమ ఊర్లో తన శక్తి మేరకు డబ్బు కోసం ప్రయత్నం చేసి విఫలమైన ఆమె నిస్సహాయ స్ధితిలో దేవుడిపై భారం వేసింది. చాలా ఏళ్ళుగా జైలులో పక్షవాతంతో బాధపడుతున్న బుచ్చన్నకు క్షయ కూడా సోకింది. జైలులో చికిత్స అందుతున్నా ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల ఆస్పత్రిలో మరణించాడు. మృతుడికి సంబంధించి ఏళ్ళ తరబడి అక్కడి అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ విషయం ఎమిరేట్స్‌ ప్రభుత్వం దుబాయిలోని భారతీయ కాన్సులేట్‌కు తెలిపింది. ‘ధూంధాం, జై జై’ అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు  ఊదరగొట్టే గల్ఫ్‌లోని ఏ ఒక్కడూ ఈ పేద ఖైదీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రవాసీయులెవరూ కనీసం కొంత మొత్తం ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. చివరకు ఎలాంటి సహాయం అందకుండా దయనీయమైన స్ధితిలో బుచ్చన్న మరణించాడు.

Updated Date - 2021-10-28T13:17:24+05:30 IST