నాసా ‘బ్రేక్ ద ఐస్ ల్యూనార్ ఛాలెంజ్’‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

ABN , First Publish Date - 2021-08-21T16:57:37+05:30 IST

2024 నాటికి చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించే లక్ష్యంతో నాసా పనిచేస్తోంది. మానవాళికి కొత్త ఆవాసాన్ని సృష్టించడానికి నీరు, నేల స్వభావాన్ని పరీక్షిస్తోంది. దాంట్లో భాగంగా చంద్ర అన్వేషణకు సంబంధించి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఇటీవల ‘బ్రేక్ ద ఐస్ ల్యూనార్ ఛాలెంజ్’ పేరుతో

నాసా ‘బ్రేక్ ద ఐస్ ల్యూనార్ ఛాలెంజ్’‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

వాషింగ్టన్: 2024 నాటికి చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించే లక్ష్యంతో నాసా పనిచేస్తోంది. మానవాళికి కొత్త ఆవాసాన్ని సృష్టించడానికి నీరు, నేల స్వభావాన్ని పరీక్షిస్తోంది. దాంట్లో భాగంగా చంద్ర అన్వేషణకు సంబంధించి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఇటీవల ‘బ్రేక్ ద ఐస్ ల్యూనార్ ఛాలెంజ్’ పేరు తో కాంపిటీషన్‌ను నిర్వహించింది. ఈ కాంపిటీషన్‌లో ప్రముఖ ఎన్నారై టీజీ విశ్వప్రసాద్ తనయుడు ప్రణవ్ ప్రసాద్ టీం టాప్ టెన్‌లో నిలిచింది. అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ నాసా పోటీలో .. తెలుగు మూలాలు కలిగిన ఎన్నారై యువకుడికి అద్భుతమైన అవార్డు దక్కింది. కాగా.. ప్రపంచంలోని 48 దేశాల నుంచి 374 టీంలు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నాయి. 


విశ్వంలో భూమి తర్వాత మానవుల నివాసానికి అనుకూలమైన వేరే ప్రాంతం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆశలు చంద్రుడి మీదనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో చందమామ మీద నివాసం ఏర్పర్చే దిశగా ప్రయోగాలు సాగుతున్నాయి. దాంట్లో నాసా ముందు వరుసలో ఉంది. 2024 నాటికి చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్న నాసా....దానికి సంబంధించి విస్తృత పరిశోధనలు చేస్తోంది. దాంట్లో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తూ.. జాబిల్లిపై  నివాసాన్ని సృష్టించడానికి అనువైన పరిస్థితులు, నీటి తవ్వకానికి సంబంధించిన మెకానిజం వంటి అంశాల్లో నాసా పోటీ నిర్వహించింది. ఈ కాంపిటీషన్‌లో  ప్రణవ్ ప్రసాద్ టీం టాప్ టెన్‌లో నిలిచింది. ఈ టీం ప్రణాళిక బద్ధంగా రూపొందించిన కాన్సెప్ట్ అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రణవ్‌తో పాటు తెలుగు యువకులు అమరేశ్వర కుమార్, సాయి ఆశిష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. దీనికి గాను 25 వేల డాలర్ల‌ బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పరిశోధనలకు అవకాశం ఇవ్వనున్నారు.



కాగా.. టీమ్ AA స్టార్‌లో ప్రణవ్ ప్రసాద్ టీమ్ లీడర్‌గా ఉండగా.. ప్రస్తుతం ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేస్తున్నారు. సర్టిఫైడ్ మెషిన్ లెర్నింగ్‌పై కూడా ప్రణవ్‌కు పట్టుంది. జాబిల్లిపై నీటి వనరులు, తవ్వకాలకు సంబంధించి  ప్రణవ్ ప్రసాద్ తోటి సహచరులతో కలిసి పరిశోధనలు చేశారు. క్లిష్ట పరిస్థితులలో కూడా డ్రిల్లింగ్ చేయడానికి సహాయపడే ఏ6 వీల్ డ్రైవ్ రాకీ బోగీ మెకానిజమ్‌ని ఉపయోగించే ఒక పద్ధతిని ఈ బృందం ప్రతిపాదించింది. ఈ బోగీ స్క్రూ ఆగర్ డ్రిల్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. దాంట్లో మైక్రోవేవ్ హీటింగ్ మాడ్యూల్‌ను ఉపయోగిస్తారు. ఇది చంద్రుడి నుండి నీటిని తీయడానికి సహాయపడుతుంది. ఈ మైక్రోవేవ్ చంద్రునిపై కణాలకు ఎలాంటి నష్టం జరగకుండా నీటిని తీయడానికి  సహాయపడుతుంది. జాబిల్లిపై నీటిని వెలికితీసే ఇతర పరిశోధన ప్రాజెక్టులను ప్రేరేపించడానికి ఇది ఉపకరిస్తుంది. నాసా పోటీలలో తెలుగు యువకులు టీజీ ప్రణవ్ ప్రసాద్ టీం మేటిగా నిలవటం పట్ల తెలుగు ఎన్నారై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీం లీడర్ ప్రణవ్ ప్రసాద్‌కు ఇతర సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాయి. 


Updated Date - 2021-08-21T16:57:37+05:30 IST