Abn logo
Sep 22 2021 @ 00:00AM

జాను తెలుగు... ఆడుతూ.. పాడుతూ..

కరోనాతో మూతపడిన స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. ఇంటిపట్టున ఉండిపోయిన పిల్లలు పాఠాలతో పాటు వందేమాతర గీతాన్నీ మర్చిపోయి, తడబడుతూ పాడుతుంటే టీచర్ల మనసు నొచ్చుకోకుండా ఉంటుందా? తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు ఉపాధ్యాయురాలిగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న త్రిపురారి పద్మ పరిస్థితీ అదే! గత 19 ఏళ్లుగా వినూత్నమైన భాషా క్రీడలతో పిల్లలకు తెలుగు భాష మీద పట్టును ఆవిడ ఎలా పెంచుతూ వచ్చారో ఆ విశేషాలను నవ్యతో ఇలా పంచుకున్నారు.
ఆంగ్ల భాష కచ్చితంగా అవసరమే! పై చదువులకూ, విజ్ఞానాభివృద్ధికీ ఆంగ్ల భాష మీద పట్టు పెంచుకోవడం అవసరం. అయితే అంతమాత్రాన మాతృభాష తెలుగు పట్ల అలక్ష్యం వహించడం, చిన్నచూపు ప్రదర్శించడం సరి కాదు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు తెలుగు భాషలో ఉన్నప్పుడు, ఆ భాష పట్ల ప్రతి ఒక్కరూ పట్టు ఏర్పరుచుకోవాలి. అందుకోసం సాధన బాల్యం నుంచే మొదలవ్వాలి. ఆరో తరగతిలో చేరే పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. ఈ పరిస్థితిని నేను వృత్తిలో అడుగుపెట్టినప్పుడే గ్రహించాను. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే పిల్లలకు తెలుగు భాష మీద మక్కువ పెంచాలి. ఆసక్తిని రేకెత్తించాలి. అంతకంటే ముఖ్యంగా పోటీ తత్వాన్ని పెంచాలి. ఇందుకోసం నేను కొన్ని క్రీడలను రూపొందించుకున్నాను. 


కాలక్షేపం రూపంలో...

పద్య పఠనంలో ఆసక్తిని పెంచడం, చిన్న చిన్న రచనలు చేయించి వాటికి సంకనాల్లో చోటు కల్పించడం... ఇలా పిల్లలు తెలుగును వంటబట్టించుకోవడానికి తోడ్పడే బోలెడన్ని భాషా క్రీడలను రూపొందించాను. పదాలతో అంత్యాక్షరి, పదం పట్టు బహుమతి కొట్టు, తెలుగు పద కేళీలు, మీలో ఎవరు పద కోటీశ్వరులు.... మొదలైన అభ్యాసాలను పిల్లల చేత సాధన చేయించడం మొదలుపెట్టాను. పదాలతో అంత్యాక్షరిలో పదం చివరి అక్షరంతో మరో పదాన్ని అప్పటికప్పుడు ఆలోచించి చెప్పగలగాలి. పదం పట్టు బహుమతి కొట్టు క్రీడ కోసం పాఠ్యాంశాల్లోని కీలక పదాలు, రచయితలు, కవుల పేర్లను రంగు కాగితాల కటింగ్స్‌ తయారు చేయించి, తరగతి గోడల మీద పిల్లల చేత అంటించేదాన్ని. తర్వాత పాఠాలు చెబుతున్నప్పుడు ఆ పేర్లు, పదాలు పలికే సందర్భం వచ్చినప్పుడు, పిల్లల చేత ఆ పదాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టమని అడుగుతాను. మీలో ఎవరు పద కోటీశ్వరుడు ఆట డబ్బులతో కూడుకున్నది కాదు. తెలుగు వృత్తలేఖనం (డిక్టేషన్‌)లో గెలిచిన పిల్లలు పది రూపాయలు గెలుచుకున్నట్టు ప్రకటిస్తా. వృత్తలేఖనంలో ‘గుడ్‌’ క్రెడిట్‌ పొందిన పిల్లలు లక్ష రూపాయలు సంపాదించుకుంటారు. ఇంటి పని (హోంవర్క్‌) క్రమం తప్పక పూర్తి చేసిన పిల్లలు వంద రూపాయలు గెలుచుకుంటూ ఉంటారు. ఇలా డబ్బు ప్రమేయం లేకపోయినా, ఆరు నెలల పాటు పోటీల్లో నెగ్గి, కోటీశ్వరుడుగా పేరు తెచ్చుకోవడం కోసం పిల్లలు పోటీ పడి, తెలుగు పదాలను తప్పుల్లేకుండా రాసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా లక్ష్యం కూడా అదే! పిల్లలు తెలుగు భాష నేర్చుకునే మొత్తం ప్రక్రియను మనసారా ఆస్వాదించాలి, ఆనందించాలి. 


మెదడులో నిక్షిప్తం కావాలి

పిల్లలకు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పే మాధ్యమంగా తెలుగు భాషను సద్వినియోగపరుచుకోవచ్చు. మాతృభాషను ప్రేమించిన వాళ్లు కచ్చితంగా తల్లితండ్రలను కూడా అంతే గొప్పగా గౌరవించగలుగుతారు అనేది నా భావన. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బడులు మూతపడడంతో పిల్లలు వందేమాతర గీతాన్ని మర్చిపోయారు. నరనరాలూ తెగిపోయినంత బాధ కలిగింది. అయితే మర్చిపోయినప్పటికీ, మెదడులో నిక్షిప్తమైన ఆ గీతాన్ని వల్లె వేయిస్తే గుర్తుకొచ్చిన చందంగా... పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పద్య పఠనం, భాష పట్ల మమకారాలు పెరిగి పెద్దయ్యాక కూడా సందర్భానుసారంగా గుర్తు తెచ్చుకోగలిగితే నా లక్ష్యం నెరవేరినట్టే! బీజాలు బాల్యంలోనే... 

నా తలిత్రండ్రులతో పాటు, చిన్నప్పటి గురువు దరిశకుర్తి శ్యామల ప్రభావం నా మీద ఎక్కువ. నాన్నగారు రేపాక కళానిధి పౌరోహిత్యం చేసేవారు. బ్యాంకు వృత్తిని కాదనుకుని పౌరోహిత్యానికే అంకితమయ్యారాయన. శ్రావ్యంగా శ్లోకాలు పాడేవారు. ఆయన చేసే మంత్రోచ్ఛారణ కూడా ఎంతో వినసొంపుగా ఉండేది. 

ఆయన వ్రత కథలు చెప్పే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అమ్మ రేపాక లక్ష్మి కూడా కథలు చెప్పడంతో పాటు, సందర్భోచితంగా పద్యాలు పాడేవారు. ఇవన్నీ తెలుగు భాష పట్ల నాలో అపారమైన ప్రేమ ఏర్పడడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం జనగామ జిల్లా, దేవరకుల మండలం, నీర్మాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పిల్లలకు తెలుగు భాష పట్ల పట్టు పెంచడమే లక్ష్యంగా సాగుతున్నాను. 

- గోగుమళ్ల కవిత