డల్లాస్‌లో విషాద ఘటన.. భార్య ప్రసవానికి ముందు రోజు మృతిచెందిన తెలుగు టెకీ

ABN , First Publish Date - 2020-02-22T18:16:29+05:30 IST

అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు టెకీ గుండెపోటుతో మరణించాడు.

డల్లాస్‌లో విషాద ఘటన.. భార్య ప్రసవానికి ముందు రోజు మృతిచెందిన తెలుగు టెకీ

రాయపోల్(సిద్దిపేట)అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు టెకీ గుండెపోటుతో మరణించాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి(39) ఈనెల 19న అతడు పనిచేస్తున్న కార్యాలయంలోనే గుండెపోటుతో చనిపోయాడు. వడ్డేపల్లికి చెందిన విశ్రాంత తహసీల్దార్ సుధాకర్ రెడ్డి రెండో కుమారుడు ప్రశాంత్ రెడ్డి పదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లాడు. డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ గుండెపోటుకు గురయ్యాడు. ప్రశాంత్ భార్య దివ్య ప్రసవానికి ఒక రోజు ముందు జరిగిన ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


ఇక ప్రశాంత్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు సంతోష్... డల్లాస్‌లో జరిగే అంత్యక్రియలకు మృతుని సోదరుడు ప్రమోద్‌ వెళ్లేందు వీసా ఇప్పించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి సోదరుడు ప్రమోద్ రెడ్డికి తాత్కాలిక వీసా అందించాలని బేగంపేటలోని అమెరికా ఎంబసీకి తెలియజేసి వీసా ఇప్పించారు. దీంతో ప్రమోద్ రెడ్డి శుక్రవారం అమెరికా బయలుదేరి వెళ్లాడు. కాగా, ప్రశాంత్ రెడ్డికి గ్రీన్ కార్డు ఉండడంతో ఆయన అంత్యక్రియలు అక్కడే జరుగనున్నాయి. ఇదిలాఉండగా మృతుడి భార్య దివ్య ఈనెల 20న ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెకు భర్త చనిపోయిన విషయం తెలియజేశారు. ఈ దంపతులకు ఇంతకుముందు మూడేళ్ల పాప ఉంది.  

Updated Date - 2020-02-22T18:16:29+05:30 IST