న్యాయ వ్యవస్థలో తెలుగు తేజం

ABN , First Publish Date - 2022-08-26T10:54:12+05:30 IST

మనదేశ సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగు జాతి కీర్తి పతాకం ఎగరేసిన న్యాయకోవిదుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. 55 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత...

న్యాయ వ్యవస్థలో తెలుగు తేజం

మనదేశ సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగు జాతి కీర్తి పతాకం ఎగరేసిన న్యాయకోవిదుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. 55 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత జస్టిస్ కోకా సుబ్బారావు అనంతరం రెండవ తెలుగు సీజేఐగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతితో ప్రమాణం స్వీకారం చేయించిన తొలి తెలుగు సీజేఐగా జస్టిస్‌ రమణ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.


న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, హైకోర్టు, సుప్రీంకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగిన రమణ జీవితంలో రావిశాస్త్రి రచనల ప్రభావం ఎంతగానో ఉంది. ఆ మహారచయిత పేదలపక్షాన నిలిచిన న్యాయవాది. ఆయన స్ఫూర్తితో నేషనల్ జ్యుడీషియల్ అకడమిక్ కౌన్సిల్ ద్వారా జస్టిస్‌ రమణ పేదలకు చేరువయ్యారు. పేదల సమస్యలను లోతుగా అర్థం చేసుకునేవారు. న్యాయస్థానాలలో అయ్యే ఖర్చు భరించలేని పేదలకు కూడా న్యాయం జరగాలనే తపన వారిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం ఉచిత న్యాయ సహాయం అందించాలని ఉన్నా పేదవారికి న్యాయం అందని ద్రాక్షలాగే మిగిలిపోయిందని జస్టిస్‌ రమణ తరచు వాపోతుంటారు.


కోర్టు తీర్పులు తెలుగులో రావాలని రమణ ఆరాటపడ్డారు. ఈ విషయంలో ఆయన చూపిన చొరవ నేడు తెలుగు రాష్ట్రాల్లో జడ్జీలు తెలుగులో తీర్పు ఇచ్చేందుకు దోహదం చేసింది. వాదప్రతివాదాలు స్థానిక భాషలో జరిగినప్పుడే కక్షిదారులకు న్యాయస్థానంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని ఆయన అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక దాంపత్య వివాదంలో కక్షిదారురాలు ఆంగ్లంలో భావవ్యక్తీకరణ చేయలేనపుడు తెలుగులో మాట్లాడించి ఆమె చెప్పే విషయం బెంచ్‌లోని తోటి జడ్జీలకు ఆంగ్లంలో వివరించారు. ఇలా న్యాయస్థానాలు స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచి పరిణామం.


దైవభక్తి గల జస్టిస్ రమణ కోర్టును కూడా దేవాలయంగా భావించేవారు. ఇక్కడ వివక్షకు, లింగ వివక్షకు తావు లేదంటారు. ఆయన ఇచ్చిన తీర్పులు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేలా ఉంటాయి. సైనిక దళాలలో మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్పిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ముఖ్యలు. ఒక బీమా సంస్థ కేసులో ఇంట్లో స్త్రీ చేసే పనిని పురుషుడు ఆఫీసులో చేసే పనితో సమానంగా పరిగణించాలన్నారు. వివాహబంధాల కేసులలో దాదాపు దంపతులను ఒక్కటిగా ఉంచేందుకే ప్రయత్నించారు. ఇలా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ సమ న్యాయాన్ని పాటించేవారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడు స్తంభాల్లాంటివని, వాటిమధ్య స్పష్టమైన లక్ష్మణరేఖ ఉండాలని, అనవసర జోక్యం తగదన్నారు. ఉచితాలు, సంక్షేమ పథకాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సంక్షేమ పథకాల హామీలను ఉచితాల పేరుతో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలను అడ్డుకోలేమని ఆయన వాఖ్యానించారు. ప్రజాస్వామ్య మనుగడ కొనసాగాలంటే న్యాయవ్యవస్థ కీలకం అని జస్టిస్ రమణ అన్నారు. కోర్టుల పటిష్ఠతకు, పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో కోర్టు భవన నిర్మాణాలు అగాధంగా ఉన్నాయని, ఒకరు బయటికి వస్తేకాని తరువాత న్యాయవాది లోపలికి వెళ్ళలేని స్థితిలో న్యాయస్థానాలున్నాయని, స్త్రీ న్యాయవాదులు, కక్షిదారులు కోర్టు బయటే ఉండాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. దేశంలో 16 శాతం న్యాయమూర్తుల స్థానాలు ఇప్పటికీ ఖాళీలుగా ఉన్నాయన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయకపోవడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచక పోవడమే దేశంలో కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణమన్నారు. ఇప్పటివరకు సీజేఐ రమణ హయాంలోనే అత్యధికంగా 100 మంది హైకోర్టు జడ్జీలు నియమితులయ్యారు, అలాగే ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలు నియమితులయ్యారు. మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవ్యవస్థకు నవీన సాంకేతికతను జోడించి ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఈ–ఫైలింగ్ ద్వారా పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చారు. పారదర్శకత కొరకు న్యాయస్థానాలలో వాదనలు వినుటకు ‘వర్చువల్ హియరింగ్’ ఆప్‌ను సీజేఐగా ప్రారంభించారు. అదేవిధంగా సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కిందికి తెచ్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తులు ఎవ్వరికీ భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తేల్చి చెప్పారు.


ప్రజాస్వామ్య పరిరక్షణకై జస్టిస్‌ రమణ చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. కశ్మీర్లో అంతర్జాల సేవలపై సుదీర్ఘ ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని, భావప్రకటన స్వేచ్ఛను హరించడమే అని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించాలని, ఇలాంటి కేసులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులే స్వయంగా పర్యవేక్షించాలని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం, స్పీకర్‌లను సంప్రదించకుండా ముందస్తు సెషన్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్డర్ చేస్తే, ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి శాసనసభల ఔన్యత్యాన్ని కాపాడారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య బేరసారాలు జరగకుండా సభలో వెంటనే బలపరీక్ష జరపాలని ఆదేశించారు. రావి శాస్త్రి తన పుస్తకంలో సూచించిన విధంగా కాలంచెల్లిన చట్టాలను రద్దు చేయాలని తలిచారు. రాజద్రోహంకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 124Aను నిలుపుదల చేశారు.


జస్టిస్ రమణ అంతర్జాతీయ న్యాయ సదస్సులకు హాజరై విలువైన పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రతీ చిన్న వివాదాన్ని కోర్టు వరకు తీసుకురాకుండా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్) ద్వారా పరిష్కరించుకుంటే సమయం, ధనం వృధా కావని, తద్వారా కోర్టులపై అదనపు భారం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. న్యాయమూర్తిగా పనిచేయడం అందరు అనుకున్నంత సులభం కాదని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని, తీర్పు ఇచ్చాక కూడా సరైందా, కాదా? అని బేరీజు వేసుకుంటామని, ఎంతో శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జూనియర్ న్యాయవాదుల కష్టసుఖాలేమిటో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. జస్టిస్ రమణ న్యాయ సేవలను గుర్తించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మన తెలుగు తేజం న్యాయవ్యవస్థలో ప్రగతికి బీజాలు వేయడం మనందరికీ గర్వకారణం.

బుర్ర రవితేజ గౌడ్

తెలంగాణ హైకోర్టు న్యాయవాది

Updated Date - 2022-08-26T10:54:12+05:30 IST