Central university వీసీలుగా తెలుగువారు

ABN , First Publish Date - 2021-07-24T01:47:57+05:30 IST

దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పూర్తి కాలపు వీసీలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు

Central university వీసీలుగా తెలుగువారు

న్యూఢిల్లీ : దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పూర్తి కాలపు వీసీలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. ఈ 12 మందిలో ఇద్దరు తెలుగు వారు ఉండటం విశేషం. కర్నాటక సెంట్రల్ వర్శిటీ ఉప కులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీలో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా ఉంటూ, రిటైర్డ్ అయ్యారు. దాదాపు 15 సంవత్సరాల పాటు ‘ఔటా’ (ఉస్మానియా యూనివర్శిటీ టీచర్స్ యూనియన్) అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏకంగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యతల్లో ఉంటూ యూనివర్శిటీ ఆచార్యుల సమస్యలపై పోరాడారు. ఆచార్యుల సమస్యలు, జీవోలపై అపారమైన అనుభవం కూడా ఉంది. ‘ఔటా’ అంటే సత్యనారాయణ, సత్యానారాయణ అంటే ఔటా అనేంతగా పేరు సంపాదించారు.  ఈయన పర్యవేక్షణలో 12 పీహెచ్‌డీలు పూర్తయ్యాయి. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీగా బసూత్కర్ జగదీశ్వర్ రావు

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీగా డాక్టర్ బసూత్కర్ జగదీశ్వర్ రావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిజాం కాలేజీలో బీఎస్సీ, ఓయూలో ఎమ్మెస్సీ, బెంగళూరులోని ఐఐఎస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అమెరికాలోని యేల్ స్కూల్ నుంచి బయోలాజికల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన ఐదేళ్ల పాటు వీసీగా బాధ్యతల్లో ఉండనున్నారు. 


హర్యానా యూనివర్శిటీ : ప్రొఫెసర్ టంకేశ్వర్ కుమార్

హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ : ప్రొ. సత్‌ప్రకాశ్ బన్సల్

జమ్మూ యూనివర్శిటీ : సంజీవ్ సింగ్

జార్ఖండ్ యూనివర్శిటీ : ప్రొ. క్షితిభూషణ్ దాస్

తమిళనాడు యూనివర్శిటీ : ప్రొ. ముత్తు కళింగన్ కృష్ణన్

సౌత్ బిహార్ యూనివర్శిటీ : ప్రొ. కామేశ్వర్ నాథ్ సింగ్

నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్శిటీ : ప్రొ. ప్రభాశంకర్ శుక్లా

గురు ఘసిదాస్ యూనివర్శిటీ : డా. అలోక్ కుమార్

మౌలానా ఆజాద్ యూనివర్శిటీ : ప్రొ. సయ్యద్ ఐనుల్ హుస్సేన్

మణిపూర్ : ప్రొ. లోకేంద్ర సింగ్


Updated Date - 2021-07-24T01:47:57+05:30 IST