ఆమెది పోరాట పథం

ABN , First Publish Date - 2020-11-01T05:30:00+05:30 IST

అమెరికాలో ఇప్పుడంతా ఎన్నికల వేడి... హడావుడి. ఒక పక్క ట్రంప్‌... బైడెన్‌ నువ్వా నేనా అంటూ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతుంటే... మరోవైపు ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌)కు పోటీ ఊపందుకుంది. అయితే ఈసారి ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది...

ఆమెది పోరాట పథం

అమెరికాలో ఇప్పుడంతా ఎన్నికల వేడి... హడావుడి. ఒక పక్క  ట్రంప్‌... బైడెన్‌ నువ్వా నేనా అంటూ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతుంటే... మరోవైపు ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌)కు పోటీ ఊపందుకుంది. అయితే ఈసారి ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. వర్జీనియా రాష్ట్రం నుంచి తొలిసారి తెలుగింటి మహిళ మంగా అనంతాత్ముల రిపబ్లికన్ల తరుఫున బరిలో దిగుతున్నారు. అక్కడ ఆసియన్ల హక్కుల ఉద్యమకారిణిగా సుపరిచితురాలైన ఆమె ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 


సంపన్న కుటుంబం... విలాసవంతమైన జీవితం... అన్నీ వదులుకుని ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లారు మంగా అనంతాత్ముల. తెలుగు గడ్డపై పుట్టిన ఆమె... తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో దేశమంతా తిరిగారు. చెన్నైలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల్లో పెరిగిన ఆమె జీవితాన్ని వివాహ బంధం ఊహించని మలుపు తిప్పింది. భర్త అమెరికా కలను నిజం చేసేందుకు 1990లో ఆ దేశానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్లిన తొలినాళ్లల్లో ఎన్నో ఇబ్బందులు. భర్త డాక్టరేట్‌ డిగ్రీల కోసం చదువుకొంటుంటే... ఆమె కుటుంబ భారాన్ని మోసారు. 


‘‘భారత్‌లో ఏ లోటూ లేని జీవనాన్ని వదులుకుని, మా అబ్బాయిని తీసుకుని అమెరికా వచ్చాం. మా వారి చదువు కోసం చాలా ఏళ్లు ఆర్థిక సమస్యలతో గడిపాం. పిల్లాడికి కడుపు నిండా పెట్టి, మంచి బట్టలతో బడికి పంపేందుకు నేను ఒక్క పూటే తిన్నాను. మా అబ్బాయికి స్కూల్లో ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడతానన్నా వద్దన్నాను. తరువాత అతడు కూడా ఉద్యోగంలో చేరాడు. ఇద్దరం కష్టపడి, ఎన్నింటినో త్యాగం చేసి నేడు ఈ స్థాయికి రాగలిగాం. మన కాళ్లపై మనం నిలబడడం, కష్టపడి పనిచేసే తత్వం, దేశ పౌరుడిగా బాధ్యతనెరిగి మెలగడం... మా పిల్లాడికి ఇవే నేర్పించాను. అలా బాధ్యతాయుతమైన పౌరుడిగా పెరిగాడు కనుకనే ఈ రోజు వాడు దేశం గర్వపడేలా అమెరికా నావికాదళంలో భాగస్వామి అయ్యాడు. వాడిని చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది’’ అని మంగ గుర్తు చేసుకున్నారు. 


రాజకీయాల వైపు అడుగులు... 

ముప్ఫై ఏళ్ల కిందట అమెరికా వెళ్లిన మంగ ఆరంభంలో రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్‌ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. వర్జీనియాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలోని ఐవీ లీగ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో ఆసియన్ల పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఆమె గళం ఎత్తారు. న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. దీంతో మంగ పేరు అక్కడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రజాసేవపై మక్కువతో రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత డెమోక్రటిక్‌ పార్టీలో సేవలందించారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ‘‘రాజ్యాంగం కల్పించిన నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా డెమోక్రటిక్‌ సభ్యులు ప్రవర్తించారు. ట్రంప్‌కు ఓటు వేసినందుకు దూషించారు. అందుకే ఆ పార్టీని వీడాల్సి వచ్చింది’’ అంటూ అప్పట్లో ఆమె వివరణ ఇచ్చారు. 


ఎన్నో ప్రత్యేకతలు...  

ఇప్పుడు తొలిసారి మంగ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అందులో భాగంగా వర్జీనియా రాష్ట్రం... 11వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఈ ఏడాది జనవరిలో నామినేషన్‌ వేశారు. అమెరికన్ల కలలు సాకారం చేయడమే తన లక్ష్యమని చెబుతున్న మంగ ఒకవేళ గెలిస్తే... రిపబ్లికన్ల తరుఫున ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన ఒకేఒక్క భారత సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. అంతేకాదు... ఇప్పటికే సభ్యులుగా ఉన్న డెమోక్రట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌, ఆమి బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జైపాల్‌తో పాటు ఆరో ఇండో అమెరికన్‌గా మంగ రికార్డులకెక్కుతారు. 


ఆర్టికల్‌ 370కి మద్దతు... 

అమెరికాలోని హిందువులకు తానే అసలైన ప్రతినిధినని ప్రచారం చేసుకొంటున్న మంగ... కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు తెలిపారు. అలాగే మోదీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద ‘సిటిజన్‌షిప్‌ ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌’ (సీఏఏ), రామ మందిరం అంశాన్ని ఆమె సమర్థించారు. ఆర్టికల్‌ 370ని డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ‘‘మీ ముఖానికున్న ముసుగు తొలగించండి. కశ్మీర్‌ అంశంపై అవగాహన పెంచుకుని మాట్లాడండి. ఆర్టికల్‌ 370 అనేది దేశ విభజన సమయంలో తెచ్చిన తాత్కాలిక చట్టం. దానివల్ల అక్కడ వేరే ఏ భారతీయుడూ భూమి కొనలేడు. కశ్మీర్‌ మహిళలకు ప్రాథమిక హక్కులు ఉండవు’’ అంటూ బైడెన్‌పై విరుచుకుపడ్డారు. ఇదే విషయంలో కమలా హారిస్‌ను కూడా ఎండగట్టారు. ప్రతినిధుల సభలో ప్రమీలా జైపాల్‌ ఈ ఆంశంపై తీర్మానం పెట్టినప్పుడు కూడా ప్రతిఘటించారు.  


గెలుపుపై ఆశలు... 

జాతీయ రుణ భారాన్ని తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన మంగ గెలుపు అంత సులువేమీ కాదు. ఆమె పోటీపడుతున్న నియోజకవర్గం డెమోక్రాట్ల కంచుకోట. ఆరుసార్లు నెగ్గిన గెర్రీ కనోలీతో ఆమె పోటీపడుతున్నారు. అయితే అక్కడ 17 శాతం ఆసియా ప్రాంతంవారు, అందులో 7 శాతం భారత సంతతి అమెరికన్లు ఉన్నారు. ఈ వర్గం మద్దతు మంగకు పుష్కలంగా ఉంది. ఇదే అక్కడి గెలుపును నిర్ణయిస్తుందనేది ఓ అంచనా. అదే జరిగితే మంగా అనంతాత్ముల పేరు అమెరికా అంతటా మారుమోగుతుంది. తెలుగువారి కీర్తి మరోసారి రెపరెపలాడుతుంది.

Updated Date - 2020-11-01T05:30:00+05:30 IST