Abn logo
Mar 31 2021 @ 01:00AM

యువ రాకెట్లు

అంతర్జాతీయ వేదికపై ముందెన్నడూ వారు కలిసి ఆడింది లేదు. ప్రత్యర్థి ఎవరు? వారిని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాలు రచించిందీ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఓర్లీన్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-100 బరిలోకి దిగి టాప్‌ ర్యాంకింగ్‌ జోడీలకు చుక్కలు చూపించారు. ఇప్పుడు మిషన్‌ 2024 ఒలింపిక్స్‌కు గురిపెట్టి ముందుకు సాగుతున్న గరగ కృష్ణ ప్రసాద్‌, పంజాల విష్ణు వర్దన్‌ గౌడ్‌ నేపథ్యాలను తెలుసుకుందాం.


తాత, తండ్రి జాతీయ వాలీబాల్‌ క్రీడాకారులు. తండ్రి వెంకటేష్‌ గౌడ్‌ జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఆటగాడు. హైదరాబాద్‌కు చెందిన వీరి కుటుంబం రెండు తరాల నుంచి క్రీడలతో మమేకమై ఉండడంతో పంజాల విష్ణువర్దన్‌ గౌడ్‌ (20)చిన్నతనం నుంచే తండ్రితో కలిసి ఎల్బీ స్టేడియానికి వెళ్లేవాడు. అక్కడ బ్యాడ్మింటన్‌ ఆడుతున్న వారిని చూసి ప్రముఖ కోచ్‌లు మహ్మద్‌ ఆరిఫ్‌, గోవర్దన్‌ రెడ్డి వద్ద విష్ణు శిక్షణ ప్రారంభించాడు. అలా పదేళ్ల ప్రాయంలో రాకెట్‌ పట్టిన ఈ అంబర్‌పేట్‌ చిన్నోడు అండర్‌-10 నుంచి 13 వరకు వారి శిక్షణలో రాణించాడు. 2014లో అండర్‌-13 సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గి తన బ్యాడ్మింటన్‌ ప్రస్థానాన్ని ఘనంగా షురూ చేశాడు. 2015లో గోపీచంద్‌ అకాడమీకి చేరిన విష్ణు ఇంతింతై అన్నట్టు 2016లో రాష్ట్ర అండర్‌-17 సింగిల్స్‌ టైటిల్‌తో పాటు మూడేళ్లు (2017, 18,19) వరుసగా జాతీయ అండర్‌-19 డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకొని తిరుగులేని ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది కృష్ణ ప్రసాద్‌తో జతకట్టిన విష్ణు ఇటీవల ఆడిన తొలి అంతర్జాతీయ టోర్నీలోనే సంచలన ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.


టార్గెట్‌ 2024 ఒలింపిక్స్‌

మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. టార్గెట్‌ 2024 ఒలింపిక్స్‌. తక్కువ సమయంలోనే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. ఓర్లీన్స్‌ టోర్నీలో ఒత్తిడికి గురవకుండా కొత్తకొత్త వ్యూహాల పేరిట అనవసర తప్పిదాలు చేయకుండా మా గేమ్‌ మేము ఆడి విజయవంతమయ్యాం. టోర్నీ ముగిశాక గోపీసార్‌ ఫోన్‌చేసి బాగా ఆడారని ప్రశంసించారు.  

                    - విష్ణు గౌడ్‌


మంచి భాగస్వామి దొరికాడు

నాలుగేళ్ల నుంచి డబుల్స్‌లో ఆడుతున్నా  సరైన భాగస్వామి దొరకలేదు. ఓర్లీన్స్‌ టోర్నీతో ఆ లోటు తీరింది. గత నవంబరు నుంచి విష్ణుతో కలిసి సాధన చేస్తున్నా. మా ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఏర్పడింది. ఏడాది చివరిలోపు టాప్‌-50లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత గురి 2024 ఒలింపిక్స్‌ పైనే.

                 - కృష్ణ ప్రసాద్‌
భాగ్యనగరం చిన్నోడు - కాకినాడ కుర్రోడు

ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ పురుషుల డబుల్స్‌లో రన్నర్‌పగా నిలిచిన జోడీలో ఒకరైన గరగ కృష్ణ ప్రసాద్‌ స్వస్థలం (21) తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. తండ్రి గంగాధర్‌ మాజీ షట్లర్‌. ఆలిండియా యూనివర్సిటీ క్రీడలతో పాటు పలు జాతీయ స్థాయి పోటీల్లో ఆడారు. యాదృచ్ఛికంగా కొడుకు కూడా పదేళ్ల వయస్సులో రాకెట్‌ పట్టడం ఒడుపుగా ఆడుతుండడం చూసి ఆ తండ్రికి తన పాత రోజులు గుర్తొచ్చాయి. శిక్షణ ప్రారంభించిన అనతి కాలంలోనే అద్భుత ఆటతీరుతో జిల్లా స్థాయి పోటీల్లో రాణించాడు. అదే జిల్లాకు చెందిన డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌తో కలిసి పలు టోర్నీల్లో రాణించాడు. అండర్‌-14 వరకు కాకినాడలోనే సాధన చేసిన కృష్ణ 2011లో హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీకి మకాం మార్చాడు. తొలుత సింగిల్స్‌ ప్లేయర్‌గా కెరీర్‌ ఆరంభించిన అతడు 2015లో గోపీచంద్‌ సూచన మేరకు డబుల్స్‌లోకి అడుగు పెట్టాడు. మూడేళ్లు గడిచేసరికి ప్రపంచ జూనియర్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ 2 స్థానానికి చేరుకున్నాడు. 2019లో దక్షిణాసియా బ్యాడ్మింటన్‌ పోటీల్లో ధ్రువ్‌ కపిలతో కలిసి డబుల్స్‌లో పసిడి పతకం నెగ్గి తన పతకాల వేట ప్రారంభించాడు. అంతకుముందు సయ్యద్‌ మోదీ-300, రష్యా ఓపెన్‌ సూపర్‌-100లో క్వార్టర్స్‌ చేరి భారత భవిష్యత్‌ డబుల్స్‌లో నమ్మదగ్గ ఆటగాడిగా ముద్ర వేసుకున్నాడు. గత పీబీఎల్‌లో ఉత్తమ భారత ఆటగాడి అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.


Advertisement
Advertisement
Advertisement