మస్తు నవ్విస్తుండ్రు

ABN , First Publish Date - 2020-07-12T18:46:07+05:30 IST

మన మధ్య రోజూ జరిగే ఫైట్లు.. ఫీట్లు..పాట్లు తెరకెక్కిస్తే అవే స్కిట్లు. ఎంత సీరియస్‌ థింగ్‌ అయినా సిల్లీగా చెప్పేయాలి.. నాన్చకుండా తేల్చేయాలి. అందులో వీళ్లు మాటల మాంత్రికులు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రతి....

మస్తు నవ్విస్తుండ్రు

మన మధ్య రోజూ జరిగే ఫైట్లు.. ఫీట్లు..పాట్లు తెరకెక్కిస్తే అవే స్కిట్లు. ఎంత సీరియస్‌ థింగ్‌ అయినా సిల్లీగా చెప్పేయాలి.. నాన్చకుండా తేల్చేయాలి. అందులో వీళ్లు మాటల మాంత్రికులు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశాన్నీ స్కిట్స్‌లోకి తర్జుమా చేస్తూ.. తెగ నవ్విస్తున్నారు.. ఆలోచింపజేస్తున్నారు.  స్టార్స్‌గా వెలిగిపోతున్న ఆ స్కిట్స్‌ యూట్యూబర్స్‌పై.. కవర్‌ స్టోరీ 


నవ్వడానికి కూడా టైమ్‌లేని కాలం.. అదేదో టక్కున చెప్పేస్తే నవ్వొచ్చు.. అందుకు పుట్టిందే.. ‘స్కిట్‌’.. ఆ సిల్లీ కబుర్లు ఓవెన్‌లో పాప్‌కార్న్‌లా టపీమని పేలతాయి.. మన లోపలి మనల్ని బయటికి తీసి చూపిస్తాయి.. భళ్లున నవ్విస్తాయి.. చతుర్లతో చురకలు అంటిస్తాయి.. ఈ స్కిట్‌ కళ.. ఏ దేశంలో పుట్టిందో చెప్పలేం కానీ... 19వ శతాబ్ధంలో ఫ్రాన్స్‌ వేదికపైనో, బ్రిటన్‌ థియేటర్లోనో ఊపిరి పోసుకుంది. సీరియళ్లలా సాగతీత ఉండదు.. సినిమాలా రొడ్డ కొట్టుడు ఉండదు.. స్వీట్‌గా, షార్ట్‌గా తేల్చేస్తుంది కాబట్టే, ‘స్కిట్‌’కు ప్లాట్‌ అయిపోయారు నెటిజన్లు.. ఇప్పుడీ సిల్లీ థింగ్‌.. సీరియస్‌ ట్రెండ్‌.. ఒకప్పుడు పేరడీలు, ఏకాంకికలు, హాస్యనాటికలు ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం డిజిటల్‌ యుగం కాబట్టి.. స్కిట్‌ రూపంలో కొత్త హాస్య ప్రక్రియ పుట్టుకొచ్చింది. లాక్‌డౌన్‌ వేళ మాత్రం కేవలం కామెడీరసం మాత్రమే కోరుకుంటున్నారు జనాలు. కరోనా ఏడిపిస్తున్నది చాలదా...మరలా ఎమోషనల్‌ డ్రామా సిరీస్‌లు ఎందుకు? అందుకే కామెడీకే ఓటేశారు నెటిజన్లు. ఇప్పుడు యూట్యూబ్‌ నిండా ఎన్ని కామెడీ వెబ్‌ సిరీస్‌లో. అందులోనూ తారాజువ్వల్లా దూసుకెళ్తున్న ఆడవాళ్లదే హవా. మహాతల్లి, హే సిరి, రౌడీ బేబీ, వరంగల్‌ వందనా... పేర్లలోనే కాదు, వాటి కథల్లో కూడా మహిళలే ముఖ్యపాత్రలు. ఎన్ని వెబ్‌సిరీస్‌లు ఉన్నా, వాటి అల్టిమేట్‌ లక్ష్యం ఒక్కటే... ప్రేక్షకులను నవ్వించడం. ఇప్పుడు వెండితెర, బుల్లితెరను మించిపోయిన క్రేజ్‌ యూట్యూబ్‌ది. కేవలం యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌లతో కొంతమంది సామాన్యులు స్టార్లయిపోయారు. యూట్యూబ్‌ ద్వారా ఆదాయాన్ని, గుర్తింపును సాధించి క్రేజీ స్టార్స్‌గా మారారు. 




మహాతల్లి జాహ్నవి

యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌లో అమ్మాయిలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నారంటే వారందరికీ స్పూర్తి మహాతల్లే అని చెప్పాలి. యూట్యూబ్‌ మహాతల్లిగా అవతరించిన జాహ్నవి దాసెట్టికి చిన్నప్పట్నించి నటన అంటే ఇష్టం. ఆమె నాన్న లాయర్‌, తల్లి ప్రిన్సిపల్‌. అందుకే చదువుకే ఇంట్లో తొలి ప్రాధాన్యం. భోపాల్‌లోని నిఫ్ట్‌లో ‘యాక్సెసరీ డిజైనింగ్‌’ కోర్సులో చేరింది. 2013లో ముంబైలో ఓ సంస్థలో ఉద్యోగంలో చేరింది. నటన మీద ఉన్న ఆసక్తి ఆ ఉద్యోగంలో జాహ్నవిని కుదురుగా ఉండనీయలేదు. హైదరాబాద్‌ వచ్చి ఆడిషన్స్‌ ఇవ్వడం ప్రారంభించింది. ఓ రెండు షార్ట్‌ఫిల్మ్‌లలో నటించింది. ఆమె నటన నచ్చి ఓ మీడియా సంస్థ ఆమెతో కలిసి ‘మహాతల్లి’ వెబ్‌సిరీస్‌ను 2016లో ప్రారంభించింది. ప్రస్తుతం మహాతల్లికి 16లక్షల మంది సబ్‌ స్ర్కైబర్లు ఉన్నారు. ‘వివాహభోజనంబు’ అనే ఎపిసోడ్‌ను అయితే ఏకంగా 90 లక్షల మంది వీక్షించారు. ‘టైప్స్‌ ఆఫ్‌ పానీపూరీ ఈటర్స్‌’ అనే మరో ఎసిసోడ్‌ను 70లక్షలమంది చూశారు. లై, మెంటల్‌ మదిలో వంటి సినిమాలలో కూడా నటించింది జాహ్నవి. 




అందాల ప్రణవి

ప్రణవి మానుకొండ... ఈ పిల్లని మనం చిన్నప్పట్నించి చూస్తూనే ఉన్నాం. బాలనటిగా సీరియల్స్‌లో, అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు పెద్దదై చక్కగా వెబ్‌సిరీస్‌లు చేసుకుంటోంది. పసుపు కుంకుమ, సూర్యవంశం, ఎవరే నువ్వు మోహిని, గంగ మంగ ఇలా చాలా సీరియళ్లలో నటించింది. టిక్‌టాక్‌లో కూడా దుమ్మురేపింది. ప్రణవికి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, టిక్‌టాక్‌లో ఎనిమిది లక్షల మంది ఫాలోవర్లు ఉండేవారు. యూట్యూబ్‌లో ఇప్పటికే బోలెడు వెబ్‌సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం ‘ఓ బుల్లెమ్మా’, ‘గర్లిజం’ సిరీస్‌లలో నటిస్తోంది. ఒక పక్క చదువు మరో పక్క షూటింగ్‌లతో చాలా బిజీగా గడిపేస్తోంది ప్రణవి. ఓ బుల్లెమ్మా వెబ్‌సిరీస్‌ కొత్తగా మొదలైంది. దీనికి 26వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. 




న్యూస్‌రీడర్‌ నుంచి నటిగా...

సిరి హన్మంతు... అగ్నిసాక్షి సీరియల్‌లో నటిస్తున్న ఈ అమ్మాయి మొదట ఒక న్యూస్‌ రీడర్‌. 2014లో విశాఖపట్నంలోని ఓ చిన్న ఛానెల్‌లో న్యూస్‌రీడర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. తరువాత టీ న్యూస్‌ ఛానెల్‌లో చేరింది. ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న షార్ట్‌ ఫిల్మ్‌లు చేసింది. సీరియల్‌ ఆడిషన్లకు హాజరయ్యేది. అలా ఉయ్యాలా జంపాలా, ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, మాటే మంత్రము సీరియళ్లలో నటించింది. ఒక పక్క సీరియళ్లలో నటిస్తూనే వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఆరు నెలల క్రితం తానే సొంతంగా ‘హే సిరి’ పేరుతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేసింది. అందులో తన భర్త శ్రీహాన్‌తో కలిసి కామెడీ స్కిట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇద్దరూ జంటగా పలు పాటలకు డ్యాన్సులు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ‘హే సిరి’ ఛానెల్‌కు ప్రస్తుతం లక్షా ఇరవై ఆరు వేల మంది సబ్‌ స్ర్కైబర్లు ఉన్నారు. 




రౌడీ బేబీకి ఫిదా

చూడటానికి మోడల్‌లా కనిపిస్తుంది సోనియా సింగ్‌. పేరు చూసి ఎక్కడమ్మాయో అనుకోకండి... హైదరాబాద్‌ పిల్లే. 1998లో పుట్టిన సోనియా ఇప్పటికే చాలా వెబ్‌సిరీస్‌లలో నటించింది. సినిమా అయినా, వెబ్‌సిరీస్‌ అయినా ప్రేక్షకులను నటనతో ఎంటర్‌టైన్‌ చేయడమే తన లక్ష్యమని చెబుతోంది. మొదటిసారిగా ‘హే పిల్లా’ అనే కామెడీ వెబ్‌ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అందులో కొన్ని సందేశాత్మక స్కిట్‌లు కూడా చేసింది. ‘షి అండ్‌ పీరియడ్స్‌’ ఎపిసోడ్‌ను అయితే ఏకంగా 70 లక్షల మంది వీక్షించారు. కొత్తగా ‘రౌడీ బేబీ’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టి ‘పెళ్లయిన కొత్తలో’ సిరీస్‌ చేయడం మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చేసిన ప్రతి ఎపిసోడ్‌కు పది లక్షలకు తక్కువ కాకుండా వ్యూస్‌ వస్తున్నాయి. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని సరదాగా చూపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ ‘రౌడీ బేబి’. సోనియా నటించిన స్వయంవరం, ఓయ్‌ పద్మావతి, సాఫ్ట్‌వేర్‌ సావిత్రి ఎపిసోడ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రౌడ్‌ బేబీ ఛానెల్‌కు ప్రస్తుతం లక్షా తొంభైవేల మంది  సబ్‌ స్ర్కైబర్లు  ఉన్నారు. 




ఈ పిల్లే వరంగల్‌ వందన 

ఐశ్వర్యా రెడ్డి అంటే ఎవరికీ తెలియక పోవచ్చు, అదే వరంగల్‌ వందన అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ వెబ్‌ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయ్యింది ఐశ్వర్యా. పేరులో వరంగల్‌ ఉన్నా, ఈ అమ్మాయి పుట్టింది పెరిగిందంతా హైదరాబాదే. ఇక్కడే ఓ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. ‘ద మిక్స్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ‘వరంగల్‌ వందన’ పేరుతో ఒక వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేసింది. అనుకోకుండా అందులో నటించే అవకాశం ఐశ్వర్యకు దక్కింది. ఆ వెబ్‌ సిరీస్‌ క్లిక్‌ అవ్వడంతో ఆమె అసలు పేరు మర్చిపోయారంతా. అందులో లేడీస్‌ హాస్టల్‌లో పరిస్థితులు, కాలేజీ లైఫ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు వంటి అంశాలతో అనేక కామెడీ స్కిట్‌లు చేసింది. ‘ద మిక్స్‌’ ఛానెల్‌కు ఇప్పుడు అయిదు లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వరంగల్‌ వందన ఎపిసోడ్‌లలో ‘టెన్త్‌ రిజల్ట్‌’ను 22 లక్షలమంది వీక్షించారు. హాస్టల్‌ వార్డెన్‌ ఎపిసోడ్‌ను 21 లక్షల మంది, హోమ్‌సిక్‌ ఎపిసోడ్‌ను 18 లక్షల మంది చూశారు. యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌లు తన జీవితలక్ష్యాన్ని మార్చాయని అంటోంది ఐశ్వర్య. 




వరల్ట్‌ ఫేమస్‌ గంగవ్వ

విజయానికి వయసుతో పనేముంది అంటుంది గంగవ్వ. ఆరు పదుల వయసులో వెబ్‌సిరీస్‌ నటిగా మారి, లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేనా సమంతను ఇంటర్య్వూ కూడా చేసింది గంగవ్వ. ‘మై విలేజ్‌ షో’లో తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ అవ్వ. ప్రస్తుతం 67 ఏళ్ల వయసు. కరీంనగర్‌ జిల్లా లంబాడిపల్లి గంగవ్వది. ఆమెకు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లు కూడా అభిమానులుగా మారిపోయారు. ‘మై విలేజ్‌ షో’ రూపకర్త శ్రీరామ్‌ శ్రీకాంత్‌ది కూడా అదే ఊరు. అందులో కామెడీ స్కిట్స్‌ చేస్తూ ప్రేక్షకులను నవ్వించేవారు. గంగవ్వ కూడా చిన్నచిన్న పాత్రలు వేసేది. ఆమె క్యారెక్టర్‌ వీక్షకులకు బాగా నచ్చడంతో ఇప్పుడు గంగవ్వే సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. ఆమెనే ప్రధాన పాత్రగా పెట్టి స్కిట్స్‌ చేస్తున్నారిప్పుడు. గంగవ్వ యూట్యూబ్‌ ఛానెల్‌ వల్ల కాస్త డబ్బులు కూడా సంపాదించుకుంటోంది. అంతకుముందు బతకడానికి కూలిపనులు, బీడీలు చుట్టడం వంటి ఎన్నో పనులు చేసేది. గంగవ్వ చేసిన ‘విలేజ్‌లో డ్రంక్‌ ఎన్‌ డ్రైవ్‌’ ఎపిసోడ్‌ను దాదాపు మూడు కోట్ల మంది దాకా చూశారు. గంగవ్వ పల్లె మాండలికం, చతుర్లు, విసుర్లు, గలగలా మాట్లాడే తీరు ఆకట్టుకుంటాయి.




పక్కా తెలంగాణ పిల్ల...

దేత్తడి హారిక అలియాస్‌ హారిక అలేఖ్య... దేత్తడి సిరీస్‌లో దుమ్మురేపుతోంది. కేవలం మూడే నెలల్లో లక్షల్లో అభిమానులను, నాలుగు లక్షల సబ్‌స్ర్కైబర్లను సాధించింది హారిక. పక్కా తెలంగాణ పిల్లా ట్యాగ్‌లైన్‌ను సంపాదించుకుంది. హారికది హైదరాబాదే. చదువుకునేరోజుల్లో హారికకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివాక అమెజాన్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్‌ చేసింది ‘టమడా’ మీడియా సంస్థ. అందులో తెలంగాణ యాస మాట్లాడే అమ్మాయి కోసం వెతికింది. తెలిసిన వ్యక్తి ద్వారా హారికకు ఆ అవకాశం దక్కింది. ఆ వెబ్‌సిరీసే ‘దేత్తడి’. ఉద్యోగం చేస్తూనే కొన్ని ఎపిసోడ్‌లు నటించింది. తల్లి సలహాతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి యూట్యూబర్‌గా మారింది. దేత్తడిలో ఆమె మొదటి స్కిట్‌ ‘ఫ్రస్ట్రేటడ్‌ తెలంగాణ పిల్లా’. దీనికి 35లక్షల వ్యూస్‌ వచ్చాయి. హారిక నటన యువతకు తెగ నచ్చేసింది. ఇంకేముంది స్టార్‌ యూట్యూబర్‌గా మారిపోయింది. అప్పుడప్పుడు సినిమా స్టార్స్‌తో కూడా చిన్న చిన్న స్కిట్స్‌ చేస్తోంది ఈ దేత్తడి పిల్ల. ప్రస్తుతం దేత్తడికి 12లక్షల మంది సబ్‌స్రైబర్లు ఉన్నారు. అత్యధికంగా ‘ద ఇన్విజిలేటర్‌’ ఎపిసోడ్‌ను 63లక్షల మంది వీక్షించారు. రెండేళ్ల నుంచి ‘దేత్తడి’ వెబ్‌ సిరీస్‌లో చేస్తోంది. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తోంది. తెలుగులో మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉంది హారిక. కాకపోతే ఎలాంటి విలువలేని హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలు మాత్రం చేయనంటోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించాలని ఆశపడుతోంది. 




ఎంత ఫ్రస్ట్రేషనో...

ఫ్రస్ట్రేషన్‌ లేని వాళ్లు కూడా సునయన ‘ఫ్రస్ట్రేషన్‌ విమెన్‌’ వెబ్‌ సిరీస్‌ చూస్తే కచ్చితంగా ఫ్రస్ట్రేట్‌ అవుతారు. ఆమె తన ముఖకవళికలతో, కంటి చూపుతోనే ఫ్రస్ట్రేషన్‌ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. అత్తా కోడళ్ల కొట్లాట దగ్గరి నుంచి, ఇంట్లో పనులు చేయలేక ఆడాళ్లకు వచ్చే ఫ్రస్ట్రేషన్‌ దాకా ఎన్ని రకాల కోపాలు నటించి చూపిస్తుందో. మనకి సునయన పాతికేళ్ల క్రితం అమ్మోరు సినిమాతోనే పరిచయం అయ్యింది. ఓ పాతిక సినిమాలు, కొన్ని సీరియళ్లలో నటించింది. అన్నట్టు మధ్యలో సునయన ఎంబీఏ కూడా పూర్తి చేసింది. ఆ తరువాత చక్కగా పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. 2016లో ‘ఫ్రస్ట్రేటడ్‌ విమెన్‌’తో యూట్యూబ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి వీడియో హిట్‌ కొట్టేసరికి ఏకంగా దాన్ని సిరీస్‌గా మార్చి రకరకాల ఫ్రస్టేషన్‌లను బయటపెట్టసాగింది సునయన . అన్నింట్లో ఆమె నటన సూపర్‌ హిట్‌. పిసినారి భర్తను భరించలేని భార్యగా చేసిన ఓ ఎపిసోడ్‌ను ఏకంగా 22లక్షల మంది వీక్షించారు. అత్తారిల్లు వర్సెస్‌ పుట్టినిల్లు ఎపిసోడ్‌ను 21లక్షల మంది చూశారు. ఇప్పుడు ఈమెకు మూడేళ్ల కొడుకు. సమంత ‘ఓ బేబీ’ సినిమాలో నటించిన సునయన , ఆకాష్‌ పూరి హీరోగా చేసిన సినిమాలో నెగిటివ్‌ రోల్‌ చేసింది. ఇంకా ఆ సినిమా విడుదల అవ్వలేదు. 




ఆద్యురాలు లిల్లీయే

యూట్యూబ్‌లో వెబ్‌సిరీస్‌ల వెల్లువ మొదలైందంటే దానికి కారణం లిల్లీ సింగ్‌ అనే చెప్పాలి. కేవలం యూట్యూబ్‌ స్కిట్‌లతోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కెనడాలోని టొరంటోలో నివసించే లిల్లీ ప్రవాస భారతీయురాలు. ఆమె తల్లిదండ్రులిద్దరూ పంజాబ్‌ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1988లో జన్మించిన లిల్లీ 2010లో యూట్యూబ్‌లో తన ఛానెల్‌ ‘సూపర్‌ ఉమెన్‌’ను మొదలుపెట్టింది. యూట్యూబ్‌ ఊపిరిపోసుకుని అప్పటికి అయిదేళ్లయ్యింది. మొదటి ఏడాది పెద్దగా క్లిక్‌ అవ్వలేదు ఛానెల్‌. 2011లో ఆ ఛానెల్‌ ‘సూపర్‌ ఉమెన్‌ వ్లాగ్‌’ కింద మార్చి తాను రోజూ చేసే పనులు, బ్లూపర్స్‌, తాను ఏం తింటుంది, చిన్న చిన్న కామెడి స్కిట్లు... ఇలా రకరకాల వీడియోలు చూపించేది. అది బాగా క్లిక్‌ అవ్వడంతో అమెరికాలో బాగా పాపులర్‌ అయిపోయింది లిల్లీ. ఆమెకు పంజాబీ మూలాలు బాగా ఒంటబట్టాయి. తన ప్రతి వీడియోలో పంజాబీ స్టైల్లో జోకులు ఉండేట్టు చూసుకుంటోంది. పంజాబీ కల్చర్‌మీదే కొన్ని కామెడీ వెబ్‌ సిరీస్‌లు కూడా తీసింది. అందులో తన అమ్మానాన్నలను కూడా నటింపజేసింది. ఇవన్నీ ఆమెను యూట్యూబ్‌లో అత్యధిక సంపాదనపరురాలిగా చేశాయి. ఇప్పుడు కేవలం యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ వ్యాపకాల ద్వారా ఆమె ఏడాదికి ఎంత లేదన్నా ఎనిమిది మిలియన్‌ డాలర్లు సంపాదిస్తోంది. ఇప్పుడు అమెరికా, కెనడాలలో ఆమె కూడా పెద్ద సెలెబ్రిటీగా మారిపోయింది. కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించింది. ప్రియాంకచోప్రాకు మంచి స్నేహితురాలు కూడా. పీసీ పెళ్లి వేడుకలో లిల్లీదే హంగామా అంతా. 




అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలో ఉద్యోగం వదిలి యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చా. నా వరకు అయితే నేను తీసుకున్నది సరైన నిర్ణయమే అనిపించింది. ఆదాయంతో పాటూ మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌ను యువత బాగా ఆదరిస్తోంది. నా మొదటి ఎపిసోడ్‌నే కొన్ని లక్షల మంది చూశారు. కామెడి స్కిట్‌లను చూసే వారి సంఖ్య గతంతో పోలిస్తే బాగా పెరిగింది. ఇప్పుడు మా ఇంట్లో కూడా నన్ను చూసి సంతోషంగా ఫీలవుతున్నారు. అలాగని ఎల్లకాలం  యూట్యూబ్‌లోనే ఉండిపోలేం. భవిష్యత్తుని నిర్మించుకోవాలి. ఆ ప్రయత్నాలలోనే ఉన్నా.

-  హారిక


పెద్దవాళ్లయినా, పిల్లలైనా యూట్యూబ్‌ చూసేది కామెడీ కోసమే. మాతృదేవోభవ సినిమా అత్యధ్భుతంగా ఉంటుంది. కానీ అలాంటి ఎమోషనల్‌ డ్రామా సినిమాలను రోజూ ఎవరైనా చూడగలరా? అందుకే నేను కూడా వినోదాత్మకంగానే స్కిట్‌లు చేస్తున్నాను. కంటికి కనిపించే సమస్యలే కాదు, కనిపించని సమస్యలు కూడా ఉంటాయి. ఆడవాళ్లకు అలాంటివి మరీ ఎక్కువ. పని మనిషితో మొదలై ఉద్యోగం వరకు రకరకాల సమస్యలు ఆమె ఎదుర్కొంటుంది. వాటికి కాస్త కామెడీని జోడించి ‘ఫ్రస్ట్రేటడ్‌ విమెన్‌’ మొదలుపెట్టా. ప్రస్తుతం కామెడీ స్కిట్‌ల కాలమే నడుస్తోంది. 

- సునయన


కథనం : సిహెచ్‌. హరిత 

Updated Date - 2020-07-12T18:46:07+05:30 IST