తొలిరోజు దీక్షలో ఇలా..

ABN , First Publish Date - 2021-10-22T08:16:01+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ముప్ఫై ఆరు గంటల నిరసన దీక్ష గురువారం ఉదయం జన సందోహం నడుమ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’

తొలిరోజు దీక్షలో ఇలా..

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ముప్ఫై ఆరు గంటల నిరసన దీక్ష గురువారం ఉదయం జన సందోహం నడుమ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఆయన ఈ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయలో దీక్షా వేదికపైకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఆయన చేరుకున్నారు. రాగానే మొదట పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పుష్పమాల వేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య దీక్షా శిబిరానికి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు తన దీక్ష ప్రారంభించారు. ఆయనకు ఇరు వైపులా తెలుగు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, బక్కని నర్సింహులు కూర్చున్నారు. దీక్ష ఉద్దేశాన్ని వివరిస్తూ తొలుత అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. రోజంతా నిరాహారంగా చంద్రబాబు గడిపారు. ఇతర నేతలు మధ్యాహ్న భోజనానికి వెళ్లినా ఆయన వేదికపై దీక్షలో అలాగే కొనసాగారు. చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీలు అశోక్‌ బాబు, సత్యనారాయణ రాజు, దువ్వారపు రామారావు, మాజీ మంత్రులు కళావెంకట్రావు, పీతల సుజాత, బండారు సత్యనారాయణ మూర్తి, యనమల రామకృష్ణుడు, ఎన్‌ఎండీ ఫరూక్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పర్సా రత్నం, పార్టీ నేతలు వంగలపూడి అనిత, జేసీ ప్రభాకర్‌ రెడ్డి తదితరులతో పాటు లక్ష్మీనారాయణ నాయకత్వంలో న్యాయవాదుల జేఏసీ బృందం వచ్చి చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపాయి. అమరావతి దళిత జేఏసీకి చెందిన బాలకోటయ్య, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోక వెంకటేశ్వరరావు కూడా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.


కిలోమీటరు నడిచి.. ఫెన్సింగ్‌ దూకి..

చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో టీడీపీ కేంద్ర కార్యాలయం గురువారం కిటకిటలాడింది. ఉదయం ఒక మాదిరిగా ఉన్న జన సందోహం సాయంత్రానికి విపరీతంగా పెరిగిపోయింది. వచ్చిన వారంతా పార్టీ కార్యాలయం మొత్తం తిరిగి చూసి ధ్వంసమైన వాహనాలు, అద్దాలు, తలుపులు, ఫర్నిచర్‌ వద్ద నిలబడి ఫొటోలు తీసుకొన్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ఉన్నారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొందరు వచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి కొందరు పార్టీ నేతలు తమ కార్యకర్తలను తీసుకొని బృందాలుగా వచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తమ పార్టీ నేతలతో కలిసి ఏభై కార్ల కాన్వాయ్‌గా తరలివచ్చారు. పోలీసులు టీడీపీ కార్యాలయానికి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో కళా వెంకట్రావు, ఫరూక్‌ వంటి మాజీ మంత్రులు కిలోమీటరుకు పైగా దూరం నడిచివచ్చారు. కొందరు కార్యకర్తలు జాతీయ రహదారి పై నుంచి ఫెన్సింగ్‌ దూకి వచ్చారు. మధ్యాహ్నం తర్వాత మాత్రం నడిచి వచ్చే వారిని పోలీసులు పెద్దగా ఆంక్షలు లేకుండా అనుమతించారు.


వేదికపై చంద్రబాబు నిద్ర

చంద్రబాబు గురువారం రాత్రి దీక్షా వేదికపైనే పడుకొన్నారు. పగలు ప్యాంటూచొక్కా ధరించిన ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకొన్నారు. పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చి వేదికపై పడుకొన్నారు. రాత్రి పదకొండు గంటలవరకూ నేతలతో అవీ ఇవీ మాట్లాడి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించారు. వేదిక చుట్టూ పార్టీ నేతలు, కార్యకర్తలు పరుపులపై పడుకొన్నారు. 



సీఎం, డీజీపీలే సూత్రధారులు దాడులపై ఫిర్యాదుచేసిన టీడీపీ


అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యాలయంపై దాడి సంఘటనలో సీఎం, సీఎం కార్యాలయం, డీజీపీలే సూత్రధారులని ఆరోపిస్తూ టీడీపీ ఫిర్యాదు చేసింది. దాడి జరిగిన రోజు అర్ధరాత్రి ఆ పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్‌బాబు ఈ ఫిర్యాదును మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఇచ్చారు. ఈ దాడిని ఆపడానికి పోలీసులు ఏ ప్రయత్నమూ చేయకుండా ఊరుకొన్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తమ కార్యాలయంపై దాడి చేసిన దుండగులకు పోలీస్‌ శాఖ నుంచి పూర్తి సహకారం లభించిందని, వారి బాస్‌ల ప్రమేయమే దీనికి కారణమని అందులో ఆరోపించారు. పోలీసు అధికారులు ఈ ఫిర్యాదుపై ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆ శాఖ అధికారులు ముందుకు రాకపోతే నిబంధనల ప్రకారం సంబంధిత న్యాయమూర్తి వద్ద ఆ ఫిర్యాదును నమోదు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆ ఫిర్యాదును న్యాయమూర్తికి ఇస్తే ఆయన పోలీస్‌ శాఖకు పంపిస్తారని, అప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఆ పార్టీ సంబంధిత న్యాయమూర్తి వద్ద దీనిని దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

Updated Date - 2021-10-22T08:16:01+05:30 IST