హోదాపై యుద్ధం ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-02-15T07:53:57+05:30 IST

ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని..

హోదాపై యుద్ధం ఎప్పుడు?

  • ప్రత్యేక హోదాపై జగన్‌ను నిలదీసిన చంద్రబాబు 
  • అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్నారు కదా
  • ప్రతిపక్షంలో గర్జించి ఇప్పుడు కుక్కిన పేనులానా? 
  • కేంద్ర కమిటీ అజెండాలోనే లేని ‘హోదా’.. మీ అసమర్థతే
  • ప్రధానికి వినతిపత్రం ఇచ్చే ధైర్యం కూడా లేదు
  • సినీ ప్రముఖులను పిలిచి ఘోరంగా అవమానించారు
  • చిరంజీవి లాంటి వారు చేతులు జోడించి వేడుకోవాలా? 
  • ప్రభాస్‌, రాజమౌళి, మహేశ్‌ బాబును కించపరుస్తారా? 
  • టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో అధినేత ఫైర్‌  
  • అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం
  • గంటల తరబడి కరెంట్‌ కోతలు.. బిల్లులేమో మోపెడు
  • విద్యుత్‌ మీటర్లపై కేసీఆర్‌ పాటి ధైర్యం కూడా లేదు
  • ఆస్తులు లాక్కోవడానికే ఆటోనగర్‌ స్థలాల జీవో: టీడీపీ 


అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు పదేపదే చెప్పారని, ఇప్పుడెందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించి, ఇప్పుడు కుక్కిన పేనులా ఉండటం దేనికి సంకేతమని మండిపడ్డారు. సోమవారం జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో హోదా అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్‌ సర్కారు వైఖరిని ఎండగట్టారు. ‘‘కేంద్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీ సమావేశం అజెండాలో హోదా అంశాన్ని పెట్టగానే.. అది మా ఘనతేనని వైసీపీ నేతలు మైకుల ముందు ఘనంగా చెప్పారు. సాయంత్రానికి సమావేశం అజెండా మారిపోయి హోదా అంశం తీసేశారు. ఏం చెప్పాలో తెలియక టీడీపీని తిట్టడం మొదలు పెట్టారు. జగన్‌ రెడ్డి అసమర్థతకు ఇది నిదర్శనం. ప్రధాన మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో హోదా అంశాన్ని చేర్చే ధైర్యం కూడా జగన్‌ రెడ్డి చేయలేకపోయారు. మా పోరాటం వల్లే హోదా అంశంపై కేంద్ర కమిటీ చర్చిస్తోందని గొప్పలు చెప్పిన వైసీపీ నేతలు దానిని ఎందుకు తొలగించారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 


సినీ ప్రముఖులను అవమానించారు

‘‘తెలుగు సినీ హీరోలను, ప్రముఖులను మీటింగ్‌ పేరుతో పిలిచి జగన్‌ రెడ్డి ఘోరంగా అవమానించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినీ పరిశ్రమను కించపర్చారు. స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ముఖ్యమంత్రికి చేతులు జోడించి వేడుకోవాలా? తెలుగు సినీ రంగం ప్రపంచ స్థాయికి చేరిందని కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ కూడా చెప్పారు. ప్రభాస్‌, రాజమౌళి, మహేశ్‌ బాబు వంటి వారిని పిలిచి వారిని కించపర్చేలా వ్యవహరిస్తారా’’ అని చంద్రబాబు మండిపడ్డారు. 


జగన్‌ విధానాలతో రాష్ట్రం పతనం

జగన్‌ రెడ్డి అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా పతనమైందని టీడీపీ వ్యూహ కమిటీ సమావేశం విమర్శించింది. ‘‘ఈ రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. 193 సార్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ తీసుకొన్నారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. పాఠశాలలను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేద వర్గాల పిల్లలకు పెద్ద దెబ్బ. ఎస్సీ బీసీ కాలనీల్లో ఉన్న పాఠశాలలను రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులు కనీసం 3 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సి వస్తుంది. చిన్న పిల్లలు అంత దూరం నడవలేక చదువు మావేసే ప్రమాదం ఉంది. నాడు-నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేయడం అంటే వాటిని మూసివేయడమా? గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్‌ తీసేస్తున్నారు. విద్యుత్‌ రంగంలో అగ్రగామి స్థానం నుంచి పతనం దిశకు రాష్ట్రం పయనిస్తోంది.


కరెంటు సరఫరా లేకపోయినా బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. ఎందుకు ఇంత బిల్లులు వస్తున్నాయో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాటి ధైర్యం కూడా జగన్‌కు లేదు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని వాటిని తీసివేయాలి’’ అని సమావేశంలో టీడీపీ విమర్శించింది. 


పేదల నిధులు మింగేస్తున్నారు 

‘‘ఉపాధి నిధులు రాష్ట్రంలో రూ.261 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ప్రకటించడం రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతికి నిదర్శనం. పేదలకు చేరాల్సిన నిధులను అధికార పార్టీ నేతలు మింగేస్తున్నారు. ప్రైవేటు ఆస్తులు లాక్కోవడానికే ఆటోనగర్‌లలోని స్థలాలపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ స్థలాలను కబ్జా చేయడానికి జగన్‌ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ ఉక్కు, కృష్ణపట్నం థర్మల్‌ స్టేషన్ల అమ్మకాన్ని ఆపడానికి జగన్‌ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయడం లేదు. ఉపాధి చూపకపోగా ఉపాధి మార్గాలను కూడా మూసి వేస్తున్నారు. మత్స్యకారులకు నష్టం చేసే 217 జీవోను వెంటనే రద్దు చేయాలి’’ అని టీడీపీ డిమాండ్‌ చేసింది. 


వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమా?: రామ్మోహన్‌ 

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేస్తే... మా పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు’’ అని శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హక్కుల సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తుంటే, జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా 8 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా కోసం ఇదే వైసీపీ నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారని, ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఏకంగా 28 ఉన్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడుదామని రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. 


దివాలాంధ్ర గా స్వర్ణాంధ్ర 

వైసీపీ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేయడాన్ని నిరసిస్తూ కడపలో టీడీపీ నేతలు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు హయాంలో స్వర్ణాంధ్రవైపు అడుగుపెడుతున్న రాష్ట్రాన్ని జగన్‌ చేతకాని పాలనతో  దివాలాంధ్ర గా మార్చారని మండిపడ్డారు. సోమవారం కడపలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి సెవెన్‌రోడ్స్‌ వరకు టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, పార్టీ నేతలు లింగారెడ్డి, అమీర్‌బాబు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, సాయినాథ్‌శర్మ తదితరులు భిక్షాటన చేశారు. జగన్‌ సర్కార్‌ చేసిన అప్పులు, ఒక్కొక్కరిపై పడిన భారాన్ని ప్రజలకు వివరించారు. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెడుతూ తనఖారెడ్డిగా మారిపోయారని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోదీని చంద్రబాబునాయుడు ఎదిరించారని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు.

 (కడప,ఆంధ్రజ్యోతి)  

Updated Date - 2022-02-15T07:53:57+05:30 IST