అరాచక పాలన అంతుచూద్దాం

ABN , First Publish Date - 2021-04-11T08:50:54+05:30 IST

వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే సువర్ణ అవకాశం తిరుపతి ఉపఎన్నిక అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలోనే

అరాచక పాలన అంతుచూద్దాం

తిరుపతి ఉప ఎన్నికే తొలి మెట్టు కావాలి

దోచుకోవడమే జగన్‌ అండ్‌ కో ధ్యేయం

అభివృద్ధి ఆగింది.. అప్పుల ఊబిలోకి రాష్ట్రం

చూస్తూ ఉండలేక రక్షించుకోవాలని వచ్చా

వృద్ధాప్యంలోనూ కష్టపడుతున్నా తమ్ముళ్లు, చెల్లెళ్లు చేతులు కలపండి

 సూళ్లూరుపేట సభలో చంద్రబాబు పిలుపు


రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారు. ఈ అరాచకపాలన అంతానికి తిరుపతి ఉప ఎన్నిక తొలిమెట్టు కావాలి. అప్పుల ఊబిలో కూరుకుపోతూ రాష్ట్రం అన్యాయమైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నా. అందుకే రాష్ట్రాన్ని రక్షించుకోవాలని వచ్చా. రాష్ట్రాన్ని దోచుకోవడమే ఈ జగన్‌ అండ్‌ కో ధ్యేయం.

చంద్రబాబు


సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 10: వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే సువర్ణ అవకాశం తిరుపతి ఉపఎన్నిక అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని తగల బెట్టేస్తున్నారని, ఈ అరాచకపాలన అంతానికి ఈ ఉప ఎన్నిక తొలిమెట్టు కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రాత్రి చంద్రబాబు రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభలో మాట్లాడారు. ‘వైసీపీని చిత్తు చిత్తుగా ఎందుకు ఓడించాలి? ఎందుకు టీడీపీని గెలిపించాలి? అని మీకందరికీ చెప్పేందుకే వచ్చాను. అభివృద్ధి ఆగిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోతూ రాష్ట్రం అన్యాయమైపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నా. అందుకే రాష్ట్రాన్ని రక్షించుకోవాలని వచ్చా. ఈ వయసులో ఈ కష్టం నాకు అవసరమా! సీఎం పదవి నాకు కొత్తకాదు.


నా రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. సమైక్యాంధ్రకు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు నాది. ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం అది. అలాంటి నేను ఈ రాష్ట్రం తగలబడిపోతుంటే మౌనంగా ఉండలేకపోతున్నా. నా ఆవేదన అర్థం చేసుకోండి. రాష్ట్రం నెంబర్‌ వన్‌ కావాలని పరితపించి పనిచేసినవాడిని. ఇప్పుడు చూడండి. రెండేళ్లకే ఎలా దిగజారిపోయిందో! జగన్మోహన్‌రెడ్డి సీఎం కాకముందు మీకందరికీ ముద్దులుపెట్టారు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్న మహానుభావుడు ఈ జగన్‌రెడ్డి’ అన్నారు. ‘అమ్మఒడి అంటూ 15 వేలు ఇస్తూ, నాన్న బుడ్డికి 30 వేలుకు దోచుకోవడం ఈ ముఖ్యమంత్రి నిర్వాకం. సొంత బ్రాండ్‌ మద్యంతో ప్రజలను దోచుకుంటున్నాడు. అది తాగితే గోవిందా.. గోవిందా! నేను సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్‌ బస్తా రూ.250. ఇప్పుడు రూ.400 అయిపోయింది. ఎందుకో తెలుసా జగన్‌రెడ్డి సొంత కంపెనీకి లాభాలు చేకూర్చేందుకే. అలాగే స్టీలు ధరలను పెంచేశాడు. ఇసుకను అందనివ్వకుండా చేసేశాడు. ఇలా రాష్ట్ర ప్రజలను అల్లాడిస్తున్నాడు. రాష్ట్రాన్ని దోచుకోవడమే ఈ జగన్‌ అండ్‌కో ధ్యేయంగా మారిపోయింది. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ప్రాణాలకే ముప్పు అని, రక్షించాలంటూ ప్రధాని మోదీకి మొరపెట్టుకోవడం అరాచకపాలన పరాకాష్టకు నిదర్శనం. తన చిన్నాన్న హత్యకు గురైతే హంతకుల్ని కాపాడే ఈ జగన్‌కి సాధారణ ప్రజలు ఓ లెక్కా?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 


‘ఆంధ్రజ్యోతి’ భవనాలు కూలగొట్టడం జగన్‌ పైశాచికత్వం..

రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ సీఎం సహించలేకున్నాడని, జైల్లో పెడతామంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘రాష్ట్రంలో అరాచకాలను ఎండగడుతున్న ఆంధ్రజ్యోతిపై అక్కసు కక్కుతూ విశాఖలో ప్రింటింగ్‌ ప్రెస్‌ను కూలగొట్టడం జగన్‌ పైశాచికత్వం. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం అన్యాయం కాదా? ఎందుకీ కక్ష. ఎందుకీ విధ్వంసం? అందుకే ఈ అరాచకపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. అందుకోసం ప్రజలు యుద్ధాలు చేయక్కరలేదు. వజ్రాయుధంలాంటి ఓటును ఈ అరాచకులపై ఉపయోగించాలి’ అని పిలుపునిచ్చారు.  


5 వేలకు అమ్ముడుపోవద్దు..

‘వైసీపీ నేతలు ఓటుకు రూ.1000, రూ.2000, అవసరమైతే రూ.5వేలు ఇస్తారు. మీరు అమ్ముడుపోతారా? కష్టాలు కొనితెచ్చుకుంటారా? తెలుసుకోండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంద రూ నడుంబిగించండి. తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపించి ఈ అరాచకపాలన అంతానికి తొలి అడుగు వేయండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T08:50:54+05:30 IST