Abn logo
Oct 27 2021 @ 22:07PM

శరవేగంగా ‘గంగ’ కాలువ లైనింగ్‌ పనులు

పులికల్లు సమీపంలో జరుగుతున్న లైనింగ్‌ పనులు

రూ.39.12కోట్ల నిధుల మంజూరు


పొదలకూరురూరల్‌, అక్టోబరు 27 : తెలుగుగంగ పథకంలో భాగమైన కండలేరు ఎడమ కాలువ లైనింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కాలువ ద్వారా మూడు మండలాల్లోని 32 చెరువులకు నీరు అందడంతోపాటు, 27వేల ఎకరాలకు సాగు నీరందుతోంది. తెలుగుగంగ హైలెవల్‌ స్లూయీజ్‌ నుంచి కనుపూరు కాలువ వరకు ఈ లైనింగ్‌ పనులు రూ.39.12 కోట్లతో మంజూరయ్యాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి గత నెలలో లాంఛనంగా పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పులికల్లు స్పిల్‌ వే సమీపంలోని 7వ కిలోమీటరు వరకు పనులు పూర్తయ్యాయి. మరో 20రోజుల పని జరిగిన అనంతరం పనులు నిలుపు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ రబీ సీజన్‌ కోసం కాలువకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్యాంలో 56.564 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గంగ ఎడమ కాలువకు ప్రతిరోజు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటారు. ఈ కాలువ కింద చేజర్ల, పొదలకూరు, నెల్లూరు రూరల్‌ మండలాల పరిధిలో సాగునీరు సరఫరా అవుతుంది. డ్యాంలో నీరు తక్కువ ఉన్నప్పుడు కాలువ కింద చివరి ఆయకట్టుకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైనింగ్‌ పనులు పూర్తయితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.