భానుడి భగభగ

ABN , First Publish Date - 2020-05-23T10:00:30+05:30 IST

రోహిణికార్తెకు ముందునుంచే ఎండలు దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

భానుడి భగభగ

తీవ్ర వడగాల్పులతో జనం విలవిల

ఉదయం 7 నుంచి రాత్రి 6 గంటల వరకూ తీవ్రత 

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి 

42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 


కరీంనగర్‌ టౌన్‌, మే 22: రోహిణికార్తెకు ముందునుంచే ఎండలు దంచికొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేడిమి తగ్గడం లేదు. మధ్యాహ్నం వేళల్లో నిప్పులకుంపటిని తలపిస్తోంది. రోహిణి కార్తెలో రోళ్లు నిండే వర్షాలు లేదా రోకళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి. అయితే  రోహిణికి వారంరోజుల ముందు నుండే 40 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కరీంనగర్‌  42 నుంచి 43 డిగ్రీలు దాటిపోవడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.


కరోనా పుణ్యమాని లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ఇంటికే పరిమితం కావడంతో మార్చి, ఏప్రిల్‌, మే రెండవ వారం వరకు ఎండలపై ధ్యాసే లేకుండా పోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో వారంరోజులుగా జనం మెల్లమెల్లగా రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేయడం, సరిబేసి విధానం రద్దుచేసి వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలన్నిటినీ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే దుకాణాల్లో లావాదేవీలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ వారం రోజుల నుండి ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతుండడంతో ఉదయం 11 గంటల వరకే ప్రజలు రోడ్లపై కనిపిస్తున్నారు. అత్యవసరమైన వారు తలకు తువ్వాలలు, రుమాళ్లు, హెల్మెట్లు, కళ్లజోళ్లతో బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు కరోనాతో రెండునెలలు దుకాణాలు మూసివేశామని, ఇప్పుడు ఎండల తీవ్రత అధికం కావడంతో ప్రజలు బయటకు రాకపోవడంతో వ్యాపారం సాగడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ లైన్ల మరమ్మతు, అభివృద్ధి పనుల పేరుతో దాదాపు రోజూ నగరంలో కరెంటు కోతలు అధికారికంగా, మరికొన్ని సమయాల్లో అనధికారికంగా సరఫరాను నిలిపివేస్తుండడంతో ఎండ వేడిమికి ఇళ్లలో ఉండే జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


సాయంత్రం 6 గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడిచినా వడగాలుల తీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్నం ఎండ మరింత ఉగ్రరూపం దాల్చుతుండడంతో జనంతో పాటు పశుపక్ష్యాదులు సైతం విలవిలాడుతున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ వెల్లడిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, వృద్ధులపై వడదెబ్బ పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో వారు బయటకి రాకూడదని ఒకవేళ రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2020-05-23T10:00:30+05:30 IST