భానుడి భగభగ

ABN , First Publish Date - 2020-05-03T07:03:02+05:30 IST

ఓవైపు కరోనా భయం.. మరోవైపు మండుతున్న ఎండలు.. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

భానుడి భగభగ

ఇళ్లకే పరిమితమవుతున్న జనం

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

రాత్రి 7 గంటల వరకు వడగాలులు

లాక్‌డౌన్‌తో ఏసీలు, కూలర్ల అమ్మకాలకు బ్రేక్‌ 


కరీంనగర్‌ టౌన్‌, మే 2:  ఓవైపు కరోనా భయం..  మరోవైపు మండుతున్న ఎండలు.. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కనిపించని కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంటే సూర్యుడు తన ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో ప్రజలు బయటకు రావడం లేదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు వేడిమిని తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీస్తున్న వడగాల్పులతో ఇంటా బయట వేడిమిని తట్టుకోలేక పోతున్నారు. 


నిర్మానుష్యంగా రహదారులు

మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రతిఏటా వేసవి కాలంలో  ఎండవేడి నుంచి తట్టుకునేందుకు చేతి రుమాలు, టవల్స్‌, టోపీలు, కళ్లజోళ్లు, మహిళలు స్కార్ఫ్‌లు, హెల్మెట్లు ధరిస్తుండడంతో వాటి అమ్మకాలు జోరుగా సాగేవి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చెరుకు రసాలు, మజ్జిగ, ఇతర పండ్ల రసాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుండడంతో రోడ్లపై ఎక్కడ చూసినా అవే కనిపించేవి.  ఇళ్లలో వేడిమిని భరించ లేని పరిస్థితిలో చిన్న, మధ్యతరగతి ప్రజలు కూలర్లతో, ఉన్నత వర్గాలవారు ఏసీలతో ఉపశమనం పొందేవారు.  వాహనాల్లో తిరగే వారు కూడా ఏసీని తప్పనిసరిగా వినియోగించారు. దీంతో ఆయా సీజనల్‌ వ్యాపారాలు జోరుగా సాగి వ్యాపారులకు సిరులు కురిపించేవి. రంజన్లకు విపరీతంగా గిరాకీ ఉండేది. 


ఇబ్బందుల్లో సీజనల్‌ వ్యాపారులు

ఈయేడు అదే తరహాలో వేసవిలో సీజనల్‌ వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారులు జనవరి నుంచే స్టాక్‌లను నిల్వ చేసుకొని మార్చి నుంచి వ్యాపారాలు ఊపందుకుంటాయని ఆశపడ్డారు. వారి ఆశలను కరోనా అడియాశలు చేసింది. మే చివరి వారం వరకు కూడా ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, అవసరమైతే జూన్‌, జూలైలో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే ప్రచారంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


వేసవి సీజన్‌ కోసం తీసుకు వచ్చిన స్టాక్స్‌ నిలువలన్నీ గోదాముల్లోనే మూలుగుతుండగా, దుకాణాలకు తాళం కూడా తీయలేని పరిస్థితిలో వర్షాకాలం వస్తే మళ్లీ వేసవి వరకు సీజనల్‌ వ్యాపాలు సాగవని ఆందోళన చెందుతున్నారు. వేసవి సీజన్‌ వ్యాపారాలతో ఏడాదిపాటు అటోఇటో కాలం వెల్లదీసే పేద, మధ్యతరగతి వ్యాపారులతోపాటు బడావ్యాపారులు సైతం కరోనాతో భావురు మంటున్నారు. ఏసీలు, కూలర్లు అమ్మేవారే కాకుండా రిపేర్లు, ట్రాన్స్‌పోర్టులు, ఆటో డ్రైవర్లు, కూలీలు, రోడ్ల పక్కన టోపీలు, కళ్లజోళ్లు, చేతి రుమాళ్లు, పంచెలు, రంజన్లను అమ్ముకునే చిరువ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


కరోనా వైరస్‌ ఏసీ, కూలర్ల వాడకంతో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే ప్రచారంతో చాలా మంది ఇంకా ఏసీలు, కూలర్లను కూడా వినియోగించేందుకు జంకుతున్నారు. మే మొదటి వారంలోనే వేసవి ఎండల తీవ్రత ఇలా ఉంటే ఈనెల మొత్తంతోపాటు జూన్‌ రెండవ వారం వరకు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనా మరోవైపు ఎండలు ప్రజలను కదలకుండా చేస్తున్నాయి. ఇళ్లకే పరిమితమైన జనం భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  


Updated Date - 2020-05-03T07:03:02+05:30 IST