మంత్రికే దక్కని మర్యాద!

ABN , First Publish Date - 2020-11-26T06:35:08+05:30 IST

విశాఖపట్నం దేవదాయ శాఖ వివాదాలకు కేంద్రంగా..

మంత్రికే దక్కని మర్యాద!
గుడిలోవ రంగనాథస్వామి ఆలయం, ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఆయనకు తెలియకుండానే ఆలయ ట్రస్ట్‌బోర్డు నియామకం

...పైగా ఆయన ఇలాకాలోని ఆలయానికి 

ఇదీ గుడిలోవ రంగనాథస్వామి ట్రస్ట్‌బోర్డు స్వరూపం

పీఠాధిపతి చెప్పారని ముందూవెనుకా చూడకుండా దేవదాయ శాఖ అధికారి నిర్ణయం

పొరుగు జిల్లా వ్యక్తికి చైర్మన్‌ పీఠం

దేవుడి భూముల కోసమే వ్యవహారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం దేవదాయ శాఖ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. పెద్దల ప్రాపకం కోసం తాపత్రయపడుతున్న కొందరు అధికారులు ‘కొత్త’రకం నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరికైతే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారో గుర్తించి... వారు చెప్పిన పనులను ముందు వెనుకా చూడకుండా చేసేస్తున్నారు. స్వామికార్యం... స్వకార్యం కానిచ్చేస్తున్నారు. 


దేవదాయ శాఖ జిల్లా అధికారులు ఇటీవల భీమిలి నియోజకవర్గంలోని గుడిలోవ రంగనాథస్వామి ఆలయానికి ట్రస్టు బోర్డును నియమించారు. సాధారణంగా ఏదైనా నియోజకవర్గంలో ఆలయాలకు ట్రస్టుబోర్డులు వేయాలనుకున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా చూసుకుంటే గుడిలోవ ఆలయం వున్న ప్రాంతానికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే. ఆయన జిల్లా మంత్రి కూడా. ట్రస్టుబోర్డు నియామించాలనుకుంటే తప్పనిసరిగా ఆయన దృష్టిలో పెట్టాలి. కానీ దేవదాయ శాఖ అధికారులు ఆ సంప్రదాయం పాటించలేదు. ఓ పీఠాధిపతి చెప్పారని పేర్కొంటూ ట్రస్టుబోర్డును ఎంపిక చేసి, అమరావతిలోని కమిషనర్‌ కార్యాలయానికి పంపించి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఆగమేఘాలపై ఆ వెంటనే ఆ సభ్యులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు. 


ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ది పొరుగు జిల్లా

ఇక్కడ అధికారులు చేసిన మరో తప్పిదం ఏమిటంటే... ఆ ట్రస్టుబోర్టుకు చైర్మన్‌గా నియమించిన వ్యక్తిది విశాఖ జిల్లానే కాదు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇటీవల పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలకు వచ్చినప్పుడు తన మనసులో కోరికను చెప్పడం, వెంటనే ఆయన... జిల్లా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించడంతో ఆ మరుసటిరోజే ఉత్తర్వులు తయారైపోయాయి. జిల్లాలో మంత్రి వున్నారని, పైగా ఆ ఆలయం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోనిది అనే ఆలోచన కూడా అధికారులకు రాలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్‌చార్జికి తాను ఎంత చెబితే.. అంత అన్న అతి విశ్వాసంతో ఓ జిల్లా అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నియోజకవర్గంలో నాయకులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ముందు ఆశ్చర్యపోయారు. ట్రస్టు బోర్డు వేస్తే... నియోజకవర్గ ఎమ్మెల్యేకు చెప్పాల్సిన అవసరం లేదా?... అని సదరు అధికారిని ప్రశ్నించారు. అటు నుంచి మౌనమే సమాధానమైంది. దాంతో మంత్రి నేరుగా దేవదాయ కమిషనర్‌కు విషయాన్ని చెప్పి, తాము చెప్పిన వ్యక్తులకు ట్రస్టుబోర్డులో అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రస్తుతం అమరావతిలో చర్చ జరుగుతోంది. 


పీఠం వైపు చూడవద్దని చెప్పినా...!

పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై... చివరకు దాన్ని ఉపసంహరించుకున్న విషయం రాష్ట్రమంతా తెలుసు. అటువంటి సమయంలో కూడా దేవదాయ శాఖ అధికారులు ఆయన మాటకే విలువ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు చెందిన వ్యక్తి పేరు సిఫారసు చేసినా, లేదంటే...ఆ పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినా...ఈ విషయం ఇంతవరకు వచ్చి వుండేది కాదని అంటున్నారు.  


దేవుడి భూములపైనే కన్ను

గుడిలోవ రంగనాథస్వామి ఆలయానికి సుమారు 100 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని కొందరు ఆక్రమించుకుని లేఅవుట్లు వేశారని, వాటిని సక్రమం చేసుకోవడానికి ట్రస్టుబోర్డులో ప్రవేశించారని ప్రచారం జరుగుతోంది. చివరకు దేవుడి భూములు పరులపాలు కావడానికి దేవదాయ శాఖ అధికారులే రాచమార్గం వేసినట్టయిందని, ఇక వాటికి రక్షణ ఎక్కడుందని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి పెద్దగా ఆదాయం లేకపోయినా ఆస్తులు వున్నాయని, అవి అన్యాక్రాంతం కాకుండా చూడాలని రంగనాథస్వామి భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-11-26T06:35:08+05:30 IST