గుడి గంటలు

ABN , First Publish Date - 2020-06-07T08:34:43+05:30 IST

భక్తులను ఆలయాల్లో దర్శనానికి ఈనెల 10 నుంచి అనుమతించనున్నట్లు దేవదాయశాఖ స్పష్టంచేసింది. 8, 9 తేదీల్లో ట్రయల్‌ నిర్వహించాలని, 10 నుంచి సాధారణ పద్ధతిలో అనుమతించాలని

గుడి గంటలు

  • 10 నుంచి దర్శనాలకు ఓకే
  • మాస్కు, గుర్తింపు కార్డు ఉంటేనే..
  • ఎస్‌ఎంఎస్‌ ద్వారా టైమ్‌ స్లాట్‌ బుకింగ్‌
  • వృద్ధులు, పిల్లలకు అనుమతి లేదు
  • కట్టడి ప్రాంతాల్లోని ఆలయాలకు నో
  • దేవదాయశాఖ మార్గదర్శకాలు
  • తిరుమలలో భక్తులకు 11 నుంచే..

అమరావతి/తిరుమల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): భక్తులను ఆలయాల్లో దర్శనానికి ఈనెల 10 నుంచి అనుమతించనున్నట్లు దేవదాయశాఖ స్పష్టంచేసింది. 8, 9 తేదీల్లో ట్రయల్‌ నిర్వహించాలని, 10 నుంచి సాధారణ పద్ధతిలో అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ అర్జునరావు శనివారం మార్గదర్శకాలు జారీచేశారు. కట్టడి ప్రాంతాల్లోని ఆలయాల్లోకి భక్తులను అనుమతించొద్దని స్పష్టంచేశారు. కాగా తిరుమలలో ఈనెల 8, 9 తేదీల్లో ఉద్యోగులకు, 10న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. శనివారం నుంచే తిరుమలకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు.


భక్తులు చేయాల్సినవి...

భక్తులు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలి. కచ్చితంగా మాస్కు ధరించాలి. ఆలయంలో ఉన్నంతసేపూ మాస్కుతోనే ఉండాలి. ప్రవేశానికి ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. క్యూ లైన్లలో నిర్దేశిత దూరం(ఆరడుగులు) కచ్చితంగా పాటించాలి. కేటాయించిన సమయంలోనే రావాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అంతరాలయ, గర్భాలయ దర్శనాలు ఆశించకూడదు. కేవలం లఘు దర్శనాలకే అనుమతి. తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ శఠారి, తీర్థం లాంటివి ఉండవు. గంటకు 300 మందిని మాత్రమే అనుమతిస్తారు. అన్నదాన కార్యక్రమాలకు, ఆలయ పరిసరాల్లో పొంగలి పంపిణీకి అనుమతి లేదు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను తీసుకొచ్చేందుకు అనుమతి లేదు.


సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సిబ్బంది అంతా కచ్చితంగా మాస్కులు ధరించాలి. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకే భక్తులను అనుమతించాలి. క్యూలైన్లలో భౌతిక దూరాన్ని సూచిస్తూ మ్కారింగ్‌ చేయాలి. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం కోసం ప్రతి ఆలయంలో రెండు క్యూలైన్లు మాత్రమే ఉండాలి. ఆలయాల మండపాల్లో 30 మందికి మించి అనుమతించకూడదు. సరిపడా ఽథర్మల్‌ గన్స్‌ ఏర్పాటుచేసి, భక్తులను ప్రతి పాయింట్‌లోనూ పరిశీలించాలి. సాధారణ ఉష్ణోగ్రతతోపాటు దగ్గు, జలుబు లేని వారిని మాత్రమే అనుమతించాలి. ఆలయంలో, పరిసరాల్లో, క్యూలైన్లలో సోడియం హైపోక్లోరైట్‌ స్ర్పే చేయాలి. స్థానిక పరిస్థితుల ఆధారంగా దర్శనం సమయాలను తగ్గించుకోవచ్చు. భక్తులకు ఎస్‌ఎంఎస్‌ విధానం ద్వారా టైమ్‌ స్లాట్‌లు కేటాయించాలి. భక్తుని పేరు, ఆధార్‌ నంబరు, గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేయాలి.


50 శాతం గదులే..

ఆలయాల్లోని 50శాతం గదులను మాత్రమే కేటాయించాలి. ప్రత్యామ్నాయ విధానం(1,3,5)లో భక్తులకు గదులను ఇవ్వాలి. వీలైనంత వరకూ నగదు రహిత లావాదేవీలనే ప్రోత్సహించాలి. గదికి ఇద్దరు భక్తులనే అనుమతించాలి. ప్రసాదం పంపిణీ చేసేవారూ కచ్చితంగా గ్లౌజులు ధరించాలి. ప్రసాదం విక్రయ   కేంద్రాల్లో ఆహారం తినకూడదు. పూజాసామగ్రి విక్రయించే షాపులను కూడా ఒకటి వదిలి మరొకటి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ రోజుల్లో అందరూ షాపులు తెరిచేలా చూడాలి.


8, 9 తేదీల్లో ట్రయిల్‌ రన్‌

విజయవాడ(వన్‌టౌన్‌): దేవాలయాల్లోకి ఈనెల 10 నుంచి భక్తులను అనుమతించనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. 8, 9 తేదీల్లో ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయిల్‌ రన్‌ నిర్వహిస్తారని, ట్రయిల్‌ రన్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరిస్తామన్నారు. శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. దుర్గగుడిలోకి గంటకు 300 మందిని అనుమతిస్తామన్నారు. దుర్గగుడి కేశఖండనశాలను తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం కట్టడి ప్రాంతంలో ఉన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జున్‌రావు, ఏడీసీ రామచంద్రమోహన్‌ పాల్గొన్నారు.


సీమ జిల్లాల్లో 8 నుంచే: డిప్యూటీ కమిషనర్‌

కర్నూలు(అర్బన్‌): రాయలసీమలో ఈ నెల 8వ తేదీ నుంచే ఆలయ ప్రవేశాలకు అనుమతులుంటాయని దేవాదయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి. సుబ్బారావు తెలిపారు. తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో తొలి రెండు రోజులు ఆలయ సిబ్బంది, స్థానికులకు, 10వ తేదీ నుంచి అందరికీ అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. సీమ జిల్లాల్లో మొత్తం 12,889 ఆలయాలున్నాయన్నారు. 


30% టికెట్లే..

సేవ, నిత్య కల్యాణం, రాహుకేతు, అభిషేకం, హోమాలు, ఆర్జిత సేవల టికెట్లను మొత్తం సామర్థ్యంలో 30 శాతం మాత్రమే అనుమతించాలి. వీటికి కూడా భౌతిక దూరం పాటిస్తూ మార్కింగ్‌ చేయాలి. టికెట్లున్న వారు, దంపతులను మాత్రమే పూజకు అనుమతించాలి. వారి బంధువులకు అనుమతి ఉండదు. కేశఖండనశాలల్లోకి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న క్షురకులను, భక్తులను అనుమతించకూడదు.  కనీస  దూరం(2 మీటర్లు) పాటించాలి. అన్ని వస్తువులను వినియోగించే ప్రతిసారీ శానిటైజ్‌ చేయాలి.  


తిరుమలలో దర్శన ఏర్పాట్లు

తిరుమలలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం నుంచి శ్రీవారి దర్శనాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ విధులకు హాజరు కావాలని టీటీడీ ఆదేశించింది. శనివారం నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. వంద బస్సులను కేటాయించి టీటీడీ ఉద్యోగులను తిరుమలకు చేరవేసి, తిరిగి తిరుపతికి తీసుకెళ్లేలా బస్సులు నడుస్తున్నాయి. ట్రయల్‌రన్‌ కింద ఉద్యోగులకు అలిపిరి వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. బస్సులన్నిటినీ శానిటైజ్‌ చేస్తున్నారు. అలిపిరి, తిరుమలల్లోని బాలాజీ బస్టాండ్‌, రాంభగీచ బస్టాండ్‌ వద్ద టికెట్ల కేటాయింపునకు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేసి భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. అలిపిరి నుంచి తిరుమల ఆలయం వరకు భక్తులు పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తల సమాచారంతో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. కాగా, మార్గదర్శకాలపై భక్తులు, మీడియా, మతపెద్దలు సూచనలందజేస్తే మార్పుచేర్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 3వేలు, తిరుపతిలో ఉచిత ఎస్‌ఎ్‌సడీ(స్లాటెడ్‌ సర్వ దర్శనం) టికెట్లు 3వేల మందికి ఇస్తామన్నారు.

Updated Date - 2020-06-07T08:34:43+05:30 IST