పదిలక్షల సాధికారత

ABN , First Publish Date - 2021-06-29T06:30:39+05:30 IST

ఆశ్చర్యకరమైన ‘మేల్కొలుపు’ పొంది, అనేక అపూర్వ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, దళిత సాధికారత కోసం వివిధ పక్షాల సమావేశం...

పదిలక్షల సాధికారత

ఆశ్చర్యకరమైన ‘మేల్కొలుపు’ పొంది, అనేక అపూర్వ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, దళిత సాధికారత కోసం వివిధ పక్షాల సమావేశం ఏర్పాటు చేసి, ఒక కొత్త పథకాన్ని ప్రకటించి, ప్రతిపక్ష నేతలను కూడా ముగ్ధులను చేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సరే, ఈ మధ్య వారు అధికార పార్టీతో అసాధారణమైన సమ్మతిలో వ్యవహరిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ, సమావేశానికి హాజరయిన కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ప్రశంసలతో ముంచెత్తడం ప్రత్యేకంగానే కనిపించింది. కెసిఆర్ ప్రకటించిన పథకం అసామాన్యమైంది మరి. నియోజకవర్గానికి 100మంది దళితులను ఎంపిక చేసి, వారికి పదిలక్షల నగదును అందిస్తారు. మొత్తం 119 నియోజకవర్గాలకు కలిపి, 11900 మందికి, 1190 కోట్ల రూపాయలను ఈ పథకం కింద వితరణ చేస్తారు. ఇంతటితో అయిపోలేదు, మొత్తం 40 వేల కోట్లను దళితుల అభివృద్ధికి వెచ్చించనున్నారట. సహజంగానే ఈ అంకెలు ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా, లేకలేక దళితుల అభివృద్ధిని ముఖ్యమంత్రి పట్టించుకోవడం స్వాగతించవలసిన పరిణామమే కదా? విమర్శలు తరువాత, ముందయితే, ఆ సంకల్పాన్ని, పథకాన్ని అభినందించవలసిందే కదా!


మునుపు అనేక మార్లు నిరూపణ జరిగినట్టు, కెసిఆర్ ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి. తెలంగాణలో పట్టణాలను అంతర్జాతీయ నగరాల స్థాయికి తీసుకువెళతానని ఆయన అనేక మార్లు చెప్పారు. నూట పాతిక అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్థామని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి చొప్పున కేటాయిస్తానన్నారు. అధికారానికి రాకముందు అయితే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అన్నారు. ఊహలు ఉన్నతంగా ఉన్నంత మాత్రాన, అన్నీ జరగవు. కొన్నిటికి వనరులు సమకూరవు, మరికొన్నిటికి చిత్తశుద్ధి సరిపోదు. అట్లాగని, సత్సంకల్పాలను అనుమానించలేము కదా? కాకపోతే, నిలకడైన, ఆచరణ సాధ్యమైన, వాస్తవంగా ప్రయో‍‍జనకరమైన ఆలోచనలు చేయడం కానీ, చేసినవాటిని తప్పనిసరిగా అమలుచేయడం కానీ జరగకపోతే పెద్ద పెద్ద మాటలు నీటి మూటలుగా డాంబికాలుగా మిగిలిపోతాయి. 


దళితుల విషయంలో కెసిఆర్ తీరు తరచు విమర్శలకు లోనయిన మాట వాస్తవం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, రోహిత్ వేముల సంఘటన సమయంలో ఏ వైఖరీ ప్రకటించకపోవడం ఆయనకు చెడ్డ పేరు తెచ్చాయి. ఇక, దళిత ముఖ్యమంత్రి పాతపడిపోయిన అంశం. నిజంగా అది అమలుజరుగుతుందని ఎవరైనా అనుకున్నారా అన్నది సందేహమే. కానీ, ఆ వాగ్దానం కెసిఆర్ ప్రతిష్ఠను పెంచింది, ఎన్నికలలో కూడా ఎంతోకొంత మంచిచేసింది. ఆ మాట నిలబెట్టుకోలేనప్పుడు, సమాజానికి, కనీసం దళిత ప్రజలకు వివరణ ఇచ్చుకుని ఉండవలసింది. ఆ వాగ్దానభంగానికి పరిహారం చేస్తామని, గొప్ప గొప్ప మేళ్లు చేస్తామని చెప్పి ఉండవలసింది. సరే, అది జరగలేదు. కెసిఆర్ తలపెట్టిన భూపంపిణీ పథకం నిజంగా ప్రశంసార్హమైనది. గ్రామీణ దళితులకు వాస్తవిక సాధికారతను ఎంతో కొంత ఇవ్వగలిగిన పథకం అది. భూసంస్కరణలను తప్పించుకున్న వారి యాజమాన్యం నుంచి మిగులు భూమిని స్వాధీనం చేసుకుని, దళితులకు ఇవ్వాలనుకుంటే, ఆ పథకానికి కావలసిన వనరులు సమకూరేవి. భూయజమానులకు ఎటువంటి కష్టనష్టాలు కలిగించడానికి కెసిఆర్ సమ్మతించరు. కౌలుదార్ల విషయంలో కూడా ఆయన వైఖరి స్పష్టం. మిగులుభూముల పంపకం ద్వారా కాకుండా, భూమిని కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయడానికి సంకల్పించారు. మొదట కొన్ని పంపకాలు జరిగాయి. కొందరు లబ్ధి పొందారు. భూమి ఒక్కటే సరిపోదు కదా, వాటికి వ్యవసాయ యోగ్యత, పెట్టుబడులు కావాలి. ఈలోపల, దళితుల కోసం భూసేకరణ పేరుతో, పనికిమాలిన, పడావు భూములను ప్రభుత్వానికి కట్టబెట్టడానికి కొందరు స్వార్థపరులు ప్రయత్నించారు. సగటున ఎకరానికి మూడు లక్షల చొప్పున కొని మూడెకరాల చొప్పున ఇవ్వాలంటే అందుకు కావలసిన ఆర్థిక వనరులు చిన్నవి కావు. అయితే, ఇప్పుడు కుటుంబానికి ఇవ్వబోతున్న 10 లక్షలకు బదులు భూమి ఇవ్వడం సాధ్యపడేది కాదా? మూడెకరాల పథకం మూలకుపడేసినప్పుడు, 40వేల కోట్లు మాత్రం ఎట్లా సమకూరుతాయి? ఇవన్నీ ప్రశ్నలు.


తెలంగాణ మొత్తం మీద సుమారు 12 వేల మంది దళితులు లక్షాధికారులు కావడం ఆహ్వానించదగినదే. మొత్తం దళిత జనాభాలో ఈ సంఖ్య ఏ పాటిది అన్న ప్రశ్న ఎట్లాగూ ఉంటుంది. ఇదొక ప్రతీకాత్మక చర్య అనుకోవాలి. అయితే, లబ్ధిదారులకు ఆ డబ్బును సుస్థిర ఆదాయమార్గాలుగా మలచు కునే అవకాశాలు, మార్గదర్శకత్వం ఉంటే ఈ వితరణ సద్వినియోగం అవుతుంది. పదిలక్షల మంజూరీలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, అధికారుల దాకా ఎంతెంత ఆశిస్తారో, చివరకు లబ్ధిదారుడికి ఏ మాత్రం దక్కుతుందో తెలియదు. లభించిన సొమ్మును కాపాడుకోవడం, వ్యవసాయంలోనో వ్యాపారంలోనో సమర్థంగా పెట్టుబడి పెట్టడం.. ఇవి తరతరాలుగా కూలీలుగా, నిరుపేదలుగా ఉన్నవారికి అలవడి ఉండే నైపుణ్యాలు కావు కాబట్టి, అక్కడ వారికి ఇతరుల సూచనలు అవసరం. దళితవర్గాల నుంచే వ్యాపారవేత్తలుగా, వ్యవసాయికులుగా ఎదిగినవారే వారిని ముందుండి నడిపించాలి. ప్రభుత్వ యంత్రాంగానికి దీని గురించిన ఒక అవగాహన, పట్టింపు ఉండాలి. నగదు బదిలీ చేయడం దానంతట అది చెడ్డది కాకపోవచ్చును కానీ, దళిత సాధికారత కోసం మరింత సృజనాత్మకమైన కార్యక్రమాలను ఆలోచించడానికి ఆస్కారం ఉన్నది, అందుకు ఎన్నికలకు అతీతమైన విచక్షణ అవసరం. ఈ కొత్త సాధికారతా పథకం ప్రకటించడానికి ముందే యాదాద్రి జిల్లాలో దళితమహిళ మరియమ్మ లాకప్ హత్య కలకలం సృష్టించింది. ఉచితాలు, పథకాలు సరే కానీ, దళితుల ప్రాణాలకు రక్షణ, సమస్త వ్యవస్థల ఎదుట వారిపై గౌరవం కల్పించడం ప్రభుత్వం నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో ముఖ్యమైనవి. 


ఈ విడత కూడా ఒక ఏడు ముందుగానే ఎన్నికలు తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే కెసిఆర్‌లో చురుకుదనం చొరవ పెరిగాయని కొందరు ఏవో ప్రచారాలు చేస్తున్నారు. మరి కొందరు మరీ అన్యాయంగా, హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దళితులపై కొత్త ప్రేమలు కురిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అవేవీ నిజం కావని, వాయిదా పడుతూ వస్తున్న దళిత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం కోసమే కెసిఆర్ ఈ పథకం ప్రారంభించారని అనుకోవడం ఉత్తమం. 

Updated Date - 2021-06-29T06:30:39+05:30 IST