‘పది’ పరేషాన్‌

ABN , First Publish Date - 2022-03-04T05:38:27+05:30 IST

కరోనాతో రెండేళ్లు పదో తరగతి విద్యార్థులను డైరెక్ట్‌ పాస్‌ చేయగా.. ఈ ఏడాది కచ్చితంగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘పది’ పరేషాన్‌
పదో తరగతి విద్యార్థులు

- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా పూర్తికాని సిలబస్‌

- కరోనాతో  రెండు సంవత్సరాలు డైరెక్ట్‌ పాస్‌

- విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన కరువు

- మే 11వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

- ఉపాధ్యాయ బదిలీలతోనూ బోధనలో ఇబ్బందులు

- ఇప్పటికే సిలబస్‌ను తగ్గించిన పాఠశాల విద్యాశాఖ


వనపర్తి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కరోనాతో రెండేళ్లు పదో తరగతి విద్యార్థులను డైరెక్ట్‌ పాస్‌ చేయగా.. ఈ ఏడాది కచ్చితంగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిలబస్‌ను కూడా కుదించింది. అయినప్పటికీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అసలే కరోనా కారణంగా అడపాదడపా చదువులు సాగగా మధ్యలో టీచర్ల బదిలీలతో అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ డిప్యుటేషన్ల కోసం, బదిలీల కోసం తిరుగుతున్న టీచర్లే అధికంగా ఉండటంతో కుదించిన సిలబస్‌ కూడా పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా గత రెండు సంవత్సరాలుగా అంటే 8, 9 తరగతుల్లో బోధన లేకుండానే నేరుగా ప్రమోట్‌ అయ్యారు. దీనివల్ల వారిలో సామర్థ్యం తక్కువగా ఉన్నట్లవుతోంది. నేరుగా పదో తరగతి పాఠాలు విని పరీక్షలకు హాజరుకావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిలబస్‌ కుదించామని, పరీక్షలకు విద్యార్థులను పూర్తిస్థాయిలో సంసిద్ధులను చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం మరో 10శాతం సిలబస్‌ మిగిలిందని చెబుతున్నప్పటికీ.. అసలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాఠశాలల్లో సరైన బోధన జరగలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. బదిలీల వల్ల కూడా చాలామంది ఉపాధ్యాయులు తగ్గారు. పలు పాఠశాలల్లో ఇప్పటికీ ఉపాధ్యాయుల కొరత ఉంది. అసలే సెప్టెంబర్‌ 1 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. మధ్యలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో బదిలీల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. 

 పాఠ్యాంశాలపై అవగాహన కరువు 

వాస్తవంగా ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభిస్తారు. మొదటి నెల ఎలా ఉన్నా జులై నుంచి బోధన వేగంగా సాగుతుంది. మిగతా తరగతుల విద్యార్థుల కంటే పదో తరగతి విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌ కూడా నిర్వహిస్తుండడంతో ఆరోజు విన్న పాఠాలు విద్యార్థులకు గుర్తుండిపోయేలా చేస్తారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పీడ కారణంగా విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినగా.. రెండు సంవత్సరాలుగా డైరెక్ట్‌ ప్రమోట్‌ అవుతున్న విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలను ఎదుర్కోబోతున్నారు. సిలబస్‌ తగ్గిపోయినప్పటికీ విద్యార్థుల్లో పరీక్షలపై ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వనపర్తి జిల్లాలో మొత్తం 203 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 54,225 మంది విద్యార్థులు చదువుతుండగా.. పదో తరగతి విద్యార్థులు సుమారు 9వేల మంది వరకు ఉంటారు. ఈనెల రెండో వారం వరకు సిలబస్‌ మొత్తం పూర్తయితే ఏప్రిల్‌లో రివిజన్‌, ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మే 11 నుంచి ప్రారంభం కాబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధంగా ఉంటారు. 

 ఫీజులపై గుబులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సిలబస్‌ పూర్తికావడం కోసం ఎదురుచూస్తుండగా.. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఫీజుల భయం పట్టుకుంది. కరోనా కారణంగా వివిధ ప్రైవేటు పాఠశాలల్లో చాలామంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేదు. కొంతమంది తల్లిదండ్రులు ఫీజుల భయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించగా కొందరు చెల్లిస్తామని చెబుతూ ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసుల డబ్బులను కూడా ఆఫ్‌లైన్‌ క్లాసుల మాదిరిగానే పలు పాఠశాలలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు హాల్‌ టిక్కెట్ల సమయంలో మొత్తం డబ్బులు అడిగితే ఏం చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా కారణంగా చాలామందికి ఉపాధి దూరమైంది. ఈ క్రమంలో ఎలాగూ సెప్టెంబర్‌ నుంచే క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో ఫీజులు తక్కువగా తీసుకోవాలని కోరుతున్నారు. 

సిలబస్‌ పూర్తవుతుంది..

- రవీందర్‌, డీఈఓ, వనపర్తి 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించింది. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కూడా నిర్వ హిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సిలబస్‌ను పూర్తిచేస్తాం. మరో 10శాతం సిలబస్‌ మాత్రమే మిగిలి ఉంది. ఉపా ధ్యాయుల కొరత వల్ల ఏర్పడిన ఇబ్బందులను కూడా అధిగమించడం జరి గింది. మే 11 వార్షిక పరీక్షల వరకు విద్యార్థులు సంసిద్ధులవుతారు. 


Updated Date - 2022-03-04T05:38:27+05:30 IST