హారతికి పదేళ్లు!

ABN , First Publish Date - 2020-11-28T06:48:29+05:30 IST

గోదావరి హారతికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తవుతోంది.

హారతికి పదేళ్లు!

  • రేపు గోదావరి పదేళ్ల హారతి
  • ఉజ్జయిని అఘోరపీఠం ఉప ప్రముఖ్‌ రాజేష్‌నాథ్‌ అఘోర రాక


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి హారతికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తవుతోంది. గోదావరి పున్నమి హారతి మొదలైన ఈ హారతి ఇవాళ నిత్యహారతిగా వర్థిల్లుతోంది. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరఘాట్‌లో భక్తిశ్రద్థలతో సంప్రదాయ రీతిలో హారతి ఇచ్చే క్రతువును బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్టు ప్రారంభించింది. మొదట ప్రతి పౌర్ణమిరోజున పున్నమి హారతి పేరిట ఈ హారతి ఇచ్చేవారు. 2015 పుష్కరాల నాటి నుంచి ఇది నిత్యహారతిగా మారింది. గోదావరిలో పంటు మీద పండితుల వేద ఘోష మధ్య గోదావరికి ఈ హారతి ఇవ్వడం ఆన వాయితీగా మారింది. వారణాసిలో గంగానదికి ఇస్తున్న పద్ధతిలోనే ఇక్కడ కూడా ఈ హారతి ఇస్తున్నారు. 2010లో కార్తీక పౌర్ణమి నాడు బుద్దవరపు ఛారిటబుల్‌ ట్రస్టు ఈ హారతి ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రధాన నదులకు హారతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ ఈ ట్రస్టు ఆధ్వర్యాన హారతి మొదలైంది. అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ బుద్ధవరపు వెంకట్రావు సంకల్పంతో ఆయన కుమారుడు కుమార్‌ ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆధ్మాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల కోసం ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు కుమార్‌ తెలిపారు. వైఎస్సార్‌ జలయజ్ఞం, గంగానది హారతి స్ఫూర్తితో కార్తీక పున్నమి హారతి ప్రారంభమైందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య హారతి లోగోను ఆవిష్కరించారు. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అప్పటి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఈ హారతిని ప్రారంభించారు. 2015 పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హారతి గురించి తెలుసుకుని సంతోషించి నిత్యహారతిగా మార్చారు. ఆయన స్వయంగా పాల్గొన్నారు. కరోనా వల్ల కొద్దిరోజులు ఆపి నప్పటికీ మళ్లీ మొదలైంది. హారతి చూడడానికి రోజూ ఎంతోమంది వస్తుండడం విశేషం.


  • హారతి ఉత్సవం నిర్వహిస్తాం: కుమార్‌


ఆదివారం రాత్రి పదేళ్ల గోదావరి హారతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు బుద్ధవరపు ట్రస్టు చైర్మన్‌ కుమార్‌ తెలిపారు. దీనికి మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని అఘోర ఉప ప్రముఖ్‌ రాజేష్‌నాథ్‌ అఘోర మహారాజు వస్తున్నట్టు చెప్పారు. పదేళ్ల సందర్భంగా ఆదివారం నిత్యహారతి నృత్యం నిర్వహించనున్నట్టు తెలిపారు. పదేళ్ల మెమోంటోలు ఇస్తామన్నారు. భక్తులంతా వచ్చి ఈ హారతి తిలకించాలని కోరారు. 

Updated Date - 2020-11-28T06:48:29+05:30 IST