పదేళ్లు దాటినా నిర్మాణాలు శూన్యం

ABN , First Publish Date - 2022-01-17T06:33:59+05:30 IST

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరుతో ప్రస్తుతం భారీగా ప్రచారం జరుగుతోంది. మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు మార్కెట్‌ రేటు కంటే తక్కువకు ఇంటి స్థలం ఇవ్వాలనేది లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.

పదేళ్లు దాటినా నిర్మాణాలు శూన్యం

టౌన్‌షిష్‌లో ప్లాట్లు కొని ఏం చేస్తారు?

ప్రజలకు పెట్టుబడి.. ప్రభుత్వానికి వ్యాపారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల పేరుతో ప్రస్తుతం భారీగా ప్రచారం జరుగుతోంది. మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు మార్కెట్‌ రేటు కంటే తక్కువకు ఇంటి స్థలం ఇవ్వాలనేది లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కానీ జిల్లాలో ఇప్పటివరకు అటు వుడా (వీఎంఆర్‌డీఏ) గానీ, ఇటు ప్రైవేటు డెవలపర్లు గానీ వేసిన లేఅవుట్లలో దశాబ్దాల తరువాతే నిర్మాణాలు మొదలవుతున్నాయి. మొదటి 10-15 ఏళ్లు అక్కడ మనుషుల సంచారమే వుండడం లేదు. ఆ తరువాత అక్కడి వాతావరణం, రవాణా సౌకర్యం, ఇతర అంశాల ఆధారంగా నివాసాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని వెళ్లిపోవచ్చు అని అనుకుంటే భ్రమ పడినట్టే. అది అంత సులువైన విషయం కాదు.


ఓజోన్‌వేలీలో నిర్మాణాలు శూన్యం

సాధారణంగా వుడా (వీఎంఆర్‌డీఏ) లేఅవుట్‌ అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎటువంటి వివాదాలు వుండవనే విశ్వాసం ఉంది. అలాంటి వుడా జాతీయ రహదారిని ఆనుకొని పరదేశిపాలెంలో వంద ఎకరాల్లో ఓజోన్‌ వేలీ పేరుతో 2011లో లేఅవుట్‌ వేసింది. దశాబ్దం గడిచింది. ఈ ప్రాంతం నగరానికి చాలా దగ్గరగా ఉంది. అయినా ఇప్పటికీ అక్కడ ప్లాట్లు కొన్నవారు నిర్మాణాలు చేపట్టలేదు. ఒకటి, రెండు కాకుండా ఏకంగా అక్కడ 609 ప్లాట్లు వేశారు. ఓ పది మంది చిన్న తరహా పరిశ్రమల్లాంటివి పెట్టుకున్నారు. నివాసాలైతే లేవు.


సైబర్‌ వేలీ కూడా అంతే...

మధురవాడలో 15.67 ఎకరాల్లో వీఎంఆర్‌డీఏనే సైబర్‌వేలీ పేరుతో 2011లో మరో లేఅవుట్‌ వేసింది. అందులో 148 ప్లాట్లు విక్రయించింది. ఇదీ రుషికొండ ఐటీ లేఅవుట్‌కు దగ్గరగా ఉంటుంది. సైబర్‌వేలీలో కూడా ఒకటి అరా తప్పితే ఎవరూ గృహాలు నిర్మించుకోలేదు. అక్కడ గజం రూ.35 వేల నుంచి 40 వేల ధర పలుకుతోంది. 


దాకమర్రి ఫార్చ్యూన్‌ హిల్స్‌ అందనంత దూరం

దాదాపు విజయనగరానికి సమీపాన దాకమర్రిలో ఒక ప్రైవేటు సంస్థతో కలిసి వుడా జాయింట్‌ వెంచర్‌ కింద 99 ఎకరాల్లో ఫార్చ్యూన్‌ హిల్స్‌ పేరుతో 2013లో లేఅవుట్‌ వేసింది. అందులో 1,160 ప్లాట్లు ఉన్నాయి. హెచ్‌ఐజీ, ఎంఐజీల ప్లాట్లను వేలం ద్వారా అమ్ముకుంది. గజం అప్పట్లో రూ.3 వేలు ఉంటే...కొందరు రూ.11 వేలు చొప్పున కొన్నారు. ఎనిమిదేళ్లు అయింది. చక్కటి రోడ్లు, పార్కులు కూడా ఏర్పాటుచేశారు. ఒక్క నిర్మాణం మొదలు కాలేదు. అందులో ఎల్‌ఐజీలు, ఈడబ్ల్యుఎస్‌ ప్లాట్లు తక్కువకు ఇస్తామని అప్పటి ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. ఆ రేటు తేలక ఇప్పటికీ వాటిని అమ్మలేదు. అలాగే ఉన్నాయి. 


ఎక్కడ లేఅవుట్‌ అయినా అది పెట్టుబడికే 

లేఅవుట్‌ నగరానికి దగ్గరగా ఉన్నా, దూరంగా వున్నా పదేళ్ల వరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగవు. అది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు ఆనందపురం మండలం రామవరం, గంగసాని అగ్రహారం, పాలవలస గ్రామాల పరిధిలోని ప్రభుత్వం లేఅవుట్లు (జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌) వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రైతుల నుంచి 365 ఎకరాలను సమీకరించబోతున్నది. ఇందులో 306 ఎకరాలు డి.పట్టా ల్యాండ్‌. మరో 17.48 ఎకరాలు ప్రభుత్వ భూమే అయినప్పటికీ ఆక్రమణలో ఉంది. మిగిలిన 39.45 ఎకరాలు అభ్యంతరాలు కలిగిన ప్రభుత్వ భూములుగా అధికారులు చెబుతున్నారు. డి.పట్టా భూములకు ఎకరాకు 900 గజాలు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. రైతుల అధీనంలో వున్న భూములకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఏ మేరకు ఇస్తారనేది అధికారులు చెప్పడం లేదు. ఈ నెల 24వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే డి.పట్టా భూములు కొంతమేర చేతులు మారిపోవడంతో.. .కొనుగోలు చేసిన వ్యక్తుల ప్రోద్బలంతో రైతులు అభ్యంతరం లేవనెత్తుతారనే చెబుతారనే ప్రచారం జరుగుతోంది. ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆదాయం సమకూర్చుకునేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తోంది. అందులో ఇది కూడా ఒకటి. 

Updated Date - 2022-01-17T06:33:59+05:30 IST