ఆ కొండను భుజాలపై మోస్తా!

ABN , First Publish Date - 2021-10-17T05:36:18+05:30 IST

ఒకరోజు తెనాలి రామకృష్ణ తన భార్యతో కలిసి హంపికి వెళుతున్నాడు. దారిలో ఒక కొండపక్కన ఉన్న గ్రామంలో విశ్రాంతి కోసం ఆగాడు. కాసేపటికే గ్రామంలోని ప్రజలందరూ ఆలయం వైపు పరుగులు తీయడం చూశాడు..

ఆ కొండను భుజాలపై మోస్తా!

ఒకరోజు తెనాలి రామకృష్ణ తన భార్యతో కలిసి హంపికి వెళుతున్నాడు. దారిలో ఒక కొండపక్కన ఉన్న గ్రామంలో విశ్రాంతి కోసం ఆగాడు. కాసేపటికే గ్రామంలోని ప్రజలందరూ ఆలయం వైపు పరుగులు తీయడం చూశాడు. విషయం ఏంటో తెలుసుకుందామని వీళ్లు కూడా అక్కడకు వెళ్లారు. మధ్యలో ఒక వెయిట్‌లిఫ్టర్‌ నిలుచుని ఉన్నాడు. చుట్టూ ప్రజలు కేరింతలు కొడుతున్నారు. అతని చేతులపై కొందరు గన్నీ బ్యాగును తెచ్చి పెట్టారు. అది చూసి అందరూ చప్పట్లు కొట్టారు. ‘‘అతడు చాలా బలవంతుడు. ఐదువందల కిలోల సంచీని సులువుగా మోస్తున్నాడు’’ అని అక్కడే ఉన్న ఒక వ్యక్తి అన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ బిగ్గరగా ‘‘నేను దానికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బరువు మోస్తాను’’ అని అన్నాడు. ఆ మాటలు విన్న వెయిట్‌లిఫ్టర్‌ సంచీ కింద పడేశాడు. అందరూ ఆశ్చర్యంగా రామకృష్ణ చుట్టూ చేరిపోయారు. అప్పుడు మరింత ఉత్సాహంతో ‘‘మీరు విన్నది నిజమే! నేను ఆ కొండను సైతం నా భుజాలపై మోయగలను’’ అన్నాడు రామకృష్ణ. ‘‘అయితే వెంటనే చేసి చూపించు’’ అన్నాడు వెయిట్‌లిఫ్టర్‌. అప్పుడు రామకృష్ణ ‘‘ఆ సంచీని ఎత్తడానికి నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్‌ చేశావు’’ అని అడిగాడు. ‘‘మూడు నెలలు’’ అన్నాడు అతను. ‘‘ఆ కొండను నా భుజాలపై మోయాలంటే నాకు కనీసం ఆరు నెలలు శిక్షణ కావాలి. మంచి ఆహారం తినాలి. రోజూ శరీరానికి మసాజ్‌ కావాలి’’ అన్నాడు రామకృష్ణ. ఆ మాటలు విన్న గ్రామపెద్ద అవన్నీ సమకూర్చడానికి ఒప్పుకున్నాడు. ఒక మంచి ఇల్లు చూపించి అవసరమైనవన్నీ సమకూర్చారు. రోజూ మంచి ఆహారం, పాలు, ఒంటికి మసాజ్‌తో ఆరునెలలు గడిచాయి. చివరగా ఆ రోజు రానే వచ్చింది. తెనాలి రామకృష్ణ ఉత్సాహంగా బయలు దేరాడు. గ్రామస్తులంతా వచ్చేశారు. వెంటనే రామకృష్ణ ‘‘నేను సిద్ధం’’ అన్నాడు. అయితే మొదలు పెట్టండి అన్నాడు గ్రామపెద్ద. ‘‘మీదే ఆలస్యం’’ అన్నాడు రామకృష్ణ. గ్రామ పెద్దకు ఆర్థం కాలేదు. మేం ఏం చేయాలి? అడిగాడు కుతూహలంగా. ‘‘ఎవరైనా తెచ్చి కొండను నా భుజాలపై పెట్టండి. నేను మోస్తాను’’ అని అన్నాడు రామకృష్ణ. దాంతో గ్రామపెద్దకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నువ్వు ఏమనుకుంటున్నావ్‌’’ అన్నాడు కోపంగా. అప్పుడు రామకృష్ణ ‘‘నేను కొండను భుజాలపై మోస్తాను అని మాత్రమే చెప్పాను. ఎవరైనా తెచ్చి నా భుజాలపై పెడితే నేను మోస్తాను. అప్పుడు అదే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను’’ అన్నాడు. ‘‘మరి కొండ ఎవరు ఎత్తుతారు?’’ అని అడిగాడు గ్రామపెద్ద. ‘‘అది మీరు నిర్ణయించాలి’’ అన్నాడు రామకృష్ణ. కాసేపయ్యాక గ్రామపెద్దతో పాటు గ్రామస్తులందరూ తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకున్నారు.

Updated Date - 2021-10-17T05:36:18+05:30 IST