కేశఖండనశాలలో ఘర్షణ

ABN , First Publish Date - 2022-01-17T05:00:50+05:30 IST

వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఇద్దరు క్షురకుల మధ్య ఆదివారం జరిగిన చిన్న వివాదం పెద్దదై కత్తితో దాడి వరకు దారితీసింది.

కేశఖండనశాలలో ఘర్షణ
వైకుంఠపురంలో రక్తం చిందిన కేశ ఖండనశాల

కత్తితో తోటి క్షురకుడిపై దాడి 

తెనాలిటౌన్‌, జనవరి16: వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఇద్దరు క్షురకుల మధ్య ఆదివారం జరిగిన చిన్న వివాదం పెద్దదై కత్తితో దాడి వరకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. కేశ ఖండనశాలలో కురుగంటి ప్రేమ్‌కుమార్‌, కురుగంటి రామస్వామి  క్షురకులుగా పనిచేస్తున్నారు. భక్తులు ఇచ్చిన రెండు టిక్కెట్లు ఒక్కరే తీసుకోవడం, దానితో రెండవ వ్యక్తి ప్రశ్నించడంతో వివాదం మొదలై తోపులాటకు దారితీసింది. దీనితో కిందపడిన రామస్వామి కోపోద్రిక్తుడై చేతిలో ఉన్న కత్తితో ప్రేమ్‌కుమార్‌ పొట్టపై గీసే సరికి తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. వన్‌టౌన్‌ పరిధిలో జరిగిన ఈ వివాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఆలయంలో జరుగుతున్న పలు అసాంఘిక కార్యక్రమాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో మందు సీసాలు కోకొల్లలు కనిపిస్తాయి. అర్చకుల అక్రమాల లీలలు షరా మామూలే. కేశఖండన శాలలో నిత్యం వివాదాలు జరుగుతూనే ఉంటాయి. గతంలోనూ కేశ ఖండనశాలలో ఒక వ్యక్తి, టెంట్‌ హౌస్‌కు చెందిన వ్యక్తి తీవ్రంగా కొట్టుకుని గాయాలయ్యారు. ఆదివారం కేశఖండన శాలలో జరిగిన ఘటనపై.. ఓ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి మాట్లాడుతూ ఆలయంలో జరిగే సంఘటనలన్నింటినీ ఎక్కడ పట్టించుకుంటాం...  కాపలా ఎక్కడ కాస్తామని అన్నారు. గత  13వ తేదీన నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవం రోజున ఆలయ అధికారులు  వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. డివిజన్‌ స్థాయి పోలీస్‌ అధికారి స్వామి దర్శనం కోసం వచ్చి అరగంట పాటు వీఐపీ గేటు ముందు నిలబడితే గేటు తాళాలు తియ్యకుండా అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇకనైనా ఆలయ ధర్మకర్తల మండలి వారైనా కనీసం ఆలయ పవిత్రతను కాపాడే విధంగా చక్క దిద్దాలని భక్తులు కోరుతున్నారు. 

 

Updated Date - 2022-01-17T05:00:50+05:30 IST