Abn logo
Jul 24 2021 @ 01:13AM

ప్రహసనంగా ఆలయాల చెరువుల వేలం

అధికారులతో పాటదారుల వాగ్వాదం

 లోపాయికారీ ఒప్పందాలతో లీజు ఖరారు 

 పాటదారులు, గ్రామస్థుల నిరసన 

 దేవదాయ శాఖ ఆదాయానికి గండి

నందివాడ రూరల్‌(గుడివాడ), జూలై 23:  దేవదాయ శాఖకు చెందిన భీమేశ్వరస్వామి ఆలయం, శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, తమిరిశ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీధర్మచెరువు సత్రానికి చెందిన  మొత్తం 43.13 ఎకరాల చేపలచెరువుల లీజు వేలం ప్రక్రియ శుక్రవారం  రసాభసాగా సాగింది. 30 ఎకరాల చెరువును దక్కించుకు నేందుకు పాటదారులు భారీగానే పోటీపడ్డారు. ఇంతలో కొంత కొందరు రంగప్రవేశం చేసి పాత లీజుదారుడికే గతం కంటే కొంత పెంచే విధంగా లీజు ఖరారు చేసి మమ అనిపించారు. ఈ మాత్రానికి పత్రికల్లో ప్రకటనలు, ప్రచారాలెందుకని అధికారులను ప్రశ్నించారు. 

 తమిరిశ సర్వే నెం. 799 పరిధిలో 7.15 ఎకరాలు, సర్వేనెం. 847లోని 6.70 ఎకరాలు, సర్వేనెం. 113లోని 7.80 ఎకరాలు, సర్వేనెం. 288 లోని 5.68 ఎకరాలు, సర్వే నెం. 802లోని 15.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు శుక్రవారం వేలం నిర్వహిస్తామని దేవదాయ శాఖ అధికారులు ప్రకటనలు ఇచ్చారు. చివరికి పాటదారుల అభ్యంతరాలతో చెరువుల లీజు వేలం తొలుత వాయిదావేశారు. తిరిగి గంటలో  ఏం మంత్రం వేశారో తెలియదు కానీ పాత లీజుదారుడికే చెరువులు మూడేళ్ల కాలానికి లీజుకు ఇచ్చే విధంగా పాట ఖరారు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.  ఆలయానికి ఉన్న చేపలచెరువుల లీజుల వేలం ప్రక్రియ దేవదాయ చట్టం ప్రకారం మూడేళ్లకు ఒక మారు నిర్వహించాల్సి ఉంది. శ్రీధర్మచెరువు సత్రం భూముల్లోని  సర్వే నెం. 802లోని 15.80 ఎకరాల చెరువుకు మరో రెండేళ్లు ఆగి వేలం నిర్వహిస్తామని అధికారులు మెలిక పెట్టడంతో పాటదారులు అభ్యంతర పెట్టారు. గతంలోనే దీనిపై ఒప్పందం ఉందని అధికారులు చెప్పగా గ్రామస్థులు, పాటదారులు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయానికి అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని అధికారులే కొంత మందితో కుమ్మక్కై నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థానం చేపల చెరువులకు వెళ్లే దారి ఈ 15.80 ఎకరాల నుంచే ఉండటం సమస్యకు కారణమైంది. రెండేళ్లు సమయం ఉండగా వేలంలో ఎందుకు ప్రకటించారో చెప్పాలని పాటదారులు పట్టుబట్టారు. బడాబాబులకు నామమాత్రపు లీజుకు కట్టబెట్టి బేరాలు కుదుర్చుకోవడానికి  అధికారులు మూడేళ్లకు ఒక మారు లీజుల వేలం పేరిట ప్రహసనం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవదాయ శాఖ అధికారి,  శ్రీ ధర్మసత్రం మేనేజరు చలసాని శేషగిరిరావు వేలం పాట నిర్వహించారు.