3 చెక్కులతో 117 కోట్లకు టెండర్‌

ABN , First Publish Date - 2020-09-21T08:22:51+05:30 IST

నకిలీ చెక్‌లతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.117కోట్లు స్వాహా చేసేందుకు ఓ ముఠా విఫల యత్నం చేసింది.

3 చెక్కులతో 117 కోట్లకు టెండర్‌

నకిలీ చెక్‌లతో కొల్లగొట్టేందుకు యత్నం 

ప్రధాన నగరాల్లోని బ్యాంకుల్లో డిపాజిట్‌ 

అధికారుల అప్రమత్తతతో వెలుగులోకి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

నకిలీ చెక్‌లతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.117కోట్లు స్వాహా చేసేందుకు ఓ ముఠా విఫల యత్నం చేసింది. కేవలం రూ.1.06లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు చెక్కులతో ఇంత పెద్దమొత్తం కొట్టేసేందుకు ప్రణాళిక వేసింది. చెక్కులు ఆమోదించే సమయంలో బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండటంతో ఈ కుట్ర బట్టబయలైంది. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా జరగని ఈ కొత్త రకం మోసంపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


అనారోగ్యం, ఇతర సమస్యలతో సతమతమయ్యే పేదలకు ప్రజాప్రతినిధుల సిఫారసులతో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ఆర్థికసాయం అందిస్తుంది. దీనిలో భాగంగా గతేడాది నవంబరు 8న కొల్లి రత్తయ్యకు రూ.16వేలు, ఈ ఏడాది జూన్‌ 29న కొణతం హైమావతి, పాతూరి రమ్యశ్రీలకు రూ.45వేలు చొప్పున చెక్కుల రూపంలో ఇచ్చింది. ఈ మూడు చెక్కులు గుంటూరు జిల్లా వెలగపూడి ఎస్‌బీఐ అకౌంట్‌కు సంబంధించినవి.


ఇదిలాఉండగా, ఈ నెల 9న మంగళూరు(కర్ణాటక)లోని మోదుగురి ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.52.65కోట్లు, 7న ఢిల్లీలోని ఎస్‌బీఐ సీసీపీసీ-1 బ్రాంచిలో రూ.39.86కోట్లు, 14న కోల్‌కతాలోని మెగ్రాహట్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.24.65 కోట్ల విలువైన చెక్‌లు డ్రా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నాలు చేశారు. అయితే వాటిపై పెద్ద మొత్తం ఉండటంతో నిర్ధారణ కోసం ఆయా బ్యాంకుల అధికారులు వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను వాకబు చేశారు. అంత మొత్తం తాము జారీ చేయలేదని ఇక్కడి అధికారులు చెప్పడంతో వాటికి చెల్లింపులను ఆపేశారు.


ఆరా తీసిన అధికారులు ఆ చెక్‌లు నకిలీవని తేలడంతో విజయవాడలోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచికి సమాచారం అందజేశారు. బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూశాఖ అడిషనల్‌ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఈ వ్యవహారంపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్కులతో పాటు అందులో సంతకం, స్టాంప్‌ కూడా నకిలీదేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు చెక్కులు డిపాజిట్‌ చేసిన మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. 


ఆ మొత్తం డ్రా చేశారా? 

ప్రభుత్వం కేవలం వేల రూపాయల్లో జారీ చేసిన చెక్కులను లబ్ధిదారులు డ్రా చేసుకున్నారా, లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. లబ్ధిదారులు ఇన్ని రోజులుగా వాటిని తమ అకౌంట్లలో డిపాజిట్‌ చేయకుండా ఉన్నారా అనే అంశాన్ని ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చెప్పలేదు.

ఆదివారం కావడంతో బ్యాంకులూ దీనిపై నోరు మెదపడం లేదు. అయితే  కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఆ ముగ్గురి వివరాలు సేకరించి కొంతమేర సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. 


Updated Date - 2020-09-21T08:22:51+05:30 IST