స్వామి సొమ్ముకు టెండర్‌

ABN , First Publish Date - 2021-06-21T05:54:07+05:30 IST

ఎక్కడైనా చేయాల్సిన పనులకు టెండర్లు పిలుస్తారు.

స్వామి సొమ్ముకు టెండర్‌
కౌతాళం మండలం ఉరుకుంద క్షేత్రంలో గతంలో నిర్మించిన సీసీ రోడ్డు

  1. పూర్తి అయిన పనులు చేయిస్తారట 
  2. ఉరుకుంద క్షేత్రంలో అధికారుల చోద్యం


కౌతాళం/ఎమ్మిగనూరు, జూన్‌ 20: ఎక్కడైనా చేయాల్సిన పనులకు టెండర్లు పిలుస్తారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లకు పనులు కేటాయిస్తారు. ఆ పనులను పూర్తి చేయించేందుకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తారు. కానీ ఎక్కడైనా పూర్తి చేసిన పనులకు టెండర్లు పిలవడం విన్నారా..? కన్నారా..? ఇదెలా సాధ్యం అనుకోకండి..! ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుందలో ఇలాంటి టెండరునే దేవదాయశాఖ అధికారులు పిలిచారు. విస్మయం కలిగించే ఈ వ్యవహారం వెనుక మతలబు ఏమిటో అని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఏమిటి ఆ టెండర్‌..?


కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో వివిధ పనులకు ఈ ఏడాది మార్చి 24న దేవస్థానం అధికారులు టెండరును ఆహ్వానించారు. ఓ ప్రముఖ దినపత్రికలో ఈ మేరకు ప్రకటన ఇచ్చారు. ఉరుకుందలో ఉన్న కలెక్టర్‌ గెస్ట్‌హౌస్‌ విస్తరణలో భాగంగా మొదటి అంతస్తు నిర్మాణం, గుడివెనుక ఉన్న ప్రధాన రహదారి నుంచి భక్తుల గదుల సముదాయానికి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.28 లక్షలు, గుడి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు కోసం రూ.8 లక్షలకు టెండర్లను ఆహ్వానించారు. 


మూడేళ్ల క్రితమే నిర్మించారు..


అధికారులు టెండర్లు పిలిచిన నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయి. మూడేళ్ల క్రితమే ఈ పనులను ఆలయ అధికారులు పూర్తిచేశారని భక్తులు అంటున్నారు. ఈ పనులకు రూ.లక్షల్లో సొమ్ము వెచ్చించారు. ఫెన్సింగ్‌ పనులను మాత్రం ఇటీవలే పూర్తిచేశారు. అవే పనులకు తిరిగి టెండర్లు పిలిచారు. భక్తుల సొమ్మును పక్కదారి పట్టించేందుకే ఇలా టెండర్లు పిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భక్తులు అంటున్నారు. 


ఆరోపణలు అవాస్తవం..


టెండర్లు పిలిచిన పనులు ప్రాసెస్‌లో ఉన్నాయి. టెండర్‌ వేసిన తరువాతే పనులు ప్రారంభించాం. ఆరోపణలు అవాస్తవాలు. 

- వాణి, ఈఓ, ఏసీ, ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం

Updated Date - 2021-06-21T05:54:07+05:30 IST