కరోనా దెబ్బకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు బ్రేకులు

ABN , First Publish Date - 2020-05-10T10:44:14+05:30 IST

జిల్లాలో మానేరు, హుస్సేనిమియా వాగులపై నిర్మించ తలపెట్టిన చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి కరోనా దెబ్బపడింది. జూన్‌,

కరోనా దెబ్బకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు బ్రేకులు

రూ. 395.78 కోట్లతో 23 చెక్‌డ్యామ్‌లు

ఫిబ్రవరిలోనే పూర్తయిన టెండర్లు

వర్షాకాలం ముగిసిన తర్వాతే పనులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లాలో మానేరు, హుస్సేనిమియా వాగులపై నిర్మించ తలపెట్టిన చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి కరోనా దెబ్బపడింది. జూన్‌, జూలై నెలాఖరు వరకు చెక్‌డ్యామ్‌లను పూర్తిచేసి వర్షాకాలంలో కురిసే నీటిని వృథా పోనియకుండా సద్వినియోగం చేసుకుని పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం భావించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేకపోయారు.


మానేరు నదిపై 14, హుస్సేనిమియా వాగుపై 5, మరికొన్ని వాగులపై 4 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకై 395 కోట్ల 78 లక్షల రూపాయలతో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతి ఏటా మానేరు, హుస్సేనిమియా వాగుల గుండా వర్షాకాలంలో వరద నీరంతా గోదావరిలో వృఽథాగా కలుస్తున్నది. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు చోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించి ఆ నీటిని పంట పొలాలకు తరలించినట్లయితే పంటలు సాగుకావడమే కాకుండా భూగర్భజలాలు అడుగంటిపోకుండా ఉంటాయని ప్రభుత్వం భావించింది.


ఏడాదిన్నర క్రితం నుంచే చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తికావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ డిసెంబర్‌లో మిడ్‌మానేరును సందర్శించిన సందర్భంగా చెక్‌డ్యామ్‌లను చేపడతామని ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పనుల నిర్వహణకు టెండర్లు పూర్తిచేసి జూన్‌, జూలై నెలాఖరు వరకల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. 


జిల్లాలో 23 చెక్‌డ్యామ్‌లు..

ఆ మేరకు జిల్లా పరిధిలో మానేరు వాగుపై ఓదెల మండలం పొత్కపల్లి వద్ద 22.20 కోట్లతో, కనగర్తి వద్ద 25.37 కోట్లు, ఇందుర్తి వద్ద 25.06, గుంపుల వద్ద 25.16 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట వద్ద 26.18 కోట్లు, పెదరాతుపల్లి వద్ద 12.84 కోట్లు, సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల వద్ద 20.11, గొల్లపల్లి వద్ద 20.90 కోట్లు, నీరుకుల్ల వద్ద మరొకటి 19.81 కోట్లు, నీరుకుల్ల వద్ద 22.50 కోట్లు, మంథని మండలం గోపాల్‌పూర్‌ వద్ద 17.03 కోట్లు, ముత్తారం మండలం ఓడెడు వద్ద 23.11 కోట్లు, అడవిశ్రీరాంపూర్‌ వద్ద 14.06, ఖమ్మంపల్లి వద్ద 20 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు.


బొక్కల వాగుపై మంథని వద్ద 6.38 కోట్లు, హుస్సేనిమియా వాగుపై పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద 3.81 కోట్లు, కాల్వశ్రీరాంపూర్‌ మండలం కాల్వశ్రీరాంపూర్‌ వద్ద 8.74 కోట్లు, మంగపేట్‌ వద్ద 8.88 కోట్లు, పెద్ద రాతుపల్లి వద్ద 9.04 కోట్లు, చిన్నరాతుపల్లి వద్ద  9.25 కోట్లు, నక్కవాగుపై మల్యాల వద్ద 8.27 కోట్లు, పాలకుర్తి మండలం బండల వాగుపై 25 లక్షలతో పూట్నూర్‌ వద్ద 22 లక్షలతో, తుమ్మల వాగుపై 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెక్‌ డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. 


ఈ చెక్‌ డ్యామ్‌లతో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, మంథని, మంథని ముత్తారం, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాలకు సాగు నీరు అందించనున్నారు. ఈ పనులకు టెండర్లు ఫిబ్రవరి నెలలోనే టెండర్లు పూర్తికాగా మార్చిలో పనులను చేపట్టాలని కాంట్రాక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకోగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందడం, మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో పనులను చేపట్టలేదు. నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఈ ఏడాది రుతు పవనాలు ముందస్తుగానే వచ్చి మేనెల చివరివారంలోనే వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని పనులను చేపట్టలేదు.


కరోనా వ్యాప్తి చెందకుండా ఉండి ఉంటే చెక్‌డ్యామ్‌లు పూర్తయి గోదావరి నదితో పాటు మనేరు నది, హుస్సేనిమియా వాగులు జలకళను సంతరించుకుని ఉండేవి. అప్పటివరకు రైతులు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖాధికారులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-05-10T10:44:14+05:30 IST