ఆర్టీసీ ఆదాయానికి ‘టెండర్‌’!

ABN , First Publish Date - 2022-01-18T06:26:06+05:30 IST

పీఎన్‌బీఎస్‌లో రెండు క్యాంటీన్లకు టెండర్లు పిలిచి, ఏదో సాకుతో రద్దు చేశారు..

ఆర్టీసీ ఆదాయానికి ‘టెండర్‌’!

పీఎన్‌బీఎస్‌లో క్యాంటీన్లకు టెండర్లు పిలిచి, రద్దు చేసిన అధికారులు

గైడ్‌ లైన్స్‌ మార్పు పేరుతో ఎనిమిది నెలలుగా సాచివేత

ఇప్పటి వరకు సంస్థకు రూ.3.20 కోట్ల నష్టం 

తెరవెనుక ఓ మంత్రి మంత్రాంగం!

నామినేషన్‌ పద్ధతిలో అయినవారికి కట్టబెట్టేందుకే! 


పీఎన్‌బీఎస్‌లో రెండు క్యాంటీన్లకు టెండర్లు పిలిచి, ఏదో సాకుతో రద్దు చేశారు.. ఆ తరువాత మళ్లీ టెండర్లు పిలిచే ప్రయత్నమే చేయలేదు. ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంచేయడంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌కు రూ.3.20 కోట్ల మేర నష్టం వాటిల్లగా.. ప్రయాణికులకు క్యాంటీన్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఎందుకిలా చేస్తున్నారనే ప్రశ్నకు అధికారులు పైకి కారణాలేవో చెబుతున్నప్పటికీ, వాస్తవం మాత్రం తనకు చెప్పకుండా ఈ రెండు క్యాంటీన్లకు టెండర్లు పిలవొద్దని ఓ మంత్రివర్యుని కార్యాలయం నుంచి ఆదేశాలు రావడమేనని తెలుస్తోంది. ఇంతకూ మంత్రి కార్యాలయం ఆదేశాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్‌ స్టేషన్‌ పీఎన్‌బీఎస్‌ దశాబ్దంన్నర కాలంగా కమర్షియల్‌ స్టేషన్‌గా మారిపోయింది. కరోనాకు ముందు పీఎన్‌బీఎస్‌లో స్టాల్‌ దక్కించుకోవడానికి గట్టి పోటీ ఉండేది. ఆర్టీసీ రికార్డు స్థాయిలో అద్దెలు వసూలు చేసేది. వ్యాపారులు కూడా అంతకు అంత లాభాలు గడించేవారు. కరోనా అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. బస్‌స్టేషన్‌లో ఆశించినంతగా వ్యాపారాలు లేవు. దీంతో ఇక్కడ అద్దెలను భరించలేక వ్యాపారులు దూకాణాలను మూసివేస్తున్నారు. ఇటీవల దాదాపు 60కి పైగా స్టాల్స్‌ మూతపడ్డాయి. వాటికి టెండర్లు పిలుస్తున్నా, ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కమర్షియల్‌ ఆదాయాన్ని నిలబెట్టుకునేందుకు ఆర్టీసీ ఒక మెట్టు తగ్గాలనే ఆలోచన చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించే యోచనలో ఉన్న సమయంలోనే హడావిడిగా పీఎన్‌బీఎస్‌లోని డిపార్చర్‌, అరైవల్‌ బ్లాక్‌ లలోని రెండు క్యాంటీన్లకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లకు మంచి స్పంద నే వచ్చింది. ఓ పెద్ద కాంట్రాక్టర్‌ రెండు స్టాల్స్‌కు కలిపీ జీఎస్‌టీ ఇతర ట్యాక్‌ ్సలు, ఫీజులు కలిపి రూ.40 లక్షల మేర టెండర్‌ కోట్‌ చేశారు. ఇవే క్యాంటీన్లలో డిపార్చర్‌ బ్లాక్‌కు మరో కాంట్రాక్టర్‌ రూ.19 లక్షలు కోట్‌ చేశాడు. వాస్తవానికి బడా కాంట్రాక్టర్‌ దీనికి రూ.25 లక్షలు కోట్‌ చేశాడు. ఈ టెండర ్లను ఖరారు  చేయాల్సిన ‘ఆర్టీసీ’ అనూహ్యంగా రద్దు చేసింది. ఎక్కువ కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ ఫైనాన్షియల్‌ స్టేటస్‌ కొంతకాలంగా సరిగా లేదనే కారణాన్ని చూపి రద్దు చేసినట్టు తెలుస్తోంది. బరిలో నిలిచిన కాంట్రాక్టు సంస్థలు, ఔత్సాహిక సంస్థలు మాత్రం ఇలాంటి నిబంధనలను కొత్తగా చూస్తున్నామని వాపోతున్నాయి. పోనీ ఇదే కారణంతోనే టెండర్లను రద్దు చేయాల్సి వచ్చిందనుకున్నా.. నెలలోగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం రీ టెండర్లు పిలవాలి. కానీ దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా.. పిలవలేదు. దీంతో టెండర్‌ విలువ ప్రకారం చూసినా.. నెలకు రూ.40 లక్షల చొప్పున ఎనిమిది నెలల కాలానికి అక్షరాలా రూ.3.20 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. సంస్థలో రూపాయి అనవసర వ్యయాన్ని కూడా సహించని ఉన్నతాధికారులు సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వస్తున్నా మాట్లాడకపోవడానికి కారణం మంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఒత్తిడేనని తెలుస్తోంది. తమకు తెలియకుండా ఆ రెండు క్యాంటీన్లకు టెండర్లు పిలవొద్దని మంత్రి కార్యాలయం నుంచి, సీఎంవోలోని ఓ వ్యక్తి నుంచి ఆదేశాలు రావటంతో అధికారులు మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


ఆర్టీసీకి నష్టం.. ప్రయాణికులకు కష్టం

ఈ వ్యవహారం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయన్నది పక్కన పెడితే.. ఆర్టీసీ ఆదాయానికి మాత్రం రూ.కోట్లలో గండి పడుతోంది. అంతకు మించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ప్రయాణికులు ఫుడ్‌ కోసం హైవే దాటి బయటకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లి వచ్చేలోపు తాము ఎక్కవలసిన బస్సు వెళ్లిపోతుందేమోననే భయంతో చాలామంది ప్రయాణికులు ఆకలిని చంపుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.  ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. మంత్రి కార్యాలయమా.. మజాకానా! 

Updated Date - 2022-01-18T06:26:06+05:30 IST