టెన్నిస్‌ ప్లేయర్ల ఆకలి కేకలు!

ABN , First Publish Date - 2020-03-30T09:49:17+05:30 IST

టెన్నిస్‌ అనగానే సెరెనా విలియమ్స్‌, ఫెడరర్‌, నడాల్‌, జొకోవిచ్‌ గుర్తుకొస్తారు. మ్యాచ్‌ల సందర్భంగా వారు ధరించే ఖరీదైన దుస్తులు, బూట్లు, వాడే రాకెట్లు

టెన్నిస్‌ ప్లేయర్ల ఆకలి కేకలు!

పారిస్‌: టెన్నిస్‌ అనగానే సెరెనా విలియమ్స్‌, ఫెడరర్‌, నడాల్‌, జొకోవిచ్‌ గుర్తుకొస్తారు. మ్యాచ్‌ల సందర్భంగా వారు ధరించే ఖరీదైన దుస్తులు, బూట్లు, వాడే రాకెట్లు అభిమానులను అబ్బురపరుస్తాయి. టెన్ని్‌సలో క్రీడాకారులంతా వీరిస్థాయిలో కాకపోయినా కాస్త రిచ్‌గానే ఉంటారని భావిస్తుంటాం. కానీ ఇది నాణేనికి ఒకవైపే. కరోనా కరాళ నృత్యంతో క్రీడా రంగం సైతం కుదేలైంది. పలు పోటీలు వాయిదాపడ్డాయి. టెన్నిస్‌ ప్రపంచం కూడా జూన్‌ 8వరకు బంద్‌ పాటిస్తోంది. దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 250 కన్నా తక్కువ స్థానాల్లో ఉన్న టెన్నిస్‌ ప్లేయర్ల జీవనం లాక్‌డౌన్‌తో దుర్భరంగా మారింది. అవును..ఐటీఎఫ్‌, ఏటీపీ టోర్నీలు లేని సమయాల్లో ఈ ప్లేయర్లు యూర్‌పలోని పలు టెన్నిస్‌ క్లబ్బుల్లో కోచ్‌లుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటారు.


లాక్‌డౌన్‌తో ఆ క్లబ్బులన్నీ మూతపడ్డాయి. దాంతో వారికి జీవన భృతి కరువైంది. ఐటీఎఫ్‌ ఆదుకోకపోతే తమలాంటి క్రీడాకారులు ఆకలికి అలమటించక తప్పదని జార్జియాకు చెందిన క్రీడాకారిణి సోఫియా షపటవా ఆందోళన వ్యక్తం చేసింది. ‘250 కన్నా తక్కువ ర్యాం కు కలిగిన ప్లేయర్ల వద్ద మరో రెండు వారాల తర్వాత నిత్యావసరాలు కొనుక్కునేందుకు కూడా డబ్బులుండవు’ అని సోఫియా వెల్లడించింది. ఈ పరిస్థితిని ఐటీఎఫ్‌కు తెలియజేశానని ఆమె చెప్పింది. ఐటీఎఫ్‌ ముందుకొచ్చి ఆటగాళ్లను ఆదుకోవాలని కోరింది. అయితే.. ఐటీఎఫ్‌ నుంచి సానుకూల స్పందన వస్తుందని తాను అనుకోవడంలేదని 371వ ర్యాంకరైన సోఫియా చెప్పింది. ఐటీఎఫ్‌ సర్క్యూట్‌లో ఆమెకు 16 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సోఫియా వద్ద నిల్వ ఉన్న డబ్బు.. కేవలం 100 అమెరికా డాలర్లు. రష్యాకు చెందిన 27 ఏళ్ల సెనియా ర్యాంకు 1283. టెన్నిస్‌ పోటీలతో ఈ ఏడాది ఆమె సంపాదన 69 అమెరికా డాలర్లే కావడం గమనార్హం. ‘రాబోయే మూడు నెలలు మాలాంటి ప్లేయర్లందరికీ దుర్భరమే’ అని బ్రిటన్‌కు చెందిన 233వ ర్యాంకర్‌ తారా మూర్‌ హెచ్చరించింది.

Updated Date - 2020-03-30T09:49:17+05:30 IST