పదువుల పందేరం

ABN , First Publish Date - 2021-10-21T05:59:32+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో నామినేటెడ్‌ పదవులతో పాటు పార్టీ జిల్లా అద్యక్ష పదవి కోసం నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉండి పదవులు పొందని నేత లు ఈసారి ఎలాగైనా పదవులు దక్కించుకునేందుకు

పదువుల పందేరం

జిల్లా టీఆర్‌ఎస్‌లో పదవుల కోసం నాయకుల పైరవీలు

నామినేటెడ్‌ పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు

జిల్లా అధ్యక్ష పదవికి పోటాపోటీ

నుడా చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులను ఆశిస్తున్న నేతలు

ముఖ్య నేతల ఆశీస్సుల కోసం ఆరాటం

గులాబీ పార్టీ అధిష్ఠాన నిర్ణయమేఫైనల్‌


నిజామాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో నామినేటెడ్‌ పదవులతో పాటు పార్టీ జిల్లా అద్యక్ష పదవి కోసం నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉండి పదవులు పొందని నేత లు ఈసారి ఎలాగైనా పదవులు దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగతంగా జిల్లాలో ఇటీవలే గ్రామ, మండల స్థాయి కమిటీల నియామకాలను సైతం పూర్తిచేయగా.. జిల్లా అధ్యక్ష పదవికి ఎవరిని నియమించాలనే అంశం పార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల్లోనే ఉంది. ఈనెల 25న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్ని కతో పాటు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండడం తో ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. నుడా చైర్మన్‌ పదవికాలం ముగియగా నిజామాబాద్‌ కమిటీ చైర్మన్‌ పదవి గత రెండున్నర ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఈ రెండు పోస్టుల కోసం టీఆర్‌ఎస్‌ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా ఈ పదవులను కేటాయించేందుకు జిల్లా నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంతా ఇప్పటికే ఈ విషయంలో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది.


జిల్లా అధ్యక్ష పదవికి పోటాపోటీ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గట్టిపోటీ ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండేళ్లలో ఎన్నికలు, అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడికి పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హోదా ఉండంతో, ఆ పదవిని ఆశించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పార్టీలో ఉధ్యమ సమయం నుంచి చురుగ్గా ఉంటున్న సుజిత్‌సింగ్‌ఠాకూర్‌, ప్రస్తుత అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డిలతో పాటు మరికొంతమంది నేతలు ఈ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల వేళ విపక్షాల విమర్శలకు గట్టి జవాబు ఇవ్వగలిగే నేతను ఎంపిక చేసేందుకు పార్టీ అదిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలకు సైతం పదవి ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించే అంశం సైతం పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గాలకు చెందిన నేతలను జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.


నుడా చైర్మన్‌ పదవికి పోటాపోటీ

నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి(నుడా) చైర్మన్‌ పోస్టుకు టీఆర్‌ఎస్‌ పార్టీలో పోటాపోటీ నెలకొంది. నుడా పాలకవర్గం ఏర్పడి మూడేళ్లు పూర్తవ్వగా.. ప్రస్తుతం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఇంకా కొనసాగుతున్నారు. నుడా పాలకవర్గానికి కాలపరిమితి లేదని చెబుతున్నప్పటికీ మూడేళ్లు పూర్తవుతున్నా.. కొత్తపాలకవర్గాన్ని ఇంకా నియమించనే లేదు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల పరిధిలో నుడా చైర్మన్‌ పదవి ఉండడంతో ఈ మూడు నియోజకవర్గాల నేతలు చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు అది దక్కని సమయంలో నుడా చైర్మన్‌ పదవి అయినా ఇవ్వాలని నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్‌ రూరల్‌కు చెందిన సీనియర్‌ నేత ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నుడా చైర్మన్‌ నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన వ్యక్తి ఉన్నందున, రూరల్‌ నియోజక వర్గానికి మరో దఫా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. 


మార్కెటీ చైర్మన్‌ కోసం ప్రయత్నాలు

జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం టీఆర్‌ఎస్‌ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజర్వేషన్‌ల ప్రాతిపదికన ఒక ఏడాది కాల  పరిమితితో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం చెందిన నేత ఏడాదిన్నర పాటు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి పొందగా.. 2019 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవి సైతం ప్రాధాన్యత కలిగి ఉండడంతో నేతలు, దీనిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాలకు ఈసారి ఈ పదవి దక్కే అవకాశాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల నేతలు పదవి కోసం పార్టీ ముఖ్య నేతల ఆశీస్సుల కోసం, వారి దృష్టిలో పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Updated Date - 2021-10-21T05:59:32+05:30 IST