రాజధానిలో ఇంటికి పదివేలా?

ABN , First Publish Date - 2020-10-22T07:14:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతే కనీసం చూడటానికి కూడా రాని ప్రభుత్వ యంత్రాంగం రాజధానిలో కూలిపోయిన ఇంటికి రూ.10వేలు ఇస్తామంటున్నారని, రైతులను ఆదుకోవాల్సిన

రాజధానిలో ఇంటికి పదివేలా?

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

పట్టభద్రుల ఎన్నికలో ఓటర్లు విజ్ఞత చూపాలి

ఖమ్మంలో రైతు దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ


ఖమ్మం మామిళ్లగూడెం, అక్టోబరు 21: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతే కనీసం చూడటానికి కూడా రాని ప్రభుత్వ యంత్రాంగం రాజధానిలో కూలిపోయిన ఇంటికి రూ.10వేలు ఇస్తామంటున్నారని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యతలను విస్మరించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రయోజనం పొందటానికే కుయుక్తులు పన్నుతోందని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆరోపించారు.  రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని చెల్లించాలని, రుణమాఫీని తక్షణమే అమలుచేయాలని టీడీపీ పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో  ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట  రైతుదీక్ష కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు , రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్‌ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్యతిథిగా హాజరైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు వర్షాలతో నష్టపోతే ఆదుకోవడంలోనూ, కనీసం  క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం హైదరాబాద్‌లో అతలాకుతలం అయినా ప్రజల దగ్గరికి వెళ్లకుండానే ఇంటికి పదివేల పేరుతో మళ్లీ రాజకీయ ప్రలోభానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. బాధిత రైతులకు ప్రయోజనం కలిగేంత వరకు అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామన్నారు.  త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి విజ్ఞతతో బుద్దిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 


తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అశ్వారావుపేట శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అకాలవర్షాలకు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారాన్ని చెల్లించే విధంగా రైతుల పక్షాన అసెంబ్లీలో ప్రస్తాన్నారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ  కేసీఆర్‌  ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ సభలో  రైతువిభాగం సెక్రటరీ శేఖర్‌రెడ్డి, బీసీ విభాగం నాయకులు సతీష్‌, అశోక్‌, మధుకర్‌,  సాంబశివరావు, వల్లంకొండ వెంకట్రామయ్య, నందమూరి సత్యనారాయణ, నల్లమల రంజిత్‌, కార్పోరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి  రాయల లత, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోపెల శ్యామల, ఆకారపు శ్రీనివాస్‌, చిరుమామిళ్లనాగేశ్వరరావు, నున్నా నవీన్‌చౌదరి, వక్కంతుల వంశీ, చేతుల శ్రీనివాస్‌, మల్లెంపాటి అప్పారావు, జట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కర్ణన్‌ను అందచేశారు. తొలుత సభలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇటీవ మృతి చెందిన టీడీపీ కార్యకర్తలకు సంతాపం వ్యక్తం చేశారు. పోలీస్‌ అమరవీరులను సంస్మరించుకుంటూ నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-10-22T07:14:16+05:30 IST