Abn logo
Sep 24 2021 @ 01:45AM

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

  • పోలీసులపై నిరసనకారుల దాడి 
  •  అసోంలో కాల్పులు.. ఇద్దరి మృతి


గువాహటి, సెప్టెంబరు 23: అసోంలోని దరంగ్‌ జిల్లా ధోల్పూర్‌ గ్రామంలో నదీ తీర భూముల్లో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ ఉద్రిక్తతంగా మారింది. తమకు పునరావాసం కల్పించాలంటూ 800 కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకారుల్లో కొందరు మారణాయుధాలు, రాళ్లతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 10 మందికిపైగా గాయపడినట్లు దరంగ్‌ ఎస్పీ సుశాంతబిశ్వ శర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 9 మంది పోలీసులేనన్నారు. వారిలో ఓ ఏఎస్సై మొనిరుద్దీన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గువాహటి తరలించినట్లు చెప్పారు.


మృతులను సద్దాం హుస్సేన్‌, షేక్‌ ఫరీద్‌గా గుర్తించినట్లు తెలిపారు. జూన్‌ 7న ధోల్పూర్‌ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం హిమంత బిశ్వశర్మ తీర ప్రాంతంలో భూ ఆక్రమణలను తొలగించాలని, అక్రమ వలసదారులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.


ఈ క్రమంలో సోమవారం నుంచి ఆక్రమణల తొలగిం పును ప్రారంభించారు. గురువారం నాటికి 602.4 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకున్నామని, 800 కుటుంబాలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే అక్రమంగా నిర్మించిన నాలుగు ప్రార్థనాలయాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపై దాడికి తెగబడ్డారు.