ఇంటి దొంగలు

ABN , First Publish Date - 2021-09-02T04:59:34+05:30 IST

ముక్కంటి ఆలయ హుండీ లెక్కింపులో చోరీలు జరగడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంటి దొంగలు
శ్రీకాళహస్తీశ్వరాలయం

శివయ్య సన్నిధిలో చోరీలపై ఆందోళన 


శ్రీకాళహస్తి అర్బన్‌, సెప్టెంబరు 1: ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు.. సాక్షాత్తు శివయ్య సన్నిధిలోనే పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ముక్కంటి హుండీ లెక్కింపు కార్యక్రమంలో రెండుమార్లు ఇద్దరు నగదును అపహరించి పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇక దొరకని దొరలు ఎందరున్నారో ముక్కంటీశుడికే ఎరుక. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ జరిగే రాహు-కేతు దోష నివారణ పూజలకు ఎంతో ప్రత్యేక ఉంది. ఆ మేరకు.. ముక్కంటి ఆలయానికి ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తోంది. ఆ మేరకు.. ఆలయ అధికారుల తీరు వివాదాల బాటన పడుతోంది. 


సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. 

గతంలో పలుమార్లు జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి పట్టుబడ్డారు. ఐదారు ఘటనలు వెలుగుచూడడంతో ఆలయంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఎందరు పర్యవేక్షణ చేస్తున్నా ఏదోరూపంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. గతనెల 22న జరిగిన హుండీ లెక్కింపులో పాల్గొన్న కిరణ్‌ అనే యువకుడు రూ.లక్షకుపైగా నగదు అపహరించి పట్టుబడ్డాడు. ఈనెల 25న కాంట్రాక్టు ఉద్యోగి బాబు రూ.92వేల నగదు అపహరించి వీఐపీలకు ఆశీర్వాదం ఇచ్చే ప్రాంతంలో దాచాడు. పారిశుధ్య సిబ్బంది కంటపడడంతో, ఉన్నతాధికారులు ఆరాతీయగా బాబు బండారం బయటపడింది. తొలుత కిరణ్‌ పట్టుబడిన తర్వాత ఆలయ అధికారులు కట్టుదిట్ట చర్యలు తీసుకోక పోవడంతోనే మళ్లీ చోరీ జరిగిందన్న వాదన వినవస్తోంది. బహిరంగ హుండీ లెక్కింపు చోరీలకు అవకాశమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హుండీ లెక్కింపు పూర్తయ్యాక వచ్చిన మార్గంలో కాకుండా, మరో మార్గంలో తప్పించుకునే అవకాశాలుండడం సమస్యగా మారింది. గతనెల 22న నగదు చోరీ చేసిన కిరణ్‌ సిబ్బంది తనిఖీలు జరిపే మార్గంలో కాకుండా, దీనికి ఎదురుగా ఉన్న మార్గంలో అమ్మవారి గర్భాలయం వైపు వెళ్లాడు. అక్కడున్న కంచె దూకి భక్తులతో కలిసిపోయి దర్జాగా వెలుపలకు వెళ్లిపోయేయత్నంలో భద్రతా సిబ్బందికి దొరికిపోయాడు. ఈ ఘటనతో గతంలో ఇలా ఎందరు నోట్లకట్టలతో జారుకున్నారన్న అంశం ముక్కంటి భక్తుల్లో ఆందోళన రేపుతోంది. 


పరకామణి ఏర్పాటు జాడేదీ? 

శ్రీకాళహస్తీశ్వరాలయానికి హుండీ ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆ మేరకు.. శాశ్వత పరకామణి ఏర్పాటు దిశగా ముక్కంటి ఆలయ యంత్రాంగం ప్రయత్నించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నాలుగు గోడల మధ్య కాకుండా, ఆలయ ఆవరణలోని బహిరంగప్రదేశంలో హుండీ లెక్కింపు ఎందుకు కొనసాగించడంపైనా విభిన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. మరోవైపు హుండీ లెక్కింపునకు ఎంపిక చేసిన సిబ్బంది జాబితాలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 25న నగదుతో పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి బాబు పేరు హుండీ లెక్కింపు జాబితాలో లేకపోవడమే నిదర్శనం. ముక్కంటి భక్తులను తరలించే ఉచిత బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన హుండీ లెక్కింపు జరిగే ప్రదేశానికి ఎవరి అనుమతి లేకుండా ఎలా వెళ్లాడు? ఎవరు సహకరించాన్న అంశంపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉంది. హుండీ లెక్కింపు విధులకు షర్ట్‌, ప్యాంటుతో హాజరుకారాదు. ఈ నిబంధనను విస్మరించి బాబు భక్తుల కానుకలు లెక్కిస్తున్న ప్రదేశంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. మొత్తం మీద ఏళ్లుగా ఇలాంటి చోరీలు, ఇతర ఘటనలు ఎన్ని జరిగాయో ముక్కంటీశుడికే తెలియాలి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. హుండీ లెక్కింపునకు ప్రత్యేక పరకామణి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. 

Updated Date - 2021-09-02T04:59:34+05:30 IST