టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన.. ఆశావహుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-19T12:40:43+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న..

టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన.. ఆశావహుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

  • మొదటి జాబితాలో ఉప్పల్‌ డివిజన్లకు దక్కని చోటు 
  • కాప్రా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన
  • తీవ్ర ఉత్కంఠలో 9 డివిజన్ల నేతలు


హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. మొదటి జాబితాలో ఉప్పల్‌ నియోజకవర్గంలోని మొత్తం 10 డివిజన్లల్లో కేవలం కాప్రా 1వ డివిజన్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ కార్పొరేటర్‌ స్వర్ణరాజ్‌ను ప్రకటించడంతో, 9 డివిజన్లలోని నాయకుల్లో తీవ్ర టెన్షన్‌ మొదలైంది. మొదటి జాబితాలో 150 డివిజన్లకు గాను 105 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి, 45 డివిజన్లకు ప్రకటించకపోవడం, వాటిలో ఉప్పల్‌కు చెందిన 9 డివిజన్లు ఉండడంపై ఇక్కడి డివిజన్లలోని ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది.


మల్కాజిగిరిలోనూ నలుగురుకి...

మల్కాజిగిరి నియోజకవర్గంలో 9 డివిజన్లలో నలుగురు సిట్టింగ్‌లకు బెర్తు ఖరారైంది. దాంతో మిగితా సిట్టింగ్‌ కార్పొరేటర్లలో ఆందోళన మొదలైంది. గౌతంనగర్‌, ఆనంద్‌బాగ్‌, నేరేడ్‌మెట్‌ డివిజన్లకు చెందిన సిట్టింగ్‌లను మారుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వినాయక్‌నగర్‌ డివిజన్‌కు చెందిన సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బద్దం పుష్పలతారెడ్డిని నేరేడ్‌మెట్‌ డివిజన్‌కు మార్చి, ఆస్థానంలో ఓ ఎన్‌ఆర్‌ఐ భార్యకు టికెట్‌ లభించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌలాలి డివిజన్‌కు చెందిన ముంతాజ్‌ ఫాతిమా పేరు సైతం ఇంకా ఖరారు కాలేదు. మల్కాజిగిరిలోని ఆరు డివిజన్లకు గాను కేవలం మల్కాజిగిరి డివిజన్‌కు చెందిన సిట్టింగ్‌ కార్పొరేటర్‌ నిరుగొండ జగదీ్‌షగౌడ్‌కు మాత్రమే టికెట్‌ ఖరారైంది.


అల్వాల్‌ల్లో సిట్టింగ్‌లకే టికెట్లు

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అల్వాల్‌లో సిట్టింగ్‌లకే అధిష్టానం టికెట్లు ఖారారు చేసింది. దాంతో కార్పొరేటర్లు శాంతి శ్రీనివా్‌సరెడ్డి, రాజ్‌జితేందర్‌నాధ్‌, సబిత కిషోర్‌లు ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


నాలుగు డివిజన్లపై సందిగ్ధత..

ఉప్పల్‌ నియోజకవర్గంలో 10 డివిజన్లకు గాను ఒక డివిజన్‌ను మాత్రమే అభ్యర్థిని ప్రకటించడంపై ఈ నియోజకవర్గంలో రాజకీయాలు సంక్లిష్టంగా ఉన్నట్లు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి డివిజన్‌ నుంచి ఆయన సతీమణి బొంతు శ్రీదేవి ఇక్కడి నుంచే టిక్కెట్‌ ఆశిస్తున్నప్పటికీ ఆమెకు టికెట్‌ను ప్రకటించకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి సతీమణి స్వప్నారెడ్డి హబ్సిగూడ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అయినప్పటికీ మొదటి జాబితాలో లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చానీంశంగా మారింది. అయితే ఉప్పల్‌  సర్కిల్‌ రెండు డివిజన్లకు, కాప్రా సర్కిల్‌లో రెండు డివిజన్లకు సిట్టింగ్‌లకు కాకుండా ఇతరులకు టిక్కెట్‌ కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి.

Updated Date - 2020-11-19T12:40:43+05:30 IST