టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2022-04-10T06:25:24+05:30 IST

యాదగిరిగుట్టపైకి ఆటోలు, స్థానికుల వాహనాలు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి.

టెన్షన్‌.. టెన్షన్‌
నిరసనకారులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

యాదగిరిగుట్ట ఈవో కార్యాలయం ముట్టడి

 పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం

 ఎంపీ కోమటిరెడ్డి రాకతో గుట్టలో ఉద్రిక్తం

 ఈవోను తొలగించాలని డిమాండ్‌

యాదాద్రి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టపైకి ఆటోలు, స్థానికుల వాహనాలు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో కొండపైన ఉన్న ఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. కొండపైకి వాహనాలను అనుమతించాలని, ఈవోను విధుల నుంచి వెంటనే తొలగించాలని ప్లకార్డులు చేతపట్టుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యారీకేడ్లను దాటుకుని ఈవో కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ఈవోకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు కొండపైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల ఆందోళన నేపథ్యంలో స్పెషల్‌ పోలీసులు మోహరించినా, స్థానికులు భక్తులరూపంలో కొండపైకి చేరుకుని ఆలయ ఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. విడతలవారీగా ఆందోళనకారులు ఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఆందోళనతో కొండపైన ఏం జరుగుతోందనని భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈవో కార్యాలయం ఆవరణలో ఆందోళన చేస్తున్న స్థానికులకు పోలీసులు అరెస్టుచేసి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్లకు తరలించారు. శనివారం సెలవు కావడంతో కొండపైన భక్తుల రద్దీ నెలకొంది. ఈనేపథ్యంలో తమ సమస్యను అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు భక్తుల వద్ద భిక్షాటన చేశారు. గుట్టలో నల్లజెండాలను చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు.


ఎంపీ కోమటిరెడ్డి రాకతో గుట్టలో టెన్షన్‌

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వామివారిని తొలిసారిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలు, స్థానికుల వాహనాలను అనుమతించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రోక్షణకు ఎంపీగా తనను ఆహ్వానించలేదని ఆలయ అధికారులపై ఆయన అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరసనలతోపాటు ఎంపీ పర్యటన కూడా ఉండటంతో స్థానికంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు యాదగిరిగుట్ట పట్టణంలో భారీ ర్యాలీగా మొదటిఘాట్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. ఎంపీ వాహనాలతోపాటు కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. కొండకింద ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లను ఎంపీ కలిసి, వారితో చర్చించారు.


సినిమా సెట్టింగులా ఆలయ నిర్మాణం : కోమటిరెడ్డి

యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం పూర్తిగా సినిమా సెట్టింగును తలపిస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పూజలు జరిగిన అనంతరం తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ఉద్ఘాటనకు ప్రొటోకాల్‌ ఎందుకు పాటించలేదని, ఈవోను ప్రశ్నించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆలయ ఉద్ఘాటన వైదిక పర్వాలు కొనసాగాయని కన్నీటి పర్యంతమై ఈవో వివరించినట్టు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో వందలోపాలు ఉన్నాయని, ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ సాక్షాత్తు దేవుడినే మోసం చేశారని హితవు పలికారు. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో ఆలయ గోపురాలపై కలశాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి అపవిత్రం చేశారని ఆరోపించారు. జీయర్‌స్వామి చెప్పిన రీతిలో కాకుండా భిన్నంగా సంప్రోక్షణ చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీయర్‌స్వామి, రామేశ్వర్‌రావుతో కొట్లాటలుంటే బయట తేల్చుకోవాలన్నారు.  


వైభవంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో అష్టమి తిథి అయినా క్షేత్ర సందర్శనకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి విమానగోపురం బంగారు తాపడానికి పట్టణానికి చెందిన గజవెల్లి సంధ్యసతీ్‌షలు రూ.50వేలను అందజేశారు.  


తులసీదళాలతో అర్చనలు 

స్వయంభు లక్ష్మీనారసింహుడికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. ప్రధానాలయంలో స్వయంభువులను, కవచమూర్తులను అభిషేకించిన ఆచార్యులు తులసీదళాలతో అర్చించారు. మండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వరుడిని కొలిచిన ఆచార్యులు దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులకు నిత్యపూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా రాత్రివేళ చరమూర్తుల ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి ఎదుర్కోలు మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

Updated Date - 2022-04-10T06:25:24+05:30 IST