ప్రధాన పార్టీల్లో టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2021-04-30T06:17:11+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి..

ప్రధాన పార్టీల్లో టెన్షన్‌.. టెన్షన్‌
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో కౌంటింగు ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు

ఎల్లుండే తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

కౌంటింగ్‌ జరిగేనా? జరిగినా ఫలితాలు వెలువడేనా?

హైకోర్టు నిర్ణయం ఎలా వుంటుందోనని ఉత్కంఠ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. పక్షం రోజుల వ్యవధి కాస్తా ఇపుడు రెండు రోజుల ముంగిటకు వచ్చి నిలిచింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ మొదలవుతోంది. అయితే ఫలితాలు ఎలా వుంటాయో అన్నదానిపై కాకుండా అసలు ఓట్ల లెక్కింపు జరుగుతుందా? జరగదా? ఒకవేళ జరిగినా ఫలితాల ప్రకటన వెలువడుతుందా? వెలువడదా? అన్న దానిపైనే పార్టీలు ఆదుర్దా చెందుతున్నాయి. తిరుపతి లోక్‌సభ నియోజవకర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద రావు గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన నేపధ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 17వ తేదీన పోలింగ్‌ కూడా నిర్వహించింది.


అయితే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు గానూ ప్రధానంగా తిరుపతి సెగ్మెంట్‌లో అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి కూడా తెలిసిందే. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచీ వందలాది వాహనాల్లో వేలాదిమందిని తరలించి వారితో దొంగ ఓట్లు వేయించడంపై ఆధారాలతో సహా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు, నేతలు అటు పోలీసులకు, జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అయితే ఎన్నికల సంఘం నుంచీ స్పందన లేకపోవడంతో తొలుత బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తర్వాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని, కనుక రీపోలింగ్‌కు ఆదేశించాలని వారందులో కోరారు.


ఈ పిటిషన్లపై హైకోర్టు ఇప్పటి దాకా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేదు. కోర్టు నుంచీ ఎలాంటి ఆదేశాలూ లేనందున అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో వున్నందున ఓట్ల లెక్కింపు జరుగుతుందా లేక ఆగిపోతుందా? ఒకవేళ జరిగినా కూడా ఫలితాలు వెల్లడించే పరిస్థితి వుంటుందా వుండదా? అన్న సందేహాలతో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంటోంది. విజయావకాశాలపై వైసీపీ వర్గాలు ధీమాతో వున్నప్పటికీ ఓట్ల లెక్కింపు జరుగుతుందా ఆగిపోతుందా అన్న అంశంపై ఆందోళన పార్టీ నేతలను స్థిమితంగా వుండనివ్వడంలేదు. విజయంపై పెద్దగా ఆశలు లేకున్నా హైకోర్టు జోక్యంతో రీపోలింగ్‌ జరిగితే నైతికంగా తమకు విజయం దక్కినట్టేనని టీడీపీ, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు.


దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు, శ్రేణులు సైతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పట్ల ఒకింత ఆదుర్దాతో వుంటున్నారు. కాకపోతే ఇంకా రెండు రోజుల వ్యవధి వున్నందున ఆలోపు హైకోర్టు నుంచీ మధ్యంతర ఉత్తర్వులు వెలువడక పోతాయా అన్న ఆశాభావం టీడీపీ, బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓట్లలెక్కింపు జరిగినా ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టమని కోర్టు ఆదేశించినా కూడా ప్రస్తుతానికి తమకే నైతిక విజయం దక్కుతుందని ఈ పార్టీల నేతలు భావిస్తుండగా ఇదే విషయంలో అధికార పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  

Updated Date - 2021-04-30T06:17:11+05:30 IST