8 నుంచి పది పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-23T08:28:09+05:30 IST

పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే మూడు పరీక్షల నిర్వహణ పూర్తికాగా.. మిగతా పరీక్షలను జూన్‌ 8 నుంచి

8 నుంచి పది పరీక్షలు

  • జూలై 5 వరకు.. కేంద్రాలు డబుల్‌
  • పరీక్షకు రెండ్రోజుల చొప్పున గ్యాప్‌
  • ఒక బెంచిలో ఒక్క విద్యార్థి మాత్రమే
  • దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ప్రత్యేక గది
  • విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాస్కులు



హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే మూడు పరీక్షల నిర్వహణ పూర్తికాగా.. మిగతా పరీక్షలను జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కరోనా వైర్‌సతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఈ పరీక్షలను వైరస్‌ ప్రబలకుండా ఉండే విధంగా ప్రత్యేక జాగ్రత్తల మధ్య నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షకు రెండురోజుల విరామం ఇవ్వనున్నారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకుగాను పరీక్షా కేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేశారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అదనంగా 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ సంఖ్యను 4,535కు పెంచారు.


గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాలకు కొత్త కేంద్రాలు అరకిలోమీటరు లోపే ఉంటాయి. పరీక్షా కేంద్రాల మార్పును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు ఉన్నతాధికారులు తెలియజేస్తారు. ఈ మేరకు కేంద్రాలు మారిన విద్యార్థులకు ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు తెలియచేస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షల కోసం 26,422 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగించుకోనున్నారు. పరీక్షలకు 5.45 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక బెంచిలో ఒకే విద్యార్థిని మాత్రమే కూర్చోబెడతారు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న విద్యార్థులను ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తారు. పరీక్ష కేంద్రాలను పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కులను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని, ఇన్విజిలేటర్లు కూడా మాస్కులతో పాటు చేతులకు గ్లౌజులు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లల లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని తప్పించి, రిజర్వ్‌లో ఉన్న సిబ్బందిని వినియోగిస్తామని చెప్పారు. పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. కొత్త షెడ్యూల్‌ వెలువడినందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని.. ఆందోళన చెందరాదన్నారు. పరీక్ష కేంద్రాలు, ఇతరత్రా సమాచారం గురించి విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 



Updated Date - 2020-05-23T08:28:09+05:30 IST