Advertisement
Advertisement
Abn logo
Advertisement

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై ఒమైక్రాన్‌ ప్రభావం!

ముందుగా షెడ్యూల్‌  ప్రకటించే అవకాశం

ఆ తర్వాత వైరస్‌ తీవ్రతను బట్టి నిర్ణయం


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలపై కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రభావం ఎలా ఉండొచ్చనే అంశంపై అధికారులు అంచనా వేస్తున్నారు. వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఒమైక్రాన్‌ నేపథ్యంలో పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలా? కొన్నాళ్లు వేచిచూడాలా? అనేదానిపై అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. యథావిధిగా షెడ్యూల్‌ను ప్రకటించి పరీక్ష ఫీజును వసూలు చేయడం, ప్రశ్నాపత్రాలను రూపొందించడం వంటి ప్రక్రియలను పూర్తిచేయాలని భావిస్తున్నారు. తర్వా త పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా, డిసెంబరులో పాఠశాల విద్యార్థులకు సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని జిల్లాల విద్యాధికారులకు పంపించారు. వార్షిక పరీక్షల కంటే ముందుగా ఎస్‌ఏలను నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత కారణంగా వార్షిక పరీక్షలను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే... ఎస్‌ఏలో విద్యార్థులు సాధించిన మార్కుల ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఎస్‌ఏ పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.


ఒకట్రెండు రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు..!

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అక్టోబరు 25వ తేదీ నుంచి నవంబరు 3వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.  


సెట్ల నిర్వహణపై విద్యామండలి దృష్టి

వచ్చే ఏడాదికి సంబంధించి వివిధ ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణపై  అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన అధికారులు, సెట్ల నిర్వాహకులతో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కరోనా కొత్త వేరియంట్‌ ప్రభావం పెద్దగా ఉండకపోతే.. సెట్లను సకాలంలో పూర్తిచేయాలని భావిస్తున్నారు.  


Advertisement
Advertisement