ఆద్యంతం.. ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-07-29T06:59:41+05:30 IST

మునుగోడు నియోజకవర్గకేంద్రం ఆద్యంతం అట్టుడికిపోయింది. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి, అడ్డగింతలు, అరె్‌స్టల పరంపర కొనసాగింది. నియోజకవర్గానికి రానివ్వనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసు లు అప్రమత్తమై కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్ట్‌ చేశారు.

ఆద్యంతం.. ఉత్కంఠ
మునుగోడులో మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు

అరెస్ట్‌లు, ఆందోళనలతో దద్దరిల్లిన మునుగోడు

మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యేనే తిరిగి పంపించిన పోలీసులు

జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు

మునుగోడు నియోజకవర్గకేంద్రం ఆద్యంతం అట్టుడికిపోయింది. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి, అడ్డగింతలు, అరె్‌స్టల పరంపర కొనసాగింది. నియోజకవర్గానికి రానివ్వనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసు లు అప్రమత్తమై కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్ట్‌ చేశారు. ఎక్కువ వాహనాలకు అనుమతి లేదని చెప్పడంతో రాజగోపాల్‌రెడ్డి వెనుదిరిగారు. కార్యకర్తల అరెస్టులకు నిరసనగా  మునుగోడులో రేషన్‌ కార్డుల పంపిణీలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డి కాన్వాయ్‌కి కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డు తగలడంతో, పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం పోలీసు పహారా నడుమ కొనసాగగా, కేవలం లబ్ధిదారులను మాత్రమే అనుమతించారు. 


మునుగోడు, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ టౌన్‌, భువ నగిరి రూరల్‌, జూలై 28: మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీ్‌షరెడ్డి పర్యటన బుధవారం ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తతల నడు మ సాగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ ఇటు పోలీసు లు, అటు ప్రజల్లో నెలకొంది. మంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 27న ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పర్యటనను అడ్డుకునేందు కు కాంగ్రెస్‌ వర్గీయుల ప్రయత్నాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు ముఖ్యనేతలను అరెస్టు చేసి రహస్యంగా జిల్లా కేంద్రానికి తరలించారు. అయినా నియోజకవర్గంలోని సంస్థాన్‌నారాయణపురం, మర్రిగూడ, మునుగోడు, చండూరు మండలాలతో పాటు సమీప మండలాలైన చిట్యాల, నల్లగొండ నుంచి వందలాది మంది కాంగ్రెస్‌ నేతలు మునుగోడుకు తరలివచ్చారు. అప్పటికే పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించి కట్టడి చేశారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బొంగులూరు గేట్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారంతో కొంత కోపోద్రిక్తులయ్యారు. కొందరు రహస్యంగా మండల కేంద్రానికి చేరుకుని, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. ఆహారభద్రత కార్డుల సమావేశం ముగిసేంత వరకూ ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ నాయకులు రోడ్లపై నిరసనలు చేసే ప్రయత్నా లు చేశారు. మంత్రి వెళ్లే వరకు ఇలా నిరసన తెలిపిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు వారిందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎస్పీ రంగనాథ్‌ పర్యవేక్షణలో అడిషనల్‌ ఎస్పీ సతీష్‌ భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేప ట్టారు. ముగ్గురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 40మంది ఎస్‌ఐల తో పాటు 150 మంది కిందిస్థాయి పోలీసులు మంత్రి పర్యటన సందర్భంగా మోహరించారు.సంస్థాన్‌నారాయణపురంలో నిరసనవ్యక్తం చేస్తు న్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చౌటుప్పల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై యు వజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మంత్రిఫ్లెక్సీని కార్యకర్తలు దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్దగోని రమేష్‌ గౌడ్‌, ఎం.రాజేశ్‌ ఖన్నా, బర్రె నరేష్‌, ప్రవీణ్‌, వెంకట్‌, శివ పాల్గొన్నారు. 


టెన్షన్‌.. టెన్షన్‌..

 10.45 నిమిషాలకు మంత్రి జగదీష్‌రెడ్డి మునుగోడుకు చేరుకున్నారు.

 10.50 నిమిషాలకు కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌కి              అడ్డు తగలడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. 

 11.00 గంటలకు మునుగోడు మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి నివాళి అర్పించారు. 

 11.10 నిమిషాలకు ర్యాలీగా వెళుతుండగా మళ్లీ కొంత మంది కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. 

 11.15 నిమిషాలకు రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. 

 12.00 గంటలకు కార్యక్రమం ముగియగా, మంత్రి తిరుగు పయనమయ్యారు. 


మంత్రి కాన్వాయ్‌ అడ్డగింతకు యత్నం

మంత్రి జగదీ్‌షరెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరుతుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డగించే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌ వాహనంలోకి ఎక్కించి మంత్రి కాన్వాయి వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా ఔటర్‌ రింగురోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో అన్ని వాహనాలను అనుమతించడం కుదరదని పోలీసులు చెప్పటంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 


అడ్డుకోవడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ

సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పేదలకోసం సొంత డబ్బును ఖర్చు చేస్తారని, డబ్బుకు అమ్ముడుపోని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా అడ్డుకోవడం, వేధించడం మంచిది కాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను మంగళవారం అర్ధరాత్రి నుంచి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. ఎంపీనైన తనను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. 90శాతం పూర్తయిన శ్రీశైలం సొ రంగం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను ఎనిమిదేళ్ల నుంచి పూర్తి చేయలేని దద్దమ్మ మంత్రి జగదీ్‌షరెడ్డి అని ఆరోపించారు. 




ధాన్యం సేకరణలో రికార్డు సృష్టించాం 

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

నల్లగొడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యం సేకరణలో రికార్డు సృష్టించామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మునుగోడులో బుధవారం ఏర్పాటు చేసిన రేషన్‌కార్డుల పంపిణీ  కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు ఉమ్మడి జిల్లాలో 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అయ్యేదని, నేడు 20లక్షల టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలో గత మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుస్తూ రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. మంత్రి పనిచేస్తుండా లేదా అనే దానికి ఈ ఒక్క సమాధానం చాలు అని కాంగ్రెస్‌ నేతలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తూతూ మంత్రాలతోనే వచ్చేది ఉంటే కాంగ్రెస్‌ నాయకులు ఆ పనెందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల నెల రోజులే మేం రాజకీయాలు చేస్తామని, తెలియక కొంతమంది ఆగమాగమై పోతున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజుకో ఆకలి చావు, ఆత్మహత్య జరిగేవన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతుబంధు పథకం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్‌ను తమ వాడిగా తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు. కాళేశ్వరం ఫలితాలు మొదట చూసింది ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలే అన్నారు. 4వేల చెరువుల్లో పూడిక తీసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. రూ.50వేల కోట్లతో గుడిమల్కాపూర్‌లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేశామని, రూ.వందల కోట్ల వ్యయంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు అభివృద్ధికి దిక్సూచీగా నిలుస్తున్నాయన్నారు. 

Updated Date - 2021-07-29T06:59:41+05:30 IST