మున్సిపోల్స్‌పై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-02-24T06:38:41+05:30 IST

మున్సిపోల్స్‌పై ఉత్కంఠ

మున్సిపోల్స్‌పై ఉత్కంఠ
ఒంగోలులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

కోర్టు నిర్ణయం నేడు వెల్లడయ్యే అవకాశం 

ఒంగోలు, చీరాల, మార్కాపురంలలో రసవత్తర పరిణామాలు 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మున్సిపల్‌ పోరుపై ఉత్కంఠత పెరిగిపోయింది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా లేక తిరిగి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ మొదలవుతుందా అన్న అంశం చర్చనీయాంశమైంది.ఆ మేరకు హైకోర్టు ఇచ్చే నిర్ణయమే కీలకం కాబోతోంది. హైకోర్టు నిర్ణయం బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉండటంతో మున్సిపల్‌ పోల్స్‌పై ఉత్కంఠత నెలకొంది. జిల్లాలో ఇప్పటికే ఒంగోలు కార్పోరేషన్‌, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలలో రాజకీయ పరిస్థితి రసవత్తరంగా మారిపోయాయి.


ఆ మూడు చోట్లా రసవత్తరం 

జిల్లాలో ప్రధానంగా ఎన్నికలు జరగనున్న ఒంగోలు కార్పొరేషన్‌, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీల్లో రసవత్తర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒంగోలులో 50 డివిజన్లు ఉండగా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుమారు 40 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో ఒక అంతర్గత కమిటీని ఏర్పాటుచేశారు. అయితే మేయరు అభ్యర్థి ఎంపికపై ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఆ పార్టీ మహిళా నాయకురాలు గంగాడ సుజాత వైసీపీ మేయరు అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అధికారం లేనప్పుడు కూడా వైసీపీలోనే బాలినేనిని అంటిపెట్టుకుని ఉన్న ఆమెకు మంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది. ఒక డివిజన్‌ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేయించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే మేయరు పదవి కోసం అధికార పార్టీలో మరికొందరు నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తాము కూడా సీనియర్లమేనంటూ ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని చెబుతూ అటు మంత్రిని, ఇటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని కూడా కలిసి అభ్యర్థిస్తున్నారు. బాలినేనికి మద్దతుగా పయనిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె కుమార్తెకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మేయరు అభ్యర్థిగా భావిస్తున్న సుజాత నామినేషన్‌ చెల్లదంటూ కొందరు ఫిర్యాదులు చేయటం, హైకోర్టుకెక్కే ప్రయత్నాలు ప్రారంభించారు. దానంతటికీ అధికారపార్టీలోని కిందిస్థాయి నాయకుల మధ్య ఉన్న విబేధాలే కారణంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి బాలినేని కొందరు నాయకులను సీరియస్‌గా హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేత దామచర్ల జనార్దన్‌ మంగళవారం ఒంగోలు వచ్చి పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన డివిజన్లలో నామినేషన్లు వేసిన ముఖ్యులను పిలిపించుకుని చర్చించటం ప్రారంభించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోయింది ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా భావిస్తున్న ఒక మహిళా డాక్టరు ఇప్పటికే నామినేషన్‌ కూడా దాఖలు చేసి ఉన్నారు. అయితే వైసీపీ నాయకులు ఏకగ్రీవ ఎంపికల కోసం జరుపుతున్న ప్రయత్నాల్లో టీడీపీకి చెందిన రంగంలో ఉన్న కొందరు నేతలు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఓ కాంట్రాక్టు ఇప్పిస్తే తాను నామినేషన్‌ ఉపసంహరణకు సిద్ధమని పోటీలో ఉన్న ఓ మహిళా నాయకురాలు తేల్చిచెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


చీరాలలో..

చీరాలలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి పర్చూరు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు, ఎమ్మెల్సీ ఇచ్చి చీరాల పూర్తి బాధ్యతలు ఎమ్మెల్యే కరణం బలరాంకి ఇవ్వాలని అధిష్టానం భావించింది. పర్చూరు బాధ్యతలు చేపట్టేందుకు కృష్ణమోహన్‌ అంగీకరించినట్లు కూడా చెబుతున్నారు. ఈలోపే స్థానిక ఎన్నికలు రావటంతో మళ్లీ అక్కడ ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పూర్తి బాధ్యతలు ఇవ్వాల్సిందేనంటూ బలరాం అధిష్టానం వద్ద తేల్చిచెప్పినట్లు తెలిసింది. పర్చూరు వెళ్లినా మున్సిపాలిటీలో బలమైన తన అనుచరగణంకు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని ఆమంచి కూడా కోరుతున్నట్లు తెలిసింది. ఇంకోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత రెండురోజులుగా కొన్ని వార్డుల్లో పర్యటించి పార్టీ బీఫాంలను తానే తీసుకొస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అధికారపార్టీలోని ఆధిపత్యపోరుకి అధిష్టానం ఫుల్‌స్టాప్‌ పెడుతుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది. టీడీపీలో ఇన్‌ఛార్జ్‌ బాలాజీపై కొందరు నాయకులు అధిష్ఠానంకు చేసిన ఆరోపణలతో స్థానిక పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అధిష్ఠానం హామీ ఇస్తే పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం లేదంటే వేచిచూద్దాం అన్న ధోరణితో బాలాజీ ఉన్నట్లు తెలుస్తోంది. మార్కాపురం మున్సిపాలిటీలో ప్రస్తుతం 6 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు లేవు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే, ఇతర నాయకులతో టీడీపీ ముఖ్య నాయకులకు మధ్య ఒప్పందం జరిగిందన్న ప్రచారం ఇప్పటికీ ఉంది. అయితే తాజాగా అటు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కుటుంబసభ్యులు, టీడీపీ పక్షాన కందుల నారాయణరెడ్డిలు కసరత్తు ప్రారంభించారు. వైసీపీకి ఛైర్మన్‌ అభ్యర్థిత్వం కోసం పోటీ అధికమై అదే సమస్యగా మారగా టీడీపీకి ఛైర్మన్‌ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి దీటుగా బరిలోకి దిగుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. 


Updated Date - 2021-02-24T06:38:41+05:30 IST