నయనానందకరంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

ABN , First Publish Date - 2021-03-01T06:39:43+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ పురవీధుల్లో ఊరేగించి అనంతరం దేవస్థానం చెరువుగట్టు వద్దకు తీసుకువచ్చారు.

నయనానందకరంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
కోనేటిలో హంస వాహనంపై విహరిస్తున్న లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారు

అంతర్వేది, ఫిబ్రవరి 28: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ పురవీధుల్లో ఊరేగించి అనంతరం దేవస్థానం చెరువుగట్టు వద్దకు తీసుకువచ్చారు. తొలుత అర్చకస్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువులో హంస వాహనంపై విద్యుత్‌ కాంతుల నడుమ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి, అమ్మవారితో కలిసి విహార యాత్ర చేస్తున్న తరుణంలో భక్తులు పాటుచెరువు చుట్టూ తిరుగుతూ గోవింద, నృసింహ నామాలతో జేజేలు కొట్టారు. విష్ణుచక్రం, నాగసర్పంతో పాటు వివిధ రకాల బాణసంచా కాల్పులతో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, స్థానాచార్యులు వింజమూరి రంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాసి్త్ర, అర్చక స్వాముల సారధ్యంలో పూజలు జరిపారు. కార్యక్రమంలో తెప్పోత్సవ నిర్వహణ విరాళ దాత గొట్టిముక్కల భీమరాజు, ఆలయ చైర్మన్‌, ఫ్యామిలీ ఫౌండర్‌ రాజగోపాల రాజాబహుద్దూర్‌, ఆలయ  సహాయ  కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, సీఐ దుర్గాశేఖరరెడ్డి, ఎస్‌ఐ గోపాలకృష్ణ, భక్తులు పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారికి తిరుమంజనములు, దర్పణసేవ, ధూపసేవ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పయాగోత్సవం, చెంగోల విన్నపం, తీర్థగోష్టి నిర్వహించారు. అనంతరం పవళింపు సేవతో తీర్థ మహోత్సవాలు ముగిశాయి.


Updated Date - 2021-03-01T06:39:43+05:30 IST