నిబంధనలు గాలికి!

ABN , First Publish Date - 2020-11-30T05:34:54+05:30 IST

కరోనా వ్యాప్తి సద్దుమణిగినట్టే అనిపించినా ప్రజల నిర్లక్ష్యంతో మళ్లీ విజృంభిస్తున్నది. మొదట్లో కరోనా అంటేనే హడలెత్తిన ప్రజలు ఇప్పుడు తమ ధోరణి మార్చుకున్నారు.

నిబంధనలు గాలికి!
మెదక్‌ జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తా వద్ద మాస్కులు లేకుండా గుంపులుగా ఉన్న జనం

 నివురుగప్పిన నిప్పులా ‘కరోనా’

 మాస్కులకు మంగళం పాడిన జనం

 భౌతిదూరం పాటించకుండా దావత్‌లు, పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు

 రోడ్లపై, షాపింగు మాల్స్‌లో గుంపులు గుంపులుగా జనం


మెదక్‌ కల్చరల్‌, నవంబరు 29: కరోనా వ్యాప్తి సద్దుమణిగినట్టే అనిపించినా ప్రజల నిర్లక్ష్యంతో మళ్లీ విజృంభిస్తున్నది. మొదట్లో కరోనా అంటేనే హడలెత్తిన ప్రజలు ఇప్పుడు తమ ధోరణి మార్చుకున్నారు. మహాఅయితే వస్తుంది, పోతుంది దానితో పెద్ద నష్టం ఏమీలేదన్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు విధించిన కనీస నిబంధనలను పాటించడం లేదు. మాస్కులు ధరంచడం మానేశారు. భౌతికదూరం పాటించడంలేదు. శానిటైజర్లను కొందరు వాడుతున్నా వాటి నాణ్యత ఎంత అన్నది దేవుడెరుగు. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించకపోతే భారీ మూల్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా కొందరిలో ప్రభావం చూపకున్నా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ వచ్చి దాని పనితీరు తెలిసే వరకు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 


దావత్‌లన్నీ ధూంధాంగా


కరోనా కబలిస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రజలు భేఖాతరు చేస్తున్నారు. వందమందిలోపే సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలన్న నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. కరోనా విజృంభిస్తున్న మొదట్లో బయటకు వెళ్లాలంటే భయపడేవారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్కు ధరించి వెళ్లేవారు. కానీ ప్రస్తుత సమయంలో మాస్కు ఉన్నా లేకున్నా ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. అతికొద్ది మంది మాత్రమే మాస్కులను ధరిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాస్కులను  తప్పనిసరిగా వాడాలని వైద్యులు చెబుతున్నారు. అయినా కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు.


ఒకే రోజు ఒకే గ్రామంలో 25 కేసులు


జిల్లాలోని కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఒకే రోజు వందమందికి పరీక్షలు నిర్వహించగా 25 మందికి కరోనా పాజిటివ్‌గా రావడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 52,474 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,474 మందికి పాజిటివ్‌ వ చ్చింది. హోమ్‌ ఐసోలేషన్‌లో 117, ఆసుపత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 38 మంది చనిపోయారు. 


Updated Date - 2020-11-30T05:34:54+05:30 IST