మేడే, మేడే, మేడే.. విమానం కూలడానికి ముందు పైలట్ చివరి మాటలు ఇవే!

ABN , First Publish Date - 2020-05-23T02:49:46+05:30 IST

మేడే, మేడే, మేడే.. పాకిస్థాన్ విమానం కుప్పకూలడానికి ముందు పాకిస్థాన్ ఇంటర్నేషనల్

మేడే, మేడే, మేడే.. విమానం కూలడానికి ముందు పైలట్ చివరి మాటలు ఇవే!

కరాచీ:  మేడే, మేడే, మేడే.. పాకిస్థాన్ విమానం కుప్పకూలడానికి ముందు పాకిస్థాన్  ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం పైలట్ అన్న చివరి మాటలు ఇవే. విమానంలోని రెండు ఇంజిన్లు పనిచేయడం మానేసిన తర్వాత విమాన పైలట్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘లైవ్‌ఏటీసీ.నెట్’లో ప్రత్యక్షమయ్యాయి.


వెలుగులోకి వచ్చిన సంభాషణ ప్రకారం.. పీకే 8303 విమాన పైలట్, ఏటీసీతో మాట్లాడుతూ..  ‘మేడే, మేడే, మేడే’ అని చెబుతూ తాము ప్రమాదంలో ఉన్నామన్న సందేశాన్ని పంపాడు. రాడార్ నుంచి విమానంతో సంబంధాలు తెగిపోవడానికి కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఏర్పడిందని పైలట్ ఏటీసీకి తెలిపాడు. దీంతో స్పందించిన ఏటీసీ రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది.  అయినప్పటికీ పైలట్ గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా బాధాకరమైన ఘటన అని అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. 

 

పైలట్-ఏటీసీ మధ్య సంభాషణ ఇలా జరిగింది..

పైలట్: పీకే 8303 టు అప్రోచ్

ఏటీసీ: జీ సర్ 

పైలట్: మేం ఎడమవైపు తిరగాలా?

ఏటీసీ: కన్ఫామ్డ్

పైలట్: విమానం రెండు ఇంజిన్లు పాడయ్యాయి. మేం నేరుగా వెళ్తున్నాం

ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేయండి 

పైలట్: అర్థం కావడం లేదు

ఏటీసీ:   ల్యాండింగ్  కోసం 2, 5 రన్‌వే అందుబాటులో ఉంది

పైలట్: రోజర్

పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్థాన్ 8303

ఏటీసీ: పాకిస్థాన్ 8303, రోజర్ సర్ రెండు రన్‌వేలు అందుబాటులో ఉన్నాయి.

ఆ తర్వాత ఏటీసీ, పైలట్ మధ్య సంభాషణ కట్ అయింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం కరాచీలోని జనావాస ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు మినహా దాదాపు అందరూ దుర్మరణం పాలై ఉంటారని చెబుతున్నారు.  

Updated Date - 2020-05-23T02:49:46+05:30 IST