Abn logo
May 15 2020 @ 00:49AM

‘ఉగ్ర’ వేసవిలో కశ్మీర్‌

షాంఘై సహకార సంస్థ సమావేశంలో బుధవారం భారత్‌, పాకిస్థాన్‌ విదేశాంగమంత్రులు పరోక్షంగా ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌ మీద సంఘటితంగా పోరాడుతుంటే, కొన్ని దేశాలు అంతకంటే ప్రమాదకరమైన ఉగ్రవాద వైరస్‌ వ్యాప్తికి ప్రయత్నిస్తున్నాయని భారత విదేశాంగమంత్రి జయశంకర్‌ వ్యాఖ్యానిస్తే, ఉగ్రవాదంపై పోరు ప్రధానమే కానీ, దానిని ఇలా రాజకీయం చేయడం మరింత ప్రమాదకరమని పాకిస్థాన్‌ విదేశాంగమంత్రి వ్యాఖ్యానించారు. భారతప్రధాని నరేంద్రమోదీ సోమవారం అలీన దేశాల సదస్సులో పాల్గొన్నప్పుడు కూడా ఉగ్రవాదం గురించే ప్రముఖంగా మాట్లాడారు. మోదీ ప్రధాని అయిన తరువాత ‘నామ్‌’ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొనడం ఇదే ప్రధమం. ముప్పైదేశాధినేతల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మోదీ కరోనాపై సంఘటిత పోరు అవసరాన్ని ప్రకటిస్తూనే, ఈ సంకటస్థితి మధ్య కొన్ని దేశాలు తప్పుడు వార్తలతోనూ, కల్పిత వీడియోలతోనూ సమాజాలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో కూడా పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని పోత్సహిస్తూనే ఉన్నదని ప్రపంచానికి తెలియచెప్పేందుకు భారత్‌ అన్ని అవకాశాలనూ వాడుకుంటూనే ఉంది.


మొన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రధానమంత్రి ఫరూఖ్‌ ఏకంగా భారతదేశంమీద యుద్ధానికి సిద్ధపడాలని ఇమ్రాన్‌ ఖాన్‌ను కోరారు. భారతదేశానికి మాటలతో చెబితే సరిపోదనీ, చేతలతోనే చూపాలని ఆయన వ్యాఖ్యానించారు. దూరదర్శన్‌, ఆకాశవాణి తమ వాతావరణ వివరాల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాన్ని చేర్చడం ఈ తీవ్ర వ్యాఖ్యలకు ఆధారంగా ఆయన వాడుకున్నారు. గిల్గిత్‌, బాల్టిస్థాన్‌, ముజఫరాబాద్‌, మీర్‌పూర్‌ ఇత్యాది ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ విశేషాలను కూడా మన అధికారిక ప్రసార మాధ్యమాలు ప్రకటించడం మొదలుపెట్టగానే, ఇందుకు ప్రతిగా శ్రీనగర్‌, పుల్వామా, లద్దాఖ్‌ గరిష్ట కనిష్ఠ ఉష్ణోగ్రతలను పాకిస్థాన్‌ రేడియో మొన్న పదవతేదీ నుంచి చెప్పడం ఆరంభించింది. ఈ వాతావరణ యుద్ధాన్ని అటుంచితే, కరోనా కారణంగా కొద్దిరోజులు ఇరుదేశాల మధ్యా ఉపశమించిన ఉద్రిక్తత ఇటీవల తిరిగి పుంజుకుంది. పదిరోజుల క్రితం ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారా సెక్టార్‌లో పదహారుగంటల పాటు కొనసాగిన ఎన్‌కౌంటర్‌ ఇంతటి కష్టకాలంలోనూ పాకిస్థాన్‌ వైఖరిలో ఏ మార్పూరాలేదనడానికి ఓ ఉదాహరణ. ఈ ఘటనలో ఉగ్రవాదులతో పోరాడుతూ సైన్యంలోని అత్యున్నత స్థాయి అధికారులతో సహా ఆరుగురు మరణించారు. ఆ మర్నాడు సమీప గ్రామంలో కొందరు ఉగ్రవాదులు సీఆర్‌పిఎఫ్‌ జవాన్లపై దాడిచేసి ముగ్గుర్ని చంపివేశారు. దేశభద్రత రీత్యా ఎంతో కీలకమైన హంద్వారా సెక్టార్‌ను కావలికాయడం, అక్కడినుంచి భారతదేశంలోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడం ఎంతో కష్టమైనపని. హఠాత్తుగా విరుచుకుపడే ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో మన సైనికుల ప్రాణాలు పెద్ద సంఖ్యలో పోతున్నప్పటికీ, పాక్‌ సైన్యం ఎత్తుగడలను తిప్పికొట్టడంలో వారు అంతిమవిజయం సాధిస్తూనే ఉన్నారు.


అసలే కరోనా కష్టాల్లో ఉన్న కశ్మీర్లో తిరిగి సీమాంతర ఉగ్రవాదం పెరగడం అక్కడి ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నది. ఆర్మీ అధికారులు నేలకొరిగిన రెండురోజుల్లోనే అందుకు ప్రతీకారంగా హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కీలక కమాండర్‌ రియాజ్‌ నాయకూను మన భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ సంస్థకు చెందిన అతిముఖ్యమైన నాయకులు కూడా సైన్యం చేతికి చిక్కారు. కశ్మీర్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నాయకులు ఇలా నేలకొరుగుతున్న తరుణంలో పాకిస్థాన్‌కు దిక్కుతోచడం లేదు. బుర్హన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత కశ్మీర్‌ రగిలిపోయినట్టుగా, మరో కీలకనాయకుడు రియాజ్‌ నాయకూ మరణంతో కశ్మీర్‌ వేడెక్కిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇంటర్నెట్‌ సహా సమస్త సమాచార వ్యవస్థలనూ నీరసపరచిన నేపథ్యంలో, మరిన్ని కట్టుదిట్టాల మధ్య స్థానిక మిలిటెంట్లనూ, సీమాంతర ఉగ్రవాదులను భద్రతాదళాలు ఏరిపారేస్తున్నాయి. వేసవి తీవ్రమవుతున్నకొద్దీ మరిన్ని చొరబాట్లకు పాకిస్థాన్‌ సిద్ధపడుతున్నది. సరిహద్దుల్లో కనీసం నూటయాభైమంది ఉగ్రవాదులు తిష్టవేసుకొని కశ్మీర్‌లోకి చొరబడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్‌ కుట్రలను వమ్ముచేయడం, అంతర్జాతీయంగా దానిని ఏకాకి చేయడం కొనసాగుతూండవలసిందే.

Advertisement
Advertisement
Advertisement