Abn logo
Jul 25 2021 @ 01:28AM

కశ్మీర్‌లో ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌/జమ్మూ, జూలై 24: కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఓ ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. బందీపుర జిల్లాలోని సంబ్లార్‌ ప్రాంతంలో శోక్‌బాబా అడవుల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు కనిపించడంతో ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ముగ్గురు జవాన్లు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారని అధికారులు తెలిపారు. 


మందుపాతర పేలి జవాన్‌ మృతి

కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మందుపాతర పేలి హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కమల్‌దేవ్‌ వైద్య(27) అనే జవాన్‌ చనిపోయారు. కృష్ణ ఘాటీ సెక్టార్‌లో ముష్కరులు అమర్చిన మందుపాతరపై వైద్య అనుకోకుండా అడుగు పెట్టారు. ఇటీవల జమ్మూలో అదేపనిగా డ్రోన్లు ప్రయోగించినందుకు పాకిస్థాన్‌కు భారత్‌ ఓ సమావేశం లో తీవ్ర నిరసన తెలిపింది. పాక్‌ విజ్ఞప్తి మేరకు సరిహద్దు భద్రతా దళం(బీఎ్‌సఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్ల మధ్య జమ్మూలోని సుచేత్‌గఢ్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇరు దేశాల కమాండర్లు సమావేశం నిర్వహించారు. 


లద్దాఖ్‌లో 15 వేల భారత బలగాలు 

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ 15 వేల బలగాలను తూర్పు లద్దాఖ్‌లో మోహరించింది. వీరంతా కశ్మీర్‌లో ఉగ్రవాద కట్టడి ఆపరేషన్లలో పాల్గొనేవారు కావడం గమనార్హం. లెహ్‌లోని 14 కోర్‌ బలగాలకు ఈ బలగాలు సహకరిస్తున్నాయి. 17 మౌంటెయిన్‌ స్ట్రైక్‌ కోర్‌ బలగాలకు తాజాగా 10 వేల మంది అదనపు బలగాలను సైన్యం సమకూర్చింది. చైనాతో యుద్ధమొస్తే ముందు నుంచి నడిపించేది ఈ బలగాలే. కాగా, స్థానికేతరులకు 2012 నుంచి 2016 మధ్య అక్రమంగా 2.78 లక్షల ఆయుధాల లైసెన్సులు జారీ చేసిన కేసులో ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో 40 చోట్ల సీబీఐ శనివారం సోదాలు చేసింది. జమ్మూ, శ్రీనగర్‌, ఉధంపూర్‌, రాజౌరీ, అనంత్‌నాగ్‌, బారాముల్లాతో పాటు ఢిల్లీలోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. కశ్మీర్‌లో గిరిజన వ్యవహరాల కార్యదర్శిగా పనిచేస్తున్న షాహిద్‌ ఇక్బాల్‌ చౌధరి, ఢిల్లీలో అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ల నివాసాలను తనిఖీ చేశామని అధికారులు తెలిపారు. కాగా, తాలిబన్లపై ఆఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వ దళాలు పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. తప్పనిసరి ప్రయాణం, నివసించ డం, పని చేయడం, సందర్శించడం వంటి విషయాల్లో జాగరూకతతో వ్యవహరించాలని కోరింది.